ఇక సాలు దొర.. సెలవు దొర!

Published: Thu, 30 Jun 2022 01:21:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇక సాలు దొర.. సెలవు దొర!

అరచేతిల ‘బెల్లం’ అని రాసి నాకితే, తీపయితదా? అట్లనే ‘అభివృద్ధిలో గ్రేటు, మార్చేశినం తెలంగాణ ఫేటు’ అని ప్రాసలతో మెట్రో పిల్లర్ల మీద, బస్టాండ్ల మీద రంగు రంగుల ప్రకటనలు ఇప్పించుకుంటే అభివృద్ధి అయిపోయినట్టేనా? 2014లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో మొత్తం 32 పేజీలు. 2018లో మెనిఫెస్టో మొత్తం 15 పేజీలు. అసలు ఈ మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేసిన్రో, శ్వేత పత్రం విడుదల చేయడానికి గానీ, చర్చించడానికి గానీ మీరు సిద్ధంగా ఉన్నరా? మీ సామెతలు, మాయ మాటలతో తెలంగాణ ప్రజలను అరిగోసలు పెట్టింది సాలు దొర.. సెలవు దొర!


ఎనిమిదేండ్లయింది, నా తెలంగాణ పల్లెల్లో పెంకల ఇండ్లూ, రేకులిండ్లూ, గుడిసెలూ... ఇంకా డబుల్‌ బెడ్రూం ఇండ్లు కాలే. నా తెలంగాణ బక్క రైతు మెడలో అప్పుల ఉరితాడు తెగలే. ఇంకా నా నిరుద్యోగ తమ్ముండ్ల కండ్లళ్ల ఎర్రని ఎదురుచూపులే తప్ప ఇంటికో ఉద్యోగం రాలే. బడులు, విశ్వవిద్యాలయాలు బాగుపడలే. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుగాక, తల్లిదండ్రుల ఫీజుల కష్టాలు పోలే. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ రాలే. ఆస్పత్రికి ఖర్చుల కన్నీళ్లూ తగ్గలే. ఎనిమిదేండ్లయింది, దళితుడిని ముఖ్యమంత్రిని చెయ్యలే, దళితులందరికీ మూడెకరాల భూమీ పంచలే, దళితబంధు ఇయ్యలే. గిరిజనులకు ఇస్తనన్న పన్నెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇయ్యలే. కరీంనగర్‌ లండన్‌ కాలే, వరంగల్‌ డల్లాస్‌ కాలే, పాత బస్తీ ఇస్తాంబుల్‌ కాలే. మీ పిట్టల దొర మాటలు సాలు దొర.. సెలవు దొర!


అసలు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నరా? కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తూ ప్రగతి భవన్‌ నుంచి ఫామౌజ్‌కి, అటూ ఇటూ తిరుగుడు తప్ప, ఆయన ఏనాడైనా ప్రజల కష్టాలు విన్నరా? తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను ఏ రోజూ ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తలచుకోలేదు. వాళ్ల కుటుంబాలను ఆదుకోలేదు. మంచిగున్న సచివాలయం కూలగొట్టి కొత్తది కట్టించుకోవడానికి, టైం ఉంటది. ప్రగతి భవన్‌, ఫామౌజ్‌కి మరమ్మత్తులు చేయించుకోవడానికి టైం ఉంటది. కానీ, పక్కనే ఉన్న అమరవీరుల స్తూపాన్ని, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏండ్లకు ఏండ్లయినా పూర్తి చేయడానికి గానీ, అక్కడ పరిస్థితి ఎట్లుందో చూడటానికి మాత్రం టైం ఉండదు. జయశంకర్‌ సార్‌ గురించి ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతయ్‌గానీ, కోట దాటొచ్చి ఆయనకు నివాళులు అర్పించిన సందర్భాలే కనపడవు. ఈ ఎనిమిదేండ్లల్లో టీఆర్‌ఎస్‌ ప్రజల పార్టీగా కాకుండా– కుటుంబ పార్టీగా, ఉద్యమ పార్టీగా కాకుండా– ఉద్యమ ద్రోహలను భుజాన మోసే పార్టీగా అవతరించింది. ఇగ మీ నియంత పోకడ సాలు దొర.. సెలవు దొర!


జూబ్లీహిల్స్‌తో సహా పలు ప్రాంతాల్లో వరుసగా మైనర్‌ బాలికలపై అత్యాచారాలు జరిగితే, సీఎం కేసీఆర్‌ కనీసం ఖండించలేదు. సత్వర న్యాయం చేస్తమని బాధితులకు భరోసా ఇయ్యలేదు. ఇలాంటి దురాగతాలకు పాల్పడితే సత్వర చర్యాలుంటాయనే సందేశం కూడా ప్రజలకు పంపలేదు. రాష్ట్రంలో 2014లో 938 పోక్సో కేసులు నమోదయితే, 2021లో అవి ఏకంగా 2567కి పెరిగినయ్‌, బాధ్యతలేని పాలనే దీనికి కారణం. ఊళ్లను బార్లకు, సిటీలను డ్రగ్స్‌కు, పబ్బులకు అప్పగించి, టీఆర్‌ఎస్‌ మన తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసింది. 


ఉద్యమ ఆకాంక్షల కోసం టీఆర్‌ఎస్‌ని ఎదురించి పోరాడ్తదని కాంగ్రెస్‌ నాయకులను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, రెండు దఫాలుగా వాళ్లు గెలవంగనే గులాబీ గూటికి చేరిన్రు. తెలంగాణలో 2014 నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కావొచ్చు, ఎమ్మెల్సీలు కావొచ్చు, స్థానిక సంస్థల ప్రతినిధులు కావొచ్చు... వారిలో ఎంతమంది అమ్ముడుపోయిన్రో తెలంగాణ ప్రజలకు లెక్కలతో సహా తెలుసు. ఇట్లా అమ్ముడుపోయే నాయకులను సప్లయి చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కి కొమ్ముకాస్తున్నది. అందుకే, ఈ రెండు పార్టీల్లో దేనికి ఓటేసినా లెక్క మాత్రం ఒక్క ఖాతాలోకే పోతది. కాంగ్రెస్‌ నాయకులు అంగడీలో సరుకులాగా అమ్ముడుపోతుంటే, బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై సంగ్రామం చేస్తున్నది. నయా నిజాంకు ఎదురు తిరుగుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఏ ఒక్కరూ అమ్ముడు పోలేదు. పోరాట జెండాను ఎత్తుకొని ప్రజల గొంతై ప్రశ్నిస్తున్నరు.


కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం... వీళ్లందరూ ఒక్కటే. టీఆర్‌ఎస్‌– కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేస్తది. కాంగ్రెస్‌– గాంధీ కుటుంబం కోసం పని చేస్తది. ఎంఐఎం– ఓవైసీ సోదరుల కుటుంబం కోసం పని చేస్తది. ఇలాంటి బంధుప్రీతి, అవినీతి పార్టీల వల్ల వారి బంధువర్గం బాగుపడ్తది కానీ, ప్రజల బతుకులు బాగుపడయ్‌. 2004–14 మధ్య కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని కుంభకోణాల ఊబిలో కూరుకుపోయేలా చేస్తే, ఇక్కడ ఈ ఎనిమిదేండ్లలో టీఆర్‌ఎస్‌ తమ బంధువర్గాన్ని కోటీశ్వరులను చేసుకొని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.


టీఆర్‌ఎస్‌ బ్యాలెన్స్‌ షీట్‌ చూసి టికెట్‌ ఇస్తది. దానికి నిదర్శనం మొన్నటికి మొన్న రాజ్యసభకు ఎన్నికైన ఆ పార్టీ ఎంపీలు. సిగ్గుపడాల్సిన విషయం ఏందంటే, పీసీసీ ప్రెసిడెంట్‌ పదవిని కొనుక్కున్నరని స్వయంగా వాళ్ల పార్లమెంటు సభ్యులే బహిరంగంగా చెప్పడం! ఇతర పార్టీల్లాగ బీజేపీ కుటుంబ పార్టీ కాదు. క్రమశిక్షణ గల పార్టీ. బయోడేటాను చూసి బాధ్యతా యుతమైన ప్రతినిధులను ఎంపిక చేసే పార్టీ. సామాజిక న్యాయాన్ని ఆచరణలో పెట్టే పార్టీ. బీజేపీ నుంచి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక ఒక దళితుడు రాష్ట్రపతి అయిన్రు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు వచ్చినయ్‌. బీసీలకు జాతీయ కమిషన్‌ ఏర్పాటైంది. దేశంలో మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 27మంది బీసీలకు చోటు దక్కింది. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును ప్రకటించింది.


విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, విద్యుత్‌ సిబ్బంది... ఇట్లా సకల జనులు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్య కుండా అరవై ఏండ్లు అరిగోసలు పెట్టిన కాంగ్రెస్‌, తెలంగాణ ఇచ్చినమని ప్రచారం చేసుకుంటున్నది. ఉద్యమ ద్రోహులను పల్లకిలో మోస్తున్న టీఆర్‌ఎస్‌ మేమే తెచ్చినమని గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ ఇక్కడ ఒకటి చెప్పాలే– 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి పురుడుపోసింది బీజేపీ అనుబంధ ఏబీవీపీ. మలిదశ ఉద్యమంలో అన్ని పార్టీలకంటే ముందు రాష్ట్ర విభజనపై స్పష్టంగా తీర్మానం చేసింది బీజేపీ. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చింది బీజేపీ. ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చడానికి నియంతృత్వ కుటుంబ పాలనపై పోరాటం సాగిస్తున్నది బీజేపీ.


ఆశపడి ఎల్లిపాయలు తిన్నా రోగం అట్లనే ఉన్నట్టు, ఉద్యమ పార్టీ అని టీఆర్‌ఎస్‌ని గెలిపిస్తే, తెలంగాణ పరిస్థితి కొంచెం కూడా మారలే. కాళేశ్వరమని, లిఫ్టులని, డ్యాములని, మిషన్‌ కాకతీయ అని డంబాలు గుప్పించిన్రు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని నీళ్లు పారినయో, ఇయ్యాళ కూడా తెలంగాణల అన్నే నీళ్లు పారుతున్నయ్‌. కృష్ణ, గోదావరి పరివాహాక జిల్లాల్లో నీళ్ల గోసలు తీరక, నేటికీ పాలమూరు సహా తెలంగాణ పల్లెల్ల వలసలు ఆగలే. పేరుకే ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఎవుసం ఎండుతున్నది. రైతు గుండె మండుతున్నది. ‘రైతు బంధు’ పేరు చెప్పి మస్తు చేసినమని పబ్లిసిటీ చేసుకుంటున్నరు. కానీ, వాళ్లు ఇచ్చిన హామీ ప్రకారం ఇంత వరకు ఉచిత ఎరువులను రైతులకు ఇయ్యలే. రుణమాఫీ చెయ్యలే. రబీ సీజనులో వరి మీద గడికో మాటతో భయపెట్టి, రైతుల ఉసురు పోసుకున్రు.


తెలంగాణలో ఇప్పుడు ప్రతి వర్గం గోస పడుతున్నది. ప్రతి ఉద్యమకారుడు, ప్రతి మేధావి నిరాశలో కూరుకుపోయిండు. అమరవీరుల కుటుంబాలు ఆవేదనలో మసులుతున్నయ్‌. లాఠీలకు, జైళ్లకు తలొగ్గకకుండా ఉద్యమంలో కొట్లాడిన ఉద్యమ నాయకులకు, విద్యార్థులకు రాజకీయ అవకాశాలు లేకుండా పోయినయ్‌. కాబట్టి, తెలంగాణ ఆత్మగౌరవం నిలపడం కోసం జూలై మూడో తేదిన హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్సులో బీజేపీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నది. దొరల పాలన నుంచి మరోసారి విమోచన కలిగించడానికి, సామాజిక న్యాయానికి పునాదులు వేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ అధినాయకత్వం అంతా తెలంగాణ ప్రజలకు అండగా నిలవడానికి వస్తున్నది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో కాషాయ జెండాతో నడుం కడదాం, దొర పాలనకు సెలవిద్దాం. రాబోయే రోజుల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకుందాం.


ఇక సాలు దొర.. సెలవు దొర!

బండి సంజయ్‌ కుమార్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.