కేసీఆర్‌ బానిసల్లారా.. ప్రజల సొమ్ముకు మీరు ఓనర్లు కాదు

ABN , First Publish Date - 2021-10-25T06:08:42+05:30 IST

ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావంటున్నారట, కేసీఆర్‌ బానిసళ్లారా ప్రజల సొమ్ముకు మీరు ఓనర్లు కాదు అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

కేసీఆర్‌ బానిసల్లారా.. ప్రజల సొమ్ముకు మీరు ఓనర్లు కాదు
వీణవంక మండలం కనపర్తిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

 మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

కరీంనగర్/వీణవంక: ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావంటున్నారట, కేసీఆర్‌ బానిసళ్లారా ప్రజల సొమ్ముకు మీరు ఓనర్లు కాదు అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం వీణవంక మండలంలోని కనపర్తి, వల్భాపూర్‌, హిమ్మత్‌నగర్‌, కొండపాక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నయ నిజాం  రాజు లాగా వ్యవహరిస్తున్నారన్నారు. నిజాం లెక్క కేసీఆర్‌ రాజ్యంలో కూడా రాచరికం కొనసాగుతుంది తప్ప ప్రజాస్వామ్యం లేదన్నారు. కేసీఆర్‌ రెండో సారి గెలిచిన తర్వాత ఎవరు ఇతర పార్టీలో ఉండవద్దనే నియంతలాగా తయారయ్యారన్నారు. దుబ్బాకలో కూడా బీజేపీకి ఓటు వేస్తే మీటర్లు పెడతారన్నారని, అది జరగలేదన్నారు. అక్కడి ప్రజల పెన్షన్లు, రేషన్‌ కార్డులు పోలేదన్నారు. ఓడిపోతున్నామనే భయంతో టీఆర్‌ఎస్‌ కాళ్ల కింద భూమి కదిలిపోతుందన్నారు. తనను ఓడించాలని నీచమైన కుట్రలో భాగంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. వెన్నుపోటు పొడిచింది నేనా..? కేసీఆరా..? అని అడిగితే కేసీఆరే అని ప్రజలంతా చెబుతున్నారన్నారు.


ఏప్రిల్‌ 30న చిల్లర ఆరోపణ చేసి, మే 2న మెడలు పట్టి బయటికి పంపించారన్నారు. కరోనా లాంటి గంభీరమైన సమయంలో మంత్రి పదవి తీసివేయడం బాధ అనిపించింది తప్ప, మంత్రి పదవి పోయినందుకు కాదన్నారు. రాజీనామా చేస్తావా లేదా అని డిమాండ్‌ చేస్తే వారి మొఖాన కొట్టి వచ్చానన్నారు. రేవంత్‌, ఈటల రాజేందర్‌లు కుమ్మక్కయ్యారని కేటీఆర్‌ అంటున్నారని, మే 7న మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కూతురు ఎంగేజ్‌మెంట్‌కి ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి వెళ్లానని, అక్కడ సండ్ర వెంకటవీరయ్య కూడా ఉన్నాడన్నారు. రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారని, పెళ్లిలో కలిస్తే మట్లాడుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తెల్ల రేషన్‌కార్డు చూపిస్తే ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదన్నారు. 1300 కోట్ల బాకీ ఆరోగ్యశ్రీకి ఉందని, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వాల్సింది పోయి ఇక్కడ డబ్బులు పంచుతున్నారన్నారు. తడిసిన ధాన్యం కొనాల్సిన మంత్రి మందు పంచుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం మీద, రైతుల వడ్ల మీద శ్రద్ధ లేదని, కేవలం రాజేందర్‌ను ఓడించడమే వారి పని అన్నారు.


మద్యం మీదనే రాష్ట్రానికి 30 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, వినోద్‌కుమార్‌లాంటి వాళ్లంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. గౌరవం లేని చోట ఉండకూడదని, ఇజ్జత్‌ లేని బతుకు వద్దని పదవికి రాజీనామా చేసి వచ్చానన్నారు. మీరిచ్చిన పదవే అయినా.. పూలమ్మిన చోట.. కట్టెలమ్మవద్దని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చానన్నారు. రెండు వేల కోట్ల రూపాయల భూములమ్మి నన్ను ఓడించేందుకు దళితబంధు తెచ్చారన్నారు. దళితబంధు ఆపారని  దొంగ ఉత్తరం సృష్టించారన్నారు. 30వ తేదీ హుజూరాబాద్‌ నుంచే కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలన్నారు. 

Updated Date - 2021-10-25T06:08:42+05:30 IST