
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ రైతులతో ఆటలాడుతోందని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అని ప్రచారం చేసిన ఈ ప్రభుత్వం... ఇప్పుడు రైతుల నుంచి సర్వీస్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రైతులు సర్వీస్ చార్జీలు కట్టడం లేదని ట్రాన్స్కో ఆఫీసర్లు కనెక్షన్లు కట్ చేశారని, గతంలో పొలాల్లో తిరుగుతూ స్టార్టర్లు పీక్కెళ్లగా... ఇప్పుడు ఏకంగా ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ బంద్ పెడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. డొమెస్టిక్ కనెక్షన్లు కూడా కట్ చేసి రైతుల ఇళ్ళలో చీకట్లు నింపుతున్నారని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
''కేసీఆర్ సర్కార్ రైతులతో ఆటలాడుతోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అని ప్రచారం చేసిన ఈ ప్రభుత్వం... ఇప్పుడు రైతుల నుంచి సర్వీస్ చార్జీల పేరుతో డబ్బులు వసులు చేస్తోంది. తాజాగా రైతులు సర్వీస్ చార్జీలు కట్టడం లేదని ట్రాన్స్కో ఆఫీసర్లు కనెక్షన్లు కట్ చేశారు. గతంలో పొలాల్లో తిరుగుతూ స్టార్టర్లు పీక్కెళ్లగా... ఇప్పుడు ఏకంగా ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ బంద్ పెడుతున్నారు. డొమెస్టిక్ కనెక్షన్లు కూడా కట్ చేసి రైతుల ఇళ్ళలో చీకట్లు నింపుతున్నారు. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలోనే నాలుగు మండలాల్లో 50 ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ కట్ చేయడంతో సుమారు 400 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. సీఎం స్వంత జిల్లాలోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాల పరిధిలోనూ మూడు రోజులుగా ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ కట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. ఫ్రీ కరెంట్ కావడం వల్లే తాము ఎలాంటి బిల్లులు కట్టట్లేదని... కరెంటోళ్లేమో ఇలా ట్రాన్స్ఫార్మర్లు బంద్పెడ్తూ తమ పొలాలు ఎండపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ సర్కారు చెబుతున్నా.. ట్రాన్స్కో మాత్రం సర్వీస్ చార్జీల కింద నెలకు రూ.30 చొప్పున ఏడాదికి రూ.360 వసూలు చేస్తోంది. కొందరు రైతులు మాత్రం తమకు సర్కారు ఫ్రీ కరెంట్ ఇస్తుండగా, మళ్లీ ఈ సర్వీస్ చార్జీలు తామెందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సర్వీస్ చార్జీల గురించి తెలిసిన కొంతమంది చెల్లిస్తుండగా, అసలు సర్వీస్ చార్జీల సంగతి తెలియని వారు కట్టకపోవడంతో ఏండ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి వసూళ్ల కోసం తిరుగుతున్న ట్రాన్స్కో సిబ్బంది అన్ని జిల్లాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్టార్టర్లు పట్టుకెళ్తున్నారు. సర్వీస్ చార్జీలు మొత్తం కడితేనే తిరిగి ఇస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా.... లేదా ఏదైనా సమస్య వచ్చినా... దాని పరిధిలోని రైతులందరూ సర్వీస్ చార్జీలు కడితేనే రిపేర్ చేస్తున్నారు. సర్వీస్ చార్జీలు కట్టకపోతే రైతులను అడగాలి కానీ పొలాలకు కరెంట్ కట్ చేయడం ఎంత వరకు సమంజసం కేసీఆర్? ఇప్పటికే వడ్లు కొనమని రైతులను అయోమయంలో పడేసిన కేసీఆర్ ఇప్పడు మొత్తానికే ఎసరు పెట్టిండు. రైతులతో ఆటలాడుతున్న ఈ సర్కార్కు యావత్ తెలంగాణ రైతాంగం కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు.'' అని విజయశాంతి అన్నారు.