ఈ యాడ్‌ ఎంతో సందేశాత్మకం!

ABN , First Publish Date - 2021-04-19T05:30:00+05:30 IST

పెద్ద పెద్ద నగల దుకాణాల ప్రకటనల్లో హీరోయిన్లు లేదంటే హీరోలు, మోడళ్లు మెరవడం తెలిసిందే. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. నగల ప్రకటనల్లో ఒంటరి మహిళలు, రెండో పెళ్లి, మతాంతర వివాహాలను అంతే వైభవంగా చూపించడం...

ఈ యాడ్‌ ఎంతో సందేశాత్మకం!

పెద్ద పెద్ద నగల దుకాణాల ప్రకటనల్లో హీరోయిన్లు లేదంటే హీరోలు, మోడళ్లు మెరవడం తెలిసిందే. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. నగల ప్రకటనల్లో  ఒంటరి మహిళలు, రెండో పెళ్లి, మతాంతర వివాహాలను అంతే వైభవంగా చూపించడం ఈ మధ్యే మొదలైంది. తాజాగా కేరళలో కొచ్చి కేంద్రంగా ఉన్న బీమా జ్యువెలరీ కంపెనీ ట్రాన్స్‌జెండర్‌ మహిళ, ఆమె ఆశలను ప్రతిబింబించేలా ఉన్న ప్రకటనను తీసుకొచ్చింది. ‘ప్రేమంత స్వచ్ఛత’ పేరుతో తెరకెక్కించిన ఈ యాడ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది భీమా కంపెనీ. దీన్ని యాడ్‌గా మాత్రమే కాదు సమాజంలో వస్తోన్న మార్పుకి సంకేతంగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. 


ప్రతి ఫ్రేమ్‌ సందేశాత్మకం

బాల్యం నుంచి పెళ్లి పీటలు ఎక్కేంత వరకు ట్రాన్స్‌మహిళల ప్రయాణాన్ని ఈ యాడ్‌ కళ్లకు కడుతుంది. యాడ్‌ ప్రారంభంలో గడ్డం, మీసాలతో ఉన్న ఒక అబ్బాయి దిగాలుగా కూర్చొని ఉంటాడు. కిచెన్‌ కిటికీలోంచి బయటకు చూస్తూ తాను ఒంటిరినని అనుకుంటూ ఉంటాడు. అబ్బాయిగా పుట్టినప్పటికీ తమ బిడ్డ అమ్మాయిలా ప్రవర్తించడం తెలిసి అతడిపై అరవకుండా అర్థం చేసుకుంటారు తల్లిదండ్రులు. అతడి పడక గదిలో ఆడపిల్లల సైకిల్‌, తండ్రి అతడికి బంగారు పట్టీలు కొనివ్వడం, అతడికి వాళ్ల అమ్మ దగ్గరుండి మరీ చెవులు కుట్టించడం... ఇలా ప్రతి చిన్న సంఘటన అతడు ట్రాన్స్‌మహిళగా మారే క్రమాన్ని తెలుపుతాయి. అమ్మాయిగా మారిన తమ బిడ్డతో కలిసి రోడ్డు దగ్గరి క్యాంటీన్‌లో భోజనం చేయడాన్ని తల్లిదండ్రులు అవమానంగా భావించకపోవడం, అమ్మమ్మ ఆమెకు చక్కగా తల దువ్వి జడ వేయడం వంటివి ప్రతి దశలో అతడికి కుటుంబ సభ్యుల నుంచి లభించిన మద్దతును ఆవిష్కరిస్తాయి. తన జీవితంలో వచ్చే ప్రతి అద్భుతమైన క్షణాల్లో తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతల నుంచి బంగారు ఆభరణాలను బహుమతిగా పొందుతాడు. చివరలో పెళ్లికూతురుగా సంప్రదాయ దుస్తుల్లో నిండుగా నగలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదితో మండపం వద్దకు వస్తుంది. 


ఇంటర్నెట్‌లో ప్రశంసల వెల్లువ 

వంద సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్‌ను రెండు రోజుల్లోనే 90వేల మందికిపైగా చూశారు. తొంభై ఆరేళ్ల్ల చరిత్ర ఉన్న బీమా జ్యువెలరీ కంపెనీ ఇలాంటి యాడ్‌కు రూపమివ్వడం అందరినీ మొదట్లో ఆశ్చర్యపరిచినా, వారి ఉద్దేశం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ట్రాన్స్‌జెండర్‌, కార్యకర్త అయిన మీరా సింఘానియా నటించిన ఈ ప్రకటన ట్రాన్స్‌మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో చెబుతుంది. అంతేకాదు ప్రతి ఒక్కరు తమ పరిస్థితిని అంగీకరించాలని, కుటుంబం, బంధువులు కూడా వారి ఇష్టాన్ని అంగీకరిచాలనే సందేశాన్ని చాటుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సమాజానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్న ఇలాంటి ప్రకటనలు మార్పును ఆహ్వానించాలని చెప్పకనే చెబుతున్నాయి.


Updated Date - 2021-04-19T05:30:00+05:30 IST