Kerala : టమాటా ఫ్లూ కట్టడిలో చురుగ్గా వ్యవహరిస్తున్న కేరళ

ABN , First Publish Date - 2022-05-27T19:00:23+05:30 IST

డెంగ్యూ, చికున్‌గున్యా తరహాలో వస్తున్న టమాటా ఫ్లూ (Tomato flu)ను

Kerala : టమాటా ఫ్లూ కట్టడిలో చురుగ్గా వ్యవహరిస్తున్న కేరళ

తిరువనంతపురం : డెంగ్యూ, చికున్‌గున్యా తరహాలో వస్తున్న టమాటా ఫ్లూ (Tomato flu)ను కట్టడి చేసేందుకు కేరళ (Kerala) ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అంగన్వాడీ (Anganwadi) కార్యకర్తల ద్వారా ముందుగానే అవగాహన కల్పిస్తోంది. దీంతో ఈ లక్షణాలు కనిపించగానే ప్రజలు అప్రమత్తమై బాధితులను రక్షించుకోవడంతోపాటు ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త వహిస్తున్నారు. 


కొత్త వైరల్ వ్యాధి టమాటా ఫ్లూ మే 6 నుంచి ఇప్పటి వరకు కేరళ (Kerala)లో 82 మంది చిన్నారులకు సంక్రమించింది. బాధితులు తీవ్ర జ్వరంతో బాధపడతారు. నోరు, చేతులు, పాదాలపై దురదతో కూడి ఎర్రని దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు కొంచెం పొంగినట్లు కనిపించడం వల్ల ఈ వ్యాధిని టమాటా ఫ్లూ అని పిలుస్తున్నారు. ఈ వ్యాధి వచ్చినవారికి చాలా బాధగా ఉంటుంది, ఇది ఇతరులకు సంక్రమించే వ్యాధి కూడా. 


కొల్లంలోని ఓ మూడేళ్ళ చిన్నారికి ఈ వ్యాధి సోకింది. అంతకుముందే అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. బాధితురాలి తల్లి జాగ్రత్తగా వ్యవహరించి, తన కుటుంబంలోని ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోగలిగారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ, వైద్య శాఖను ప్రశంసించారు. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, ముందు జాగ్రత్త చర్యల గురించి అంగన్వాడీ కార్యకర్తల ద్వారా తమకు అవగాహన కల్పించారని చెప్పారు. 


టమాటా ఫ్లూ ఎందుకు వస్తుందో ప్రస్తుతం స్పష్టంగా తెలియదు. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలతిప్పడం వంటి డెంగ్యూ, చికున్‌గున్యా తరహా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఏ విధంగా సోకుతుందో తెలుసుకునేందుకు పరిశోధన జరుగుతోందని వైద్యులు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని చెప్పారు. దీనికి చికిత్స కూడా లేదన్నారు. లక్షణాలనుబట్టి మాత్రమే వైద్యులు చికిత్స చేస్తున్నారన్నారు. టమాటా ఫ్లూ సోకినవారు ద్రవ పదార్థాలను ఎక్కువగా స్వీకరించాలని, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని తెలిపారు. 


ఈ వ్యాధిబారిన పడకుండా తప్పించుకోవడం కోసం బావులు, చెరువులు వంటివాటిని శుభ్రపరుస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు చెప్తున్నారు. ఇళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. 


Updated Date - 2022-05-27T19:00:23+05:30 IST