Kerala gold smuggling case: సీఎంపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా : స్వప్న సురేశ్

ABN , First Publish Date - 2022-06-09T00:05:35+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ (Kerala) బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) కేసులో

Kerala gold smuggling case: సీఎంపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా : స్వప్న సురేశ్

తిరువనంతపురం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ (Kerala) బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమేయంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ (Swapna Suresh) బుధవారం పునరుద్ఘాటించారు. ఈ ఆరోపణలు చేయడంలో తనకు వ్యక్తిగత లేదా రాజకీయ ఎజెండా ఏమీ లేదన్నారు. విజయన్ సతీమణి, కుమార్తె అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, తనను మాత్రం వదిలేశారని చెప్పారు. 


స్వప్న సురేశ్ మంగళవారం కొచ్చిలోని కోర్టులో సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం స్టేట్‌మెంట్ ఇచ్చారు. బంగారం అక్రమ రవాణా కేసు నేపథ్యంలో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఆమె ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన సతీమణి కమల, కుమార్తె వీణలపై ఆరోపణలు చేశారు. విజయన్ ఓ బ్యాగు నిండా కరెన్సీ నోట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (United Arab Emirates)కు తీసుకెళ్ళారన్నారు. ఈ ఆరోపణలను విజయన్ తోసిపుచ్చారు. తనకు వ్యతిరేకంగా రచించిన ఎజెండాలో భాగమే ఈ ఆరోపణలని విమర్శించారు. 


స్వప్న సురేశ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను కోర్టుకు స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనుక ఎటువంటి రాజకీయ ఎజెండా కానీ, వ్యక్తిగత ఎజెండా కానీ లేదన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం ఇప్పుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలను గతంలోనే దర్యాప్తు సంస్థలకు చెప్పానని తెలిపారు. తనకు ముప్పు ఉందని, తన ప్రస్తుత ఎంప్లాయర్ కూడా దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. 


పినరయి విజయన్ సతీమణి కమల, కుమార్తె వీణలపై ఈ కేసులో ఆమె చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, కమల, వీణ విలాసవంతంగా గడుపుతున్నారన్నారు. తనను మాత్రమే తన బాధలను తాను అనుభవించే విధంగా వదిలేశారన్నారు. తన స్టేట్‌మెంట్లను ఎవరూ తమ వ్యక్తిగత ఎజెండాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 


స్వప్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తాను కమల, వీణ, విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్, ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నళిని నెట్టో, మాజీ మంత్రి కేటీ జలీల్‌లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానన్నారు. వీరికి బంగారం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నట్లు చెప్పానని తెలిపారు. ఇంత కన్నా ఎక్కువ వివరాలను తాను బయటపెట్టలేనని తెలిపారు. 


యూఏఈకి కరెన్సీని తీసుకెళ్ళడంలో పినరయి విజయన్ ప్రమేయం ఉందని చెప్తూ, శివశంకర్ తనను మొదటిసారి 2016లో కలిశారన్నారు. అప్పట్లో తాను కాన్సుల్ జనరల్‌కు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పని చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఓ బ్యాగును తీసుకెళ్ళడం మర్చిపోయారని తనకు శివశంకర్ చెప్పారన్నారు. ఆ బ్యాగును దుబాయ్ తీసుకెళ్ళవలసి ఉందన్నారని తెలిపారు. ఆ బ్యాగును తిరువనంతపురంలోని కాన్సులేట్‌కు తీసుకొచ్చినపుడు, తాము దానిని స్కాన్ చేశామని, అందులో కరెన్సీ ఉందని గుర్తించామని చెప్పారు. తాను కోర్టుకు చెప్పిన ప్రతి విషయాన్నీ ఇప్పుడు బయటకు చెప్పలేనన్నారు. 


బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించే పాత్రలను చాలాసార్లు ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి పంపించేవారన్నారు. శివశంకర్ ఆదేశాల మేరకు వీటిని పంపించేవారని చెప్పారు. 


ఈ ఆరోపణలపై పినరయి విజయన్ స్పందిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. బంగారం స్మగ్లింగ్ గురించి వెల్లడి కాగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు. రాజకీయ కారణాల వల్ల తనకు వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలను పదే పదే చేస్తున్నారని తెలిపారు. ఇదంతా ఓ ఎజెండాలో భాగమని ఆరోపించారు. నిరాధార ఆరోపణల నుంచి లబ్ధి పొందాలనుకునేవారికి కేరళ సమాజం దీటైన సమాధానం చెప్తుందన్నారు. 


Updated Date - 2022-06-09T00:05:35+05:30 IST