60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయంలో Kuwait సంచలన నిర్ణయం.. ఇకపై వారు..

ABN , First Publish Date - 2021-11-05T15:17:36+05:30 IST

60 ఏళ్లకు పైబడి, హైస్కూల్ డిప్లొమా లేదా అంత కన్న తక్కువ చదువుకున్న ప్రవాసుల విషయంలో కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వీరి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన డెసిషన్ నెం.520/2020ను క్యాన్సిల్ చేసింది. అలాగే ఇకపై ఈ కేటగిరీ ప్రవాసులు తమ పర్మిట్లను రెన్యువల్..

60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయంలో Kuwait సంచలన నిర్ణయం.. ఇకపై వారు..

కువైత్ సిటీ: 60 ఏళ్లకు పైబడి, హైస్కూల్ డిప్లొమా లేదా అంత కన్న తక్కువ చదువుకున్న ప్రవాసుల విషయంలో కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వీరి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన డెసిషన్ నెం.520/2020ను క్యాన్సిల్ చేసింది. అలాగే ఇకపై ఈ కేటగిరీ ప్రవాసులు తమ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడానికి ఏడాదికి 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. దీంతోపాటు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి. ఈ మేరకు గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అబ్దుల్లా అల్ సల్మాన్‌తో భేటీ అయిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని కువైత్ స్థానిక మీడియా పేర్కొంది. ప్రకటన వచ్చిన తర్వాత వలసదారుల పర్మిట్లను పునరుద్ధరించడానికి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. 


ఇక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు కూడా 1000 నుంచి 1200 కువైటీ దినార్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కన రెన్యువల్ ఫీజు 500 దినార్లతో కలుపుకుని వలసదారులు ప్రతియేటా 1500 దినార్ల(రూ.3.70 లక్షల) వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇది ప్రవాసులకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పీఏఎం అధికారులు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఫీజును 500 నుంచి 700 కువైటీ దినార్లకు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ప్రవాసులపై కొంతమేర భారం తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు 65వేలకు పైగా ఉన్నారని సమాచారం. అందుకే ఇన్సూరెన్స్ సంస్థలు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పీఏఎం అధికారులు కోరినట్లు సమాచారం. కాగా, ఈ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి మూడు విభాగాల వారికి కువైత్ మినహాయింపు ఇచ్చింది. 1. ప్రవాసులను పెళ్లి చేసుకున్న కువైత్ మహిళల పిల్లలు, వారి భర్తలు, 2. పాలస్తీనా పౌరులు, 3. కువైత్‌లో జన్మించిన వారు.  

Updated Date - 2021-11-05T15:17:36+05:30 IST