కీచక రాఘవ అరెస్టు

ABN , First Publish Date - 2022-01-08T07:01:06+05:30 IST

భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ)ను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి..

కీచక రాఘవ అరెస్టు

  • అర్ధరాత్రి పోలీసులకు చిక్కిన నిందితుడు
  • ఏపీ వైపు పరారవుతుండగా కాపుకాసి.. పట్టుకున్నామని భద్రాద్రి పోలీసుల ప్రకటన
  • ఎస్పీ ఆఫీసులో విచారణ తరువాత కోర్టుకు?
  • మరో పాత కేసులో రాఘవకు నోటీసు
  • ఫైనాన్షియర్‌ వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే నివాసానికి అంటించిన పోలీసులు
  • టీఆర్‌ఎస్‌ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్‌



కొత్తగూడెం/కొత్తగూడెం కలెక్టరేట్‌/పాల్వంచ రూరల్‌/హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ)ను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ఓ వాహనంలో భద్రాద్రి జిల్లా దమ్మపేట మీదుగా ఏపీ వైపునకు పరారవుతుండగా.. కొత్తగూడెం పోలీసులు చింతలపూడి వద్ద నిఘా పెట్టి పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. అయితే విచారణ నిమిత్తం రాఘవను ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తారని, విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండడంతో ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారిన విషయం తెలిసిందే.


పాల్వంచ పోలీసులు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేశారని, కాదు.. కొత్తగూడెంలోనే అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. కానీ, రాఘవను అరెస్టు చేయలేదని, అతని కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని, ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని పేర్కొంటూ భద్రాద్రి ఎస్పీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాఘవ ముఖ్య అనుచరులిద్దరిని పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మరోవైపు పాల్వంచ ఫైనాన్స్‌ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారించేందుకుగాను శుక్రవారం మణుగూరు ఏఎస్సీ ఎదుట హాజరు కావాలంటూ గురువారం అర్ధరాత్రి పాత పాల్వంచలోని రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసానికి పోలీసులు నోటీస్‌ అంటించారు. కానీ, విచారణకు రాఘవ హాజరు కాలేదు. 


టీఆర్‌ఎస్‌ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్‌

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరే్‌షరెడ్డి ప్రకటన చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.


రాఘవ పంచాయితీ చేసింది నిజమే

రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవి వెల్లడి

తన సోదరుడు నాగరామకృష్ణ చేసిన అప్పులు తీర్చుకొనేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నామని, అందుకు హైదరాబాద్‌లోని ఇంటిస్థలాన్ని అమ్ముకోవడానికి అంగీకరించామని ఆయన సోదరి మాధవి, తల్లి సూర్యవతి తెలిపారు. అయినా భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడంలేదంటూ రోదించారు. వనమా రాఘవ కుటుంబానికి, తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయని, తమ కష్టసుఖాలను రాఘవతో చెప్పుకొంటుంటామని తెలిపారు. అదే క్రమంలో తమ అప్పుల బాధను ఆయనకు చెప్పుకోగా.. పంచాయితీ చేసిన మాటా వాస్తవమేనని అన్నారు. తమ అందరి అంగీకారంతో హైదరాబాద్‌లోని ఇంటి స్థలాన్ని అమ్ముకోమని రాఘవ చెప్పాడని, కానీ సెల్పీ వీడియోలో చెప్పినట్లుగా రాఘవ అతడి భార్యను పంపించమన్నాడన్న విషయాన్ని రామకృష్ణ తమకు చెప్పలేదని పేర్కొన్నారు. తమతో చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. రామకృష్ణ తన భార్యాపిల్లలతోపాటు తానూ ఆత్మహత్య చేసుకుని తమ మీద చెరుపుకోలేని బుదర చల్లుతాడని ఊహించలేదన్నారు.




రాఘవ వల్లే నా కూతురి కుటుంబం బలైంది 

అతణ్ని కఠినంగా శిక్షించాలి.. రామకృష్ణ అత్త

తన కూతురు, అల్లుడు, మనవరాళ్లు వనమా రాఘవ పెట్టిన ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని నాగరామకృష్ణ అత్త ఎలిసెట్టి రమాదేవి అన్నారు. రాఘవను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. తన కూతురు, అల్లుడు ఏనాడూ వారి సమస్యలను తమకు చెప్పలేదన్నారు. చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని విలపించారు. తన అల్లుడు డాడ్సీ రోడ్‌ మొబైల్‌ యాప్‌లో పెద్దగా పెట్టుబడి పెట్టలేదని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. రామకృష్ణ బావమరిది జనార్దన్‌ మాట్లాడుతూ.. సమస్య ఉందని వెళితే వారి ఇబ్బందులను ఆసరా చేసుకొని నీచాతి నీచంగా మాట్లాడిన వనమా రాఘవను క్షమించకూడదన్నారు.

Updated Date - 2022-01-08T07:01:06+05:30 IST