Kejriwal to Centre: రాజకీయాలు పక్కనపెట్టండి..మా సేవలు వాడుకోండి

ABN , First Publish Date - 2022-08-16T21:45:29+05:30 IST

దేశవ్యాప్తంగా పాఠశాలల విద్య, హెల్త్‌కేర్ సౌకర్యాలను మెరుగుపరచేందుకు...

Kejriwal to Centre: రాజకీయాలు పక్కనపెట్టండి..మా సేవలు వాడుకోండి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలల విద్య (School Education) , హెల్త్‌కేర్ (Health Care) సౌకర్యాలను మెరుగుపరచేందుకు 'ఆప్' (AAP) సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న నైపుణ్యాలను (Expertise) వినియోగించుకోవాలని కేంద్రానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఒక ప్రకటనలో సూచించారు. ఢిల్లీలో నాణ్యతాయుతమైన, ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రాబోయే ఐదేళ్లలో దీన్ని అమలు చేరి తీరుతామని అన్నారు. తద్వారా ఢిల్లీలోని 2.5  కోట్ల మంది ప్రజానీకానికి ఉచిత వైద్య చికిత్స అందుతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇది చేయగలిగితే, దేశవ్యాప్తంగా కూడా దీనిని అమలు చేయవచ్చని అన్నారు.


''నేను కేంద్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇస్తున్నాను. మా సేవలు ఉపయోగించుకోండి. రాజకీయాలను పక్కనపెట్టండి.  కలిసి పని చేస్తే దేశంలోని అన్ని పాఠశాలలు మెరుగుపడి 130 కోట్ల భారతీయులకు మేలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు కలిసి కట్టుగా ఇది చేయవచ్చు'' అని కేజ్రీవాల్ అన్నారు. నాణ్యతాయుతమైన విద్యను అందించడం ఉచితాలుగా పిలవడం మానుకోవాలని కేంద్రానికి ఆయన హితవు పలికారు.


ప్రధాని ఏమన్నారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో యూపీలోని బుందేల్‌ఖండ్‌లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తూ, ఉచితాల (Freebees) సంస్కృతి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, దేశాభివృద్ధికి ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. కొన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాలు ప్రకటిస్తున్నాయని, ముఖ్యంగా యువత ఈ ఉచితాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


దీనిపై కేజ్రీవాల్ వర్చువల్ మీట్‌లో స్పందిస్తూ, ఆరోగ్య సేవలు, మెరుగైన విద్య విషయంలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. వీటిని ఉచితాలుగా మాట్లాడటం తగదని, పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలు తెరిచి, వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, గెస్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి, బాలల భవిష్యత్తు కోసం టీచర్లకు శిక్షణ ఇవ్వాలని, అప్పుడే దేశం సంపన్న దేశమవుతుందని అన్నారు.

Updated Date - 2022-08-16T21:45:29+05:30 IST