కేసీఆర్ దబాయింపులు! ఏపీ దేబిరింపులు!

ABN , First Publish Date - 2021-07-07T06:00:58+05:30 IST

అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం–1956 సెక్షన్ 3 మేరకు కృష్ణ జలాలు తిరిగి పంపిణీ జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చట్టం కింద ఏర్పడి...

కేసీఆర్ దబాయింపులు! ఏపీ దేబిరింపులు!

అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం–1956 సెక్షన్ 3 మేరకు కృష్ణ జలాలు తిరిగి పంపిణీ జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చట్టం కింద ఏర్పడి దాదాపు 50ఏళ్లుగా అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పును తిరస్కరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‍కు 512 టియంసిలు తెలంగాణకు 299.99 టియంసిలు అన్నది కృష్ణ బోర్డు ద్వారానో, లేక రెండు రాష్ట్రాల అధికారులు చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ద్వారానో లభించలేదు. అది రాజ్యాంగబద్ధంగా నియమితమైన బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు.


బచావత్ ట్రిబ్యునల్ 1969లో బేసిన్‍లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రామాణికంగా తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కే కాకుండా బేసిన్‍లోని అన్ని రాష్ట్రాలకు 75 శాతం నీటి లభ్యత కింద 2130 టియంసిల నికర జలాలను పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు పునరుత్పత్తి కింద 11 టియంసిలతో కలిపి 811 టియంసిలు కేటాయించింది. ఈ నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భావించినట్లయితే ఆ అన్యాయమేదో బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య కేటాయింపులైనప్పుడే జరిగివుండాలి గాని కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు కేటాయించినపుడు మాత్రమే కాదన్న నిజాన్ని మరిచిపోతున్నారు. ఈ మొత్తం అధ్యాయంలో ఇది కీలకాశం. ఒకవేళ తిరిగి పంపకం జరిగినా బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య జరగాలి. న్యాయంపరమైన ఈ అంశాన్ని మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చిపోయి ప్రకటనలు చేస్తుంటే ఆంధ్ర పాలకులు మౌన రాగం ఆలపిస్తున్నారు.


అంతేకాదు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా స్పష్టంగా ఉన్నాయి. తెలంగాణకు చిన్న నీటి వనరుల కింద 89.16 టియంసిలు ఆంధ్ర ప్రదేశ్‍కు 22.17 టియంసిలు కేటాయించారు. కృష్ణ డెల్టాకు 181.20 టియంసిలు కేటాయించగా ఆధునికీకరణ కింద మిగిలిన 29 టియంసిల్లో 20 టియంసిలు తెలంగాణలోని భీమాకు 9 టియంసిలు పులిచింతలకు కేటాయించబడ్డాయి. ఇందులో కూడా సాగర్ దిగువ భాగంలో లభ్యమయ్యే నీరు పోగా మిగిలిన కోటా నీరు సాగర్ నుండి డెల్టాకు వదిలి పెట్టాలి. సాగర్ కుడి కాలువకు 132 టియంసిలు ఎడమ కాలువకు 132 టియంసిలు కేటాయించింది. అయితే ఇందులో తెలంగాణకు 99.75 టియంసిలు ఆంధ్ర ప్రదేశ్‍కు 32.25 టియంసిలుగా ఉన్నాయి.


ఇక శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణకు జూరాలకు 17.9 టియంసిలు భీమాకు 20 టియంసిలు మాత్రమే నికర జలాలు ఉన్నాయి. ఏపీకి శ్రీశైలం జలాశయం నుంచి శ్రీశైలం కుడి కాలువకు 19 టియంసిలు కెసి కెనాలుకు 10 టిఎంసిలతో పాటు చెన్నై తాగునీటికి 15 టియంసిల నికర జలాలు విడుదల కావలసి వుంది. ఇక తుంగభద్ర సబ్ బేసిన్‍లో ఏపీకి తుంగభద్ర ఎగువ దిగువ కాలువలకు 62 టియంసిలు కెసి కెనాల్‍కు 39 టియంసిలు భైరవానితిప్ప(వేద వతి నుండి)కు 4.90 టియంసిలు కేటాయింపులు ఉన్నాయి. 


ఒక వేళ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నట్లు సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ నియమింపబడినా (న్యాయ పరంగా రెండు రాష్ట్రాల మధ్య అసాధ్యం) ఆ తీర్పు వెలువడే వరకు కేసీఆర్ కాదు దేవుడు దిగివచ్చినా బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు అమలు జరగవలసినదే. ఒక ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసి అవి వినియోగంలో వుంటే ఇక వాటిని తిరిగి పంపిణీ చేసే అవకాశం లేదు. కాబట్టి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జోలికి వెళ్లకుండా మిగులు నికర జలాలను బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ప్రాతిపదికన చెరి సగం నీటి వాటాను తెర మీదకు తెచ్చారో తెలియదు. 


వీటితో పాటు రాష్ట్ర విభజన చట్టంలో మిగులు జలాల ఆధారంగా నిర్మింపబడిన ఏడు ప్రాజెక్టులున్నాయి. ఇవి శ్రీశైలం జలాశయాన్ని ఆశ్రయించుకొనే ఉన్నాయి. తెలంగాణ వేపు 77 టియంసిల సామర్థ్యంతో నెట్టెంపాడు కల్వకుర్తి శ్రీశైలం ఎడమ కాలువ, ఆంధ్ర ప్రదేశ్‍లో 150. 50 టియంసిల సామర్థ్యంతో హంద్రీనీవా గాలేరు నగరి వెలుగొండ తెలుగు గంగ ఉండగా నికర జలాలు పోగా మిగిలిన జలాలను ఈ ప్రాజెక్టులకు ఉపయోగించుకొనే అవకాశం వుంది. ఆ నీరు ఉపయోగించుకొనేందుకే పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు చేపట్టబడ్డాయి. రాష్ట్ర విభజన చట్టం కూడా ఈ ప్రాజెక్టులు మినహా కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆమోదం పొందాలని చెబుతోంది. కేసీఆర్ ఇవేవీ పట్టించుకోకుండా పాత జీవోలు చూపెట్టి కృష్ణ బేసిన్‍లో భారీ ఎత్తున పథకాలు చేపట్టి చెరి సగం వాటా తెర మీదకు తెచ్చారు. ఈ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినా న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉంది. కాబట్టి కేసీఆర్ ఆటలేమీ చెల్లుబాటు కావు. కానీ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటలు కట్టించేందుకు అవసరమైనంత చొరవ చూపటం లేదు. 


ఆర్డీయస్ కుడి కాలువతో పాటు పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులతోనే కేసీఆర్ ఏపీతో తగాదా పెంచారనేది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఆర్డీయస్‍కు నోటిఫై కాని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు టిఎంసిలు కేటాయించింది. దీనికి ఆమోద ముద్ర పడలేదనేది కేసీఆర్ వాదన అనుకుంటే అదే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకకు ఆల్మట్టి ఎగువన 130 టియంసిలు కేటాయించింది. దీనికీ ఆమోద ముద్ర పడలేదు. గమనార్హమైన అంశమేమంటే ఈ జలాలు వినియోగించుకొనేందుకు కేంద్ర జల సంఘం ఇటీవల అనుమతి మంజూరు చేసింది. ఎగువ భాగంలో ఇంత పెద్ద మొత్తంలో కర్ణాటక కృష్ణ జలాలను వినియోగించుకొనేందుకు సన్నద్ధమౌతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెత్తు మాట అనడం లేదు. ఏపీ ముఖ్యమంత్రికి అంతకన్నా పట్టడం లేదు. 


తెలంగాణకు శ్రీశైలం ఎగువ భాగంలో 37.50 టియంసిల నికర జలాలే కేటాయింపులు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం మేరకు 77టియంసిల మిగులు జలాల మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేని కొత్త ప్రాజెక్టులే. గత అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. ఇది పరిశీలించిన కేంద్ర మంత్రి షెకావత్ ఢిల్లీ వెళ్లిన తర్వాత దఫాలుగా ఆదేశాలు జారీ చేశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని, డిపిఆర్‍లు కేంద్ర జల సంఘానికి సమర్పించాలని కోరారు. సాంకేతిక అనుమతులు లేని ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేసినా, నిర్మాణ స్థలం మార్చి నీటి సామర్థ్యం అంచనాలు మారి ఉన్నా అవి కూడా కొత్త ప్రాజెక్టులేనని వాటి నిర్మాణాలను ఆపి డిపిఆర్‍లు సమర్పించాలని రెండు రాష్ట్రాలను కోరారు. ఈ ఆదేశాలను రెండు రాష్ట్రాలు పట్టించుకోలేదు


కేంద్ర జలవనరుల శాఖ పనులు నిలుపుదల చేయాలని డిపిఆర్‍లు పంపమని కోరిన జాబితాలో పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనను ఆధారం చేసుకొని ఏపీ ప్రభుత్వం కాంపిటెంట్ కోర్టుకు వెళ్లి అనుగుణమైన ఆదేశాలు ఎందుకు పొంద లేదు? ఈ పథకాలు 11వ షెడ్యూల్ లో లేవు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పైగా రీడిజైనింగ్ పేరుతో కొత్త ప్రాజెక్టులు తెలంగాణ నిర్మించు తోందని కోర్టుల దృష్టికి ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకు రాలేదు? 


టిడిపి హయాంలోనే 240 టియంసిల గోదావరి జలాలు కృష్ణ బేసిన్‍కు తెలంగాణ తరలిస్తోందని గోదావరి బోర్డు సమావేశాల్లో పలు మార్లు ఫిర్యాదు చేశారు. కృష్ణ బేసిన్ నుంచి పెన్నా బేసిన్‍కు ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జలాలను తరలిస్తోందని మొదటి నుంచి తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ మాత్రం గోదావరి బేసిన్ నుంచి కృష్ణ బేసిన్‍కు నీరు తరలించుతోందని ఆ రోజుల్లో టిడిపి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తెలంగాణ మంత్రులు కృష్ణ జలాలను పక్క బేసిన్‍కు ఏపీ తరలిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాని ఒక్క ఏపీ మంత్రి, తుదకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి కూడా, గోదావరి జలాలను తెలంగాణ కృష్ణా బేసిన్‍కు ఎలా తరలిస్తోందని ప్రశ్నించడం లేదు.


ముఖ్యమంత్రి కేసీఆర్ అటు గోదావరిపై ఇటు కృష్ణ నదిపై పాత జీవోలు చూపెట్టి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పలు కొత్త పథకాలను రీడిజైనింగ్ పేరుతో నిర్మాణం సాగిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక్క పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులుపై కోర్టు కేసులకు జవాబులు చెప్పుకోలేక సతమతమౌతోంది 


ఈ బలహీనతలు ఆధారం చేసుకొనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయ సమీక్షకు నిలవలేని, దబాయింపుతో కూడిన, చెరిసగమనే సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చారు. అంతవరకైతే ఫర్వాలేదు. కానీ ఖజానాలోని నిధులతో పాటు భారీ ఎత్తున అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తెలంగాణ తరఫున పోరాడే వీరుడి ఇమేజ్ కోసం కేసీఆర్ ఇటువంటి వాదనలను వినిపిస్తుండగా, ఆంధ్ర ప్రదేశ్‍ వైపు నుంచి ఈ వాదనలను తిప్పికొట్టే చొరవ ఏమాత్రం కనిపించటం లేదు, పైగా బెదిరి బతిమాలే ధోరణే కనిపిస్తోంది. 

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2021-07-07T06:00:58+05:30 IST