ప్రార్థనతో విధేయత ప్రకటిద్దాం!

ABN , First Publish Date - 2021-08-13T05:30:00+05:30 IST

లోకం సమస్తం కాలానికి అనుగుణంగా నడుస్తుంది. ఇది ఏ యుగానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ జీవికైనా వర్తించే విషయం. కాలచక్రాన్ని నియంత్రించేది సృష్టికర్తే! రేయింబవళ్ళనూ, సూర్య చంద్రులనూ సృష్టించినవాడు ఆయనే...

ప్రార్థనతో విధేయత ప్రకటిద్దాం!

లోకం సమస్తం కాలానికి అనుగుణంగా నడుస్తుంది. ఇది ఏ యుగానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ జీవికైనా వర్తించే విషయం. కాలచక్రాన్ని నియంత్రించేది సృష్టికర్తే! రేయింబవళ్ళనూ, సూర్య చంద్రులనూ సృష్టించినవాడు ఆయనే. ప్రతి దానికీ ఒక సమయాన్ని దేవుడు నిర్దేశించాడు. 


ఆకాశంలో బురుజులను నిర్మించి, అందులో ప్రజ్వలమైన దీపమైన సూర్యుణ్ణీ, కాంతిమంతమైన చంద్రుణ్ణీ ఆవిష్కరించి, రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేసింది సృష్టికర్తే! అంతేకాదు, మానవులు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసుకోవడానికి చంద్రుడి దశలను కూడా దైవమే నిర్ధారించాడు’’ అని అంతిమ దివ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ వెల్లడించింది.

‘‘ఓ ప్రవక్తా! ప్రజలు నెలవంకల గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధన) వేళలను, హజ్‌ కాలాన్నీ నిర్థారించడానికి జరిగిన ఏర్పాటని వారికి నువ్వు సమాధానం ఇవ్వు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌కు అల్లాహ్‌ ఆదేశం ఇచ్చారు. ‘‘చంద్రుణ్ణి పట్టుకోవడం సూర్యుడి తరం కాదు, పగటిని మించిపోవడం రాత్రి వల్ల కాదు. అవన్నీ తమతమ నిర్థారిత కక్ష్యల్లో నడుస్తాయి. ఇవన్నీ అల్లాహ్‌ సూచనలతో సాగేవే! మీరు సూర్యుడికో, చంద్రుడికో కాదు... నిజంగా మీరు అల్లాహ్‌కు దాసులైతే, వీటన్నిటినీ సృష్టించి, అందించిన అల్లాహ్‌ ఎదుట సాష్టాంగపడండి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ సూచించింది.

కాలగమనాన్ని శాసిస్తున్న దైవం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మానవులను ఆదేశించాడు. సూర్య చంద్రులు, రేయింబవళ్ళే ఆయన ఆదేశానుసారం నడుస్తున్నప్పుడు... ఈ సృష్టిలో ఎంతో చిన్న ఉనికి ఉన్న మానవులమైన మనం అల్లాహ్‌ పట్ల ఎంత విధేయంగా ఉండాలి? సృష్టి సమస్తాన్నీ నడిపేవాడైన ఆయన మనకు ఈ లోకంలో ప్రసాదించిన కాలాన్ని... ఆయన ప్రార్థనతో సద్వినియోగం చేసుకోవాలి. సర్వ శక్తిమంతుడైన ఆయన మనకు ఈ జన్మ ప్రసాదించినందుకు... ఆయనకు నిరంతరం కృతజ్ఞత తెలుపుకోవాలి.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-08-13T05:30:00+05:30 IST