కేంద్రం అలా.. జగన్‌ ఇలా!

ABN , First Publish Date - 2020-10-25T06:02:45+05:30 IST

కేంద్రప్రభుత్వ పెద్దలకు ఆంధ్రప్రదేశ్‌ అంటే అలుసైపోయిందా? ప్రధాన రాజకీయ పార్టీల అధినాయకుల బలహీనతల వల్ల రాష్ర్టానికి అన్యాయం జరుగుతోందా...

కేంద్రం అలా.. జగన్‌ ఇలా!

ఐదేళ్ల క్రితం ప్రకటించిన రాజధానిని మరో చోటికి మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లదా? భవిష్యత్తులో మరొకరు అధికారంలోకి వచ్చి రాజధానిని మార్చబోరన్న గ్యారెంటీ ఏముంటుంది? ఇలా అయితే పెట్టుబడిదారులు ముందుకు వస్తారా? ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేస్తానని ఎందుకు హామీ ఇవ్వడం లేదు? పైపెచ్చు మూడు రాజధానులు కావాలంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారితో పోటీ ధర్నాలు చేయించడం ఏమిటి? మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత ఆందోళనల అవసరం ఏమిటి? భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పేవారు. నాడు పాదాభివందనాలు అందుకున్న రైతులు ఇప్పుడు ఈసడింపులకు గురవుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు లేనందువల్ల పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంలో కోత విధించినా జరిగే నష్టం ఏమీ లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుంది. ఇలాంటి విషయాలలో కేంద్రాన్ని నిలదీయవలసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కేంద్ర పెద్దలను చూస్తే చలిజ్వరం వస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అని కలవరించిన పెద్దమనిషి ఇప్పుడా ఊసే ఎత్తకపోవడం, పోలవరం వ్యయంలో కోత విధిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం ఏమిటి? కీలకమైన బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే జగన్‌ పార్టీ సహకారం కేంద్ర పెద్దలకు అవసరం. అయినా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని అడగకుండా అవతలి పక్షం కోరిన వెంటనే కేంద్రప్రభుత్వానికి జగన్‌ సహకారం అందిస్తున్నారు. తన మద్దతుపై ఆధారపడే పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీకి లేనందున ప్రత్యేక హోదా విషయంలో అడుగుతూ పోవడం మినహా చేయగలిగిందేమీ లేదని అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. జగన్‌ కూడా సాదాసీదా నాయకుడేనని తెలుసుకోలేకపోయిన ప్రజలు, ఆయన అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తారని ఆశపడ్డారు. ఇప్పుడు హోదా సంగతి దేవుడెరుగు, పోలవరం ప్రాజెక్టుకు కూడా దిక్కులేకుండా పోయింది.


కేంద్రప్రభుత్వ పెద్దలకు ఆంధ్రప్రదేశ్‌ అంటే అలుసైపోయిందా? ప్రధాన రాజకీయ పార్టీల అధినాయకుల బలహీనతల వల్ల రాష్ర్టానికి అన్యాయం జరుగుతోందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, అవుననే అనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ వ్యయాన్ని కుదించిన కేంద్రప్రభుత్వం అందుకు అంగికరించని పక్షంలో పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా విడుదల చేయబోమని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి స్పష్టం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో కలుపుకొని పోలవరాన్ని పూర్తిచేయాలంటే 50 వేల కోట్ల రూపాయలకు పైగా కావాలి. ఇందులో 20 వేల కోట్లకు మించి ఇవ్వబోమని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేయడం, దాంతో మంత్రి బుగ్గన హడావిడిగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆంధ్రుల కలల ప్రాజెక్ట్‌ పోలవరం పూర్తి అవుతుందా? అన్న సందేహం నెలకొంది. ముంపు ప్రాంత ప్రజలకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించకుండా ముందుగా నిర్ణయించిన డిజైన్ల ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం. కేంద్రప్రభుత్వం తీసుకున్న వైఖరికి గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ బుగ్గన చేతులు దులుపుకొన్నారు. తెలుగుదేశం పార్టీ సహజంగానే మాకే పాపం తెలియదు– జగన్‌ ప్రభుత్వం చేతకానితనం వల్లనే అంచనా వ్యయంలో కోత విధిస్తున్నారని ప్రత్యారోపణ చేస్తోంది. విమర్శలు ప్రతి విమర్శల వల్ల సమస్య పరిష్కారం కాదు కదా! ప్రజలు కూడా అటూ ఇటుగా చీలిపోయి, జరగబోయే అనర్థాన్ని పట్టించుకోరు. ఫలితంగా రాజధాని అమరావతికి ఏ గతి పట్టిందో ఇకముందు పోలవరానికి కూడా అదే గతి పట్టవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడవలసిన పార్టీలు మెతక వైఖరి తీసుకోవడం, దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూడవలసిన కేంద్ర పెద్దలు రాజకీయ ప్రయోజనాలను మాత్రమే వెతుక్కోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. మన దేశంలో ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజాప్రయోజనాల గురించి రాజకీయ పార్టీలు ఆలోచిస్తుంటాయి. ఇందుకు బిహార్‌ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలే నిదర్శనం. బీజేపీకి అధికారం కట్టబెడితే బిహార్‌ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మరి మిగతా రాష్ర్టాల ప్రజల పరిస్థితి ఏమిటి? వాళ్లు మనుషులు కాదా? వాళ్లకు కరోనా వైరస్‌ సోకదా? ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు లేవు కనుక వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేంద్ర పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు. తమిళనాడులో కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నందున అక్కడ కూడా వ్యాక్సిన్‌ను ఫ్రీగా సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి పళనిస్వామి సెలవిచ్చారు. తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్నందున తాము కూడా ఉచితంగానే వ్యాక్సిన్‌ అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థకు ఎన్నికలు జరుగుతున్నందున, తాజా వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ఒక్కో ఇంటికి 10 వేల రూపాయలను పంచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారు. వరంగల్‌లో ఎన్నికలు లేనందున అక్కడి ప్రజలు కూడా వరదల్లో చిక్కుకున్నప్పటికీ వారికి ఎటువంటి సహాయాన్ని ప్రకటించలేదు. ఇదీ మన రాజకీయ పార్టీల ధోరణి. అయినా కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు గానీ, సదరు వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఓట్లు దండుకోవడానికి ఎవరికి వారు తమ ప్రయత్నం చేసుకుంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు లేనందువల్ల పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంలో కోత విధించినా జరిగే నష్టం ఏమీ లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుంది. ఇలాంటి విషయాలలో కేంద్రాన్ని నిలదీయవలసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కేంద్ర పెద్దలను చూస్తే చలిజ్వరం వస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అని కలవరించిన పెద్దమనిషి ఇప్పుడా ఊసే ఎత్తకపోవడం, పోలవరం వ్యయంలో కోత విధిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం ఏమిటి? కీలకమైన బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే జగన్‌ పార్టీ సహకారం కేంద్ర పెద్దలకు అవసరం. అయినా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని అడగకుండా అవతలి పక్షం కోరిన వెంటనే కేంద్రప్రభుత్వానికి జగన్‌ సహకారం అందిస్తున్నారు. తన మద్దతుపై ఆధారపడే పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీకి లేనందున ప్రత్యేక హోదా విషయంలో అడుగుతూ పోవడం మినహా చేయగలిగిందేమీ లేదని అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. జగన్‌ కూడా సాదాసీదా నాయకుడేనని తెలుసుకోలేకపోయిన ప్రజలు, ఆయన అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తారని ఆశపడ్డారు. ఇప్పుడు హోదా సంగతి దేవుడెరుగు, పోలవరం ప్రాజెక్టుకు కూడా దిక్కులేకుండా పోయింది. తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఉండే వైరాన్ని ఆదర్శంగా తీసుకున్న జగన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అక్కడ అందరూ ఒక్కటవుతారన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. ప్రత్యేక హోదా అటకెక్కింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ముప్పు ముంచుకువస్తున్నా ప్రజలలో ఉలుకూ–పలుకూ ఉండకపోవచ్చు. అంతమాత్రాన వారేమీ పట్టించుకోరనుకోవడం అవివేకమే. పోలవరం విషయంలోనైనా ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్ని నిలదీస్తారని ఆశిద్దాం. కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఇబ్బందులు ఉంటే ప్రాజెక్ట్‌ వ్యయాన్ని కుదించినా దిగులు పడవద్దు– రాష్ట్ర ప్రభుత్వం మిగతా వ్యయాన్ని భరించి ప్రాజెక్టును పూర్తిచేస్తుందని భరోసా అయినా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళనాడులోని రాజకీయ పార్టీలను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటే బావుంటుంది. ఇందుకోసం ముందుగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి.


మార్పు ఎందాకా?

ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వపరంగా జరుగుతున్న లోపాలను ఇటు మీడియాగానీ, అటు ప్రతిపక్షాలు గానీ ఎత్తి చూపినా జగన్‌ పట్టించుకునే వారు కాదు. అయితే ఈ మధ్య కొన్ని పొరపాట్లను వెంటనే సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల తన పట్ల ప్రజాదరణ చెక్కు చెదరడం లేదని నమ్ముతూ వచ్చిన ఆయన ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులను గ్రహించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. తన ప్రభుత్వంపై మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న వాస్తవం జగన్‌కు తెలిసి వచ్చిందంటున్నారు. నిజానికి పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. సాహసమే ఊపిరిగా ముందుకు సాగిపో అని న్యాయవ్యవస్థతో ఢీ కొంటున్న విషయంలో నీలిబ్యాచ్‌ డప్పు కొడుతుండవచ్చు గానీ విద్యావంతులు మాత్రం ఈ విషయంలో జగన్‌ వైఖరిని తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ పరిస్థితులను తెలుసుకున్నారో లేదో తెలియదు గానీ కొన్ని విషయాలలో జగన్‌ పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నారు. వరద బాధితులకు 500 రూపాయల వంతున సహాయం చేయాలని, అది కూడా కనీసం 7 రోజుల పాటు నీట మునిగి ఉన్న వారికి మాత్రమే అని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది.


ఇది గ్రహించిన జగన్‌, వరద సహాయానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను జారీ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా భూములు సర్వే చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సరిహద్దుల్లో పాతే రాళ్లపై జగన్‌ బొమ్మను చెక్కించడం ద్వారా కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్‌ వ్యవహరించిన తీరుతో ఇప్పటికీ కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారి చర్యలు సహజంగానే ముఖ్యమంత్రికి చుట్టుకుంటాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడితే భారీ జరిమానాలు విధిస్తూ రాష్ట్రప్రభుత్వం రెండురోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో పేర్కొన్న పెనాల్టీలు దారుణంగా ఉన్నాయి. అనవసరంగా హారన్‌ కొడితే మొదటిసారి వెయ్యి, రెండోసారి అయితే రెండువేలు పెనాల్టీ విధించాలని నిర్ణయించడం ఏమిటి? అనవసరంగా హారన్‌ కొట్టారని ఎవరు నిర్ణయించాలి? ఇతర నిబంధనలు కూడా ఇలానే ఉన్నాయి. ఈ ఉత్తర్వుల వల్ల అవినీతి పెరిగిపోతుంది. పోలీసులు, రవాణాశాఖ అధికారుల నుంచి వేధింపులు పెరిగిపోతాయి. ఈ రోజుల్లో కూలీనాలీ చేసుకునే వారు కూడా ద్విచక్ర వాహనాలను కలిగి ఉంటున్నారు. వారి నుంచి పెనాల్టీ వసూలు చేసుకుంటూ పోతే సంక్షేమ పథకాల పేరిట కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకున్నట్లు అవదా? ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు పెంచడంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ పెంచేశారు. మద్యం ధరల గురించి చెప్పే పనిలేదు. ఇటువంటి నిర్ణయాల వల్ల పేదలపై కూడా భారం పడుతుంది. పాలనా వ్యవహారాలను ముఖ్యమంత్రి పూర్తిగా ఆకళింపు చేసుకోలేదన్న అభిప్రాయం బలంగా ఉంది.


ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న సమీక్షలు కూడా ఆషామాషీగా ఉంటున్నాయి. సమస్య లోతుల్లోకి వెళ్లకుండా, ఉపరితల విన్యాసం చేసుకుంటూ పోవడం వల్ల అధికారులు కూడా యాంత్రికంగానే పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు అధికారులు ప్రభుత్వంలో పూర్తిస్థాయి పెత్తనం చలాయిస్తున్నారు. ఈ విషయం జగన్‌ రెడ్డికి తెలుసో లేదో గానీ ప్రభుత్వం మాత్రం విమర్శలపాలవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకుల వద్ద డిపాజిట్‌ చేస్తున్న నిధులను రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో డిపాజిట్‌ చేయించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి తీసుకున్నారట. దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో! రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యాపించింది. ముఖ్యమంత్రి జగన్‌ తొలుత కొంతమందిని టార్గెట్‌ చేసుకోగా, జిల్లాలో మంత్రులు, శాసనసభ్యలు సదరు కక్ష సాధింపులను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో వారిని ముఖ్యమంత్రి అదుపుచేయకపోవడం వల్ల ఎవరి స్థాయిలో వారు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా! అధికార పార్టీ నాయకులు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి నిజంగానే తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటే చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ముఖ్యమంత్రి మెప్పు కోసం హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఏ ప్రభుత్వానికి అయినా ఇలాంటి అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి అధికారులను ప్రోత్సహించడంతో మిగతా అధికారులు భయంతో విధులు నిర్వర్తిస్తున్నారు గానీ మనస్సు పెట్టి పని చేయడంలేదు. పాలనపై పట్టు సాధించలేని పక్షంలో జగన్‌ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాను వెళ్లలేకపోయిన వరద ప్రాంతాల సందర్శనకు మంత్రులు, అధికారులను ఆయన పంపవచ్చు కదా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హైదరాబాద్‌లో వరద ప్రాంతాలను సందర్శించి బాధితులను ఓదార్చలేదు. ఆ లోటును భర్తీ చేయడం కోసం తన కుమారుడైన మంత్రి కేటీఆర్‌కు ఆయన ఆ బాధ్యత అప్పగించారు. వారం రోజులుగా కేటీఆర్‌ పరామర్శకు వెళ్లడంతో ప్రజలు కూడా కేసీఆర్‌ ఎందుకు రాలేదు అని అడగడం లేదు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడప దాటి వెళ్లరు. అయితే ఆ లోటు కనిపించకుండా కేటీఆర్‌, హరీశ్‌రావు వంటి వారికి బాధ్యతలు పురమాయిస్తారు. జగన్‌ రెడ్డి ఈ పని కూడా చేయడం లేదు.


రాష్ట్ర భవిత ప్రశ్నార్థకం!

ఇప్పుడు అమరావతి విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటించిన అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తి అయింది. ఐదేళ్ల తర్వాత రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. అమరావతిని పురిటిలోనే సమాధి చేయాలని జగన్‌ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర రాజధాని ఏది అనేది ప్రశ్నార్థకమైంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులను హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఐదేళ్ల క్రితం రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగనిరతిని కొనియాడిన వారే ఇప్పుడు పెయిడ్‌ ఆర్టిస్టులంటూ నిందిస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళా రైతులు 50 వేలు ఖరీదు చేసే చీరలు ధరించారని బీజేపీ నాయకుడు విష్ణువర్దన్‌రెడ్డి వంటి వారు కూడా చులకనగా మాట్లాడుతున్నారు. రాజధానికి భూములిస్తామని రైతులు తమంతట తాము ముందుకు రాలేదు. ఆనాటి ప్రభుత్వం వారికి నచ్చజెప్పి భూములు తీసుకుంది. తమ భూములలో రాజధాని వేస్త తమకు లభించే స్థలాల రేట్లు పెరుగుతాయన్న ఆశతోనే రైతులు భూములిచ్చారు. ఇలా ఆశపడటం తప్పు కాదే! భూసేకరణ కింద ప్రభుత్వం తీసుకునే భూములకు కూడా భారీగా పరిహారం ఇచ్చిన తర్వాతే రైతులు తమ హక్కులను వదులుకుంటున్నారు కదా! అయినా ఐదేళ్ల క్రితం ప్రకటించిన రాజధానిని మరో చోటికి మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లదా! భవిష్యత్తులో మరొకరు అధికారంలోకి వచ్చి రాజధానిని మార్చబోరన్న గ్యారెంటీ ఏముంటుంది? ఇలా అయితే పెట్టుబడిదారులు ముందుకు వస్తారా? ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేస్తానని ఎందుకు హామీ ఇవ్వడం లేదు. పైపెచ్చు మూడు రాజధానులు కావాలంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారితో పోటీ ధర్నాలు చేయించడం ఏమిటి? మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత ఆందోళనల అవసరం ఏమిటి? అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని, త్వరలోనే అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొస్తున్నారు.


‘కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను’ అన్నట్లుగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేదు. అయినా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు. భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పేవారు. నాడు పాదాభివందనాలు అందుకున్న రైతులు ఇప్పుడు ఈసడింపులకు గురవుతున్నారు. జగన్‌ రెడ్డి ఏ ఉద్దేశంతో మూడు ముక్కలాట మొదలుపెట్టారో తెలియదు గానీ రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని కూడా కేంద్రం కుదించడంతో గోరుచుట్టుపై రోకలిపోటులా రాష్ట్ర పరిస్థితి తయారైంది. జగన్మోహన్‌ రెడ్డి ప్రజాదరణకు ఢోకా లేదని ఆయన సొంత మనుషులు బాకా ఊదుతుండవచ్చు గానీ సవాళ్ల సుడిగుండంలోకి ముఖ్యమంత్రి జారుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగించినంత మాత్రాన జగన్‌కు ఒరిగేదేమీ ఉండదు. కీలకమైన బిల్లులు, ఇతర అంశాల్లో వైసీపీ సహకారాన్ని పొందుతున్న కేంద్ర పెద్దలు ప్రతిగా రాష్ర్టానికి కనీస న్యాయం కూడా చేయలేదన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య లాలూచీ కారణంగా రాష్ర్టానికి నష్టం జరుగుతోందని ప్రజలు గ్రహించిన రోజు ఉభయపక్షాలూ రాజకీయంగా నష్టపోవడం ఖాయం!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-10-25T06:02:45+05:30 IST