
‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ద్వారా వచ్చిన డబ్బులను కశ్మీర్ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు. మీడియాతో శనివారం జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశాన్ని బీజేపీ రాజకీయం కోసం, ధనార్జన కోసమే వాడుకుంటోందని ఆయన విమర్శించారు. ‘‘గడిచిన పాతికేళ్లలో బీజేపీ పదమూడేళ్లు అధికారంలో ఉంది. వరుసగా గత ఎనిమిదేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తోంది. అయినా, కశ్మీర్ పండిట్లు ఎవరూ తిరిగి కాశ్మీర్ వెళ్లలేకపోయారు. కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాచారాల్ని బీజేపీ రాజకీయం కోసం ఉపయోగించుకుంది. ఇప్పుడు ఈ అంశంతో సినిమా తీసి, డబ్బులు కూడా సంపాదించుకుంటోంది. ఇప్పటికే సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులను కశ్మీర్ పండిట్ల సంక్షేమం కోసం వాడాలి. వాళ్లు కాశ్మీర్ తిరిగొచ్చి స్థిరపడేందుకు ఈ డబ్బులు ఉపయోగించాలి. దేశ ప్రజలంతా సినిమా చూడాలి అని బీజేపీ అనుకుంటే చిత్రాన్ని యూట్యూబ్లో ఉంచాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని కూడా కేజ్రీవాల్ విమర్శించారు.