13 పాయింట్ల ఎజెండాతో గోవా అభివృద్ధి: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-16T18:04:35+05:30 IST

గోవా ప్రజలు, అభివృద్ధి కోసం 13 పాయింట్ల ఎజెండాతో కూడిన 'విజన్ ప్లాన్‌'ను అమలు చేయనున్నట్టు..

13 పాయింట్ల ఎజెండాతో గోవా అభివృద్ధి: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: గోవా ప్రజలు, అభివృద్ధి కోసం 13 పాయింట్ల ఎజెండాతో కూడిన 'విజన్ ప్లాన్‌'ను అమలు చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎజెండాను తు.చ.తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల కోసం గోవా ప్రజలు ఎదురు చూస్తున్నారని, గతంలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేని గోవా ప్రజలకు ఇప్పుడు 'ఆప్' ఆశాకిరణమని అన్నారు. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.


గోవా 'విజన్ ప్లాన్‌'లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 13 పాయింట్ల ఎజెండాతో ముందుకు వెళ్తుందని కేజ్రీవాల్ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన మహిళలందరికీ ప్రతినెలా రూ.1,000 సాయం అందిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని, నిరంతరాయ విద్యుత్, నీటిని ఉచితంగా అందిస్తామని, రోడ్లను మెరుగుపరుస్తామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో, జిల్లాల్లో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన కోసం మెహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు తెరుస్తామని, రైతులతో చర్చించి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, వ్యాపార వ్యవస్థను క్రమబద్ధీకరించి, సులభతరం చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉపాథికి నోచుకోని వారికి నెలకు రూ.3,000 సాయం చేస్తామని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తామని, మైనింగ్‌ పనులు ప్రారంభిస్తామని, భూమి హక్కులు పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Updated Date - 2022-01-16T18:04:35+05:30 IST