‘బీజేపీ ముక్త్‌ భారత్‌’.. ప్రకాష్‌రాజ్‌కు కేసీఆర్ కీలక బాధ్యతలు!

ABN , First Publish Date - 2022-02-20T22:11:05+05:30 IST

ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు.

‘బీజేపీ ముక్త్‌ భారత్‌’.. ప్రకాష్‌రాజ్‌కు కేసీఆర్ కీలక బాధ్యతలు!

హైదరాబాద్: ‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారంలో ముంబైలో పర్యటించారు. తొలుత ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. తదుపరి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ భేటీ కానున్నారు. అయితే ముంబై పర్యటనలో ఊహించని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఉద్ధవ్‌ ఠాక్రే భేటీకి ముందు కేసీఆర్ విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ స్వాగతం పలికారు. షెడ్యూల్‌లో ఎక్కడా ప్రకాష్‌రాజ్ పేరు వినిపించలేదు. అంతగోప్యంగా పెట్టారు. ఉన్నట్లుండి ప్రకాష్‌రాజ్ ఊడిపడడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. 


కేసీఆర్, ప్రకాష్‌రాజ్ మధ్య బంధం ఈ నాటిది కాదు. కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు ప్రత్యేకంగా ప్రగతిభవన్‌కు ప్రకాష్‌రాజ్‌ను పిలిపించుకున్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రకాష్‌రాజ్‌తో సీఎం ఓ పూటంతా గడిపారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తూ జాతీయ రాజకీయాలపై చర్చించుకున్నారని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. అప్పుడే కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేయాలని వ్యూహాలను రచిస్తున్న సమయంలో ప్రకాష్‌రాజ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ప్రకాష్‌రాజ్‌తో కేసీఆర్ సమాలోచనలు చేయడానికి కారణం కూడా లేకపోలేదు. జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై ప్రకాశ్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు. ప్రకాష్ రాజ్‌ను కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయనను భేటీకి ఆహ్వానించినట్లు ప్రచారం కూడా జరిగింది. 


దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాజకీయ నేతలతో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. ఫెడరల్ ఫ్రంట్‌‌ను బలోపేతం చేసేందుకు ప్రకాష్‌రాజ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరిగింది. అప్పట్లో మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ భేటీకి కేసీఆర్, ప్రకాష్‌రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. ఇదిగో ఇప్పుడు కూడా ముంబై పర్యటనలో ప్రకాష్‌రాజ్‌‌కు చోటు కల్పించారు. అంతలా గొప్ప అనుబంధం వీరిది. ఉద్ధవ్‌‌తో భేటీ తర్వాత కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అవుతారని చెబుతున్నారు. కేసీఆర్, స్టాలిన్ భేటీ వెనుక ప్రకాష్‌రాజ్ కీలకం కానున్నారని చెబుతున్నారు. ఎందుకంటే స్టాలిన్‌తో ప్రకాష్‌రాజ్‌కు మంచి సంబంధాలున్నాయి. మొదటి నుంచి సెక్యులరిజం భావజాలం పట్ల ప్రకాష్‌రాజ్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందువల్లే స్టాలిన్‌కు ప్రకాష్‌రాజ్ దగ్గరయ్యారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న కూటమిలో ప్రకాష్‌రాజ్‌కు సముచిత స్థానం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2022-02-20T22:11:05+05:30 IST