కేసీఆర్‌ సారూ.. ‘పెట్రో’ ట్యాక్స్‌ తగ్గించరూ!

ABN , First Publish Date - 2022-05-23T08:30:12+05:30 IST

పెట్రో ధరలు మీరు తగ్గించాలంటే మీరే తగ్గించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా వాగ్యుద్ధం చేసుకుంటున్నాయి

కేసీఆర్‌ సారూ.. ‘పెట్రో’ ట్యాక్స్‌ తగ్గించరూ!

కేంద్రం ఆరు నెలల్లో రెండుసార్లు తగ్గించడంతో రాష్ట్ర సర్కారుపై ప్రజల నుంచి ఒత్తిడి

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పెట్రో ధరలు మీరు తగ్గించాలంటే మీరే తగ్గించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా వాగ్యుద్ధం చేసుకుంటున్నాయి! అయితే.. గడిచిన ఆరు నెలల్లో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రెండుసార్లు తగ్గించడం, బీజేపీయేతర పాలిత రాష్ట్రా లూ తగ్గించడంతో తెలంగాణ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచీ వర్తించేలా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.66కు, డీజిల్‌ లీటర్‌ రూ.105.49కి తగ్గింది. దీంతో వినియోగదారులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. కేంద్రం తరహాలోనే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) తగ్గించి తమకు మరింత ఊరట కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు తగ్గించినపుడు.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 1.48 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో సామాన్యులు వినియోగించే ద్విచక్ర వాహనాలే 1.10 కోట్ల దాకా ఉంటాయి. 


అలాగే 20 లక్షల కార్లు, రైతులు వినియోగించే ట్రాక్టర్లు 7 లక్షల దాకా ఉన్నాయి. సరకు రవాణా వాహనాలు 6 లక్షల దాకా, ఆటోరిక్షాలు 4.50 లక్షల దాకా ఉన్నాయి. పెట్రో ధరలు పెరిగితే వీటిని వినియోగించే వారందరిపైనా భారం పడుతుంది. తెలంగాణలో రోజుకు కనీసం 60 లక్షల లీటర్ల పెట్రోలు, 80 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం అవుతోంది. పెట్రో ధరల పెరుగుదల ప్రభా వం.. సొంత వాహనాల ద్వారా నేరుగా, సరకు రవాణా, రవాణా వాహనాల ద్వారా పరోక్షంగా ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. కేంద్రం తగ్గించినా కూడా పెట్రో ఉత్పత్తులపై పన్ను పోటు తగ్గించడానికి సుముఖంగా లేని ప్రభుత్వంపై విపక్షాలతోపాటు ప్రజల నుంచీ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఏడాది నవంబరులో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మేర పన్ను శాతాన్ని తగ్గించుకోవాలని సూచించింది. ఆ సూచన మేరకు అప్పట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాయి. ఏపీ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. తాజా తగ్గింపు తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోమారు అదే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  కేరళ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను కొంతమేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా.. రాజస్థాన్‌, మహారాష్ట్ర కూడా అదే బాటలో నడిచాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు.  మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..  కేంద్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ట్యాక్స్‌ తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించడంలేదన్నారు.


రూ.71 పెట్రోల్‌.. రూ.120కి ఎలా చేరింది?

మోదీ సర్కారుకు కేటీఆర్‌ సూటి ప్రశ్న

ఎనిమిదేళ్ల క్రితం.. 2014లో రూ.71గా ఉన్న లీటర్‌ పెట్రోలు ధర రూ.120కి ఎందుకు పెరిగిందో మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని నిలదీశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉన్నా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.49, డీజిల్‌ ధర రూ.50 మేర పెరగటం వెనక కారణాలేమిటని ప్రశ్నించారు. కేంద్రం పెట్రోల్‌, డిజీల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంపై మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన పాఠశాల వద్ద పుస్తకాల సీజన్‌లో ఓ వ్యాపారి ధరల ను 300% పెంచి, తర్వాత 30ు భారీ డిస్కౌంట్‌ అంటూ ఆఫర్‌ పెట్టేవాడని ఉదహరించారు. కేంద్రం తీరు చూస్తుంటే తన పాఠశాల వద్ద వ్యాపారి గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-05-23T08:30:12+05:30 IST