
Hyderabad : తొమ్మిది నెలలుగా సీఎం కేసీఆర్(CM KCR) రాజ్‌భవన్(Raj Bhavan) వైపు చూసింది కూడా లేదు. తెలంగాణ హైకోర్టు(High Court) కొత్త సీజే(CJ)గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై(Governer Tamilsie) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఇద్దరూ పక్కపక్కనే కూర్చొన్నారు. కానీ తొలుత కేసీఆర్, తమిళిసై ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంగానే కనిపించారు. కేసీఆర్‌ను తమిళిసై పలకరించారు. కానీ కేసీఆర్ చూసీచూడనట్టుగా వ్యవహరించారు. కేసీఆర్ వ్యవహార శైలితో గవర్నర్ సైతం మౌనంగా ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్పాహారం సమయంలో మాత్రం ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నట్టే కనిపించింది.
గత కొంత కాలంగా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్‌భవన్ అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. క్రమక్రమంగా రాష్ట్రంలో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం గ్యాప్ ఎవరూ పూడ్చలేని స్థాయికి చేరుకుంది. గతంలో టీఆర్ఎస్ పంపించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. ఇది ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు దారి తీసింది. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాపీలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర పథకాలను కూడా హైలెట్ చేస్తూ గవర్నర్ తమిళ సై ప్రసంగించడం సీఎం కేసీఆర్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది కాస్తా అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. ఆ తరువాత గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు సీఎం, గవర్నర్ల మధ్య మరింత మంట పెట్టాయి. మొత్తానికి 9 నెలల తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ మెట్లెక్కారు. మొత్తానికి అల్పాహార సమయంలో గవర్నర్‌ను ఆత్మీయంగా పలకరించి రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య దూరాన్ని కేసీఆర్ కాస్త తగ్గించారు.