డిప్యూటీల పాలన

ABN , First Publish Date - 2022-07-07T05:59:41+05:30 IST

మండలంలో కీలకమైన తహసీల్దార్‌ కార్యాలయం. రోజూ కార్యాలయానికి ఎంతోమంది వివిధ పనులపై వస్తుంటారు. ఒక్కరోజు ఉన్నతాధికారి (తహసీల్దార్‌) లేకపోయినా.. వారంతా నిరాశగా వెనుదిరుగుతుంటారు. ఎన్నో పనులు నిలిచిపోతాయి. అలాంటిది తహసీల్దార్‌ నెలలుగా అందుబాటులో లేకపోతే.. పరిస్థితిని ఊహించుకోలేం.

డిప్యూటీల పాలన

కదిరి డివిజనలో 

తహసీల్దార్‌ సీట్లు ఖాళీ

కుంటుపడుతున్న పాలన

ప్రజలకు తప్పని ఇబ్బందులు

ఇక్కడికి రావడానికి జంకుతున్న అధికారులు


కదిరి

మండలంలో కీలకమైన తహసీల్దార్‌ కార్యాలయం. రోజూ కార్యాలయానికి ఎంతోమంది వివిధ పనులపై వస్తుంటారు. ఒక్కరోజు ఉన్నతాధికారి (తహసీల్దార్‌) లేకపోయినా.. వారంతా నిరాశగా వెనుదిరుగుతుంటారు. ఎన్నో పనులు నిలిచిపోతాయి. అలాంటిది తహసీల్దార్‌ నెలలుగా అందుబాటులో లేకపోతే.. పరిస్థితిని ఊహించుకోలేం. కదిరి రెవెన్యూ డివిజనలో ఏకంగా ఏడుగురు తహసీల్దార్లకుగాను ఒక్కరంటే ఒక్కరు కూడా అందుబాటులో లేరు. సస్పెన్షన్లు, డిమోషన, బదిలీలు, సెలవులతో అన్ని సీట్లూ ఖాళీ అయ్యాయి. దీంతో డిప్యూటీ తహసీల్దార్లే ఇనచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వారు కీలకమైన సమస్యలు పరిష్కరించాలంటే జంకుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదిలేక కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆ మేరకు కలెక్టర్‌ స్పందన కార్యక్రమాల్లో రెవెన్యూ సమస్యలపైనే అధికంగా అర్జీలు అందుతున్నాయి.

కదిరి కదిరి

అవినీతి ఆరోపణలతో...

5 మండలాల్లో తహసీల్దార్‌ పోస్టులు ఖాళీ కావడానికి ప్రధానంగా అవినీతి అరోపణలే కారణం. గాండ్లపెంట తహసీల్దార్‌గా పనిచేసిన బీవీ రమణపై ఫోనపే ఆరోపణలు వచ్చాయి. వీఅర్వోల నుంచి లంచాల సొమ్ము ఫోనపే ద్వారా వేయించుకున్నారన్న అరోపణలు బలంగా వినిపించాయి. మలమీదపల్లి వీఅర్వో నరసింహులు తాను ఫోనపే ద్వారా తహసీల్దార్‌కు డబ్బు పంపినట్లు మీడియా ముందు సాక్ష్యాధారాలతో బయటపెట్టడం అప్పట్లో సంచలనమైంది. తన గుట్టు బయటపడుతుందన్న భయంతో తహసీల్దార్‌ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. నేటికీ ఆయన జాయిన కాలేదు. నంబులపూలకుంట తహసీల్దార్‌ పీవీ రమణ.. కదిరిలో పనిచేస్తున్న సమయంలో అసైన్డ భూమిని పిత్రార్జితంగా చూపి 1బీ ఇచ్చారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు.. ఆయనకు డిప్యూటీ తహసీలార్దర్‌గా డిమోషన చేశారు. నేటికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీంతో నంబులపూలకుంటలో తహసీల్దార్‌ పోస్టు ఖాళీ అయింది. నల్లచెరువు తహసీల్దార్‌గా పనిచేసిన జీలానీ గతేడాది భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికసాయాన్ని స్వాహా చేశారన్న అరోపణలపై సస్పెండయ్యారు. దీంతో నల్లచెరువులో కూడా ఖాళీ సీటే. తనకల్లు మండలంలో పనిచేస్తున్న సుబ్బలక్ష్మమ్మను గుడిబండకు బదిలీ చేశారు. అమెపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. కదిరి తహసీల్దార్‌ గోపాలకృష్ణ పుట్టపర్తి నుంచి ఇక్కడికి రెండునెలల కిందట బదిలీపై వచ్చారు. అయన ఇక్కడ పనిచేయలేక బదిలీపై వెళ్లినట్లు తెలిసింది. గతంలో కదిరి తహసీల్దార్‌గా పనిచేసిన మారుతిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. నియోజవర్గంలో పనిచేసిన ఎక్కువమంది తహాసీల్దార్లు అవినీతి ఆరోపణలపై వెళ్లడం గమనార్హం.


స్పందనలో రెవెన్యూ సమస్యలే అధికం

మండలస్థాయి స్పందన కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం కాకపోవడాన్ని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ గమనించారు. దీంతో ఆయా మండలాలు, డివిజన కేంద్రాల్లో ప్రత్యేక స్పందన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో అధిక భాగం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు అందాయి. దీనికి కారణం అయా మండలాల్లో తహాసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉండడమే. పాసుపుస్తకాల మంజూరు, మ్యుటేషన, భూ కొలతలు ఇలా ప్రతిపని రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంది. తహసీల్దార్లు లేకపోవడంతో వాటిని చేయడానికి డిప్యూటీ తహసీల్దార్లు జంకుతున్నట్లు తెలిసింది. దీంతో సమస్యలు పరిష్కారం కాక కలెక్టర్‌ స్పందనకు అధికంగా అర్జీలు వస్తున్నట్లు తెలుస్తోంది.


అన్ని మండలాల్లో ఖాళీ

కదిరి రెవెన్యూ డివిజనలో 7 మండలాలున్నాయి. తలుపుల మినహా ఎక్కడా తహసీల్దార్లు లేరు. తలుపుల తహసీల్దార్‌ కూడా 20 రోజులుగా సెలవుపై వెళ్లారు. దీంతో ఇక్కడ కూడా డిప్యూటీ తహసీల్దారే ఇనచార్జిగా కొనసాగుతున్నారు. కదిరి, తనకల్లు తహసీల్దార్లు గోపాలకృష్ణ, సుబ్బలక్ష్మమ్మ ఇటీవల బదిలీ అయ్యారు. సుబ్బలక్ష్మమ్మ గుడిబండకు, గోపాలకృష్ణ కదిరి అర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. గాండ్లపెంట మండలంలో 6 నెలలుగా తహసీల్దార్‌ లేక ఇ బ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న బీ.వెంకటరమణ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నంబులపూలకుంట తహసీల్దార్‌గా పనిచేస్తు న్న పీవీ రమణకు డిమోషన ఇచ్చారు. నల్లచెరువు తహసీల్దార్‌ జీలానీ ఆరునెలల క్రితం సస్పెండయ్యారు. అప్పటి నుం చి అక్కడ తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న అమడగూరు మండలానికి కొన్నేళ్లుగా తహసీల్దార్‌ లేకపోవడం గమనార్హం.


పట్టించుకోని పాలకులు

రెవెన్యూ డివిజనలోని అన్ని మండలాల్లో తహసీల్దార్లు లేకపోయినా పాలకులకు పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్లు లేక పాలన కుంటుపడుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నాతాధికారులు దృష్టి పెట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.


తహసీల్దార్‌ లేక ఇబ్బందులు

రెండు నెలలుగా తహసీల్దార్‌ లేక ఇబ్బందులు పడుతున్నాం. సోలార్‌ హబ్‌కు మా భూమి 3.50 ఎకరాలు పోయింది. అప్పటి నుంచి పరిహారం కోసం తిరుగుతున్నా. తహసీల్దార్‌ లేకపోవడంతో పరిహారం గురించి చెప్పేవారు లేరు. ఇతర పనులు కూడా కావట్లేదు. వెంటనే తహసీల్దార్‌ను నియమించాలి.

రామ్మోహనరెడ్డి, బత్తినగారిపల్లి, నంబులపూలకుంట మండలం


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

తహసీల్దార్లు లేకపోవడంతో పాలన ఇబ్బందిగా మారింది. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారం, పది రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన తహసీల్దార్లను కేటాయిస్తామని అధికారులు చెప్పారు. వారు వస్తే ఇబ్బంది తప్పుతుంది.

రాఘవేంద్ర, ఆర్డీఓ


Updated Date - 2022-07-07T05:59:41+05:30 IST