విమాన ప్రమాదంలో మృతులకు రూ.10 లక్షల పరిహారం: కేరళ సీఎం

ABN , First Publish Date - 2020-08-08T21:01:17+05:30 IST

కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు..

విమాన ప్రమాదంలో మృతులకు రూ.10 లక్షల పరిహారం: కేరళ సీఎం

కోజికోడ్: కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కాగా సమావేశం అనంతరం సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి వైద్యం ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది..’’ అని పేర్కొన్నారు. మృతి చెందిన 18 మందిలో 14 మంది పెద్దవారు కాగా, మరో నలుగురు చిన్నారులు ఉన్నట్టు సీఎం వెల్లడించారు. ‘‘14 మంది పెద్ద వారిలో ఏడుగురు పురుషులు ఉండగా మిగతా వారంతా మహిళలే ఉన్నారు. ప్రస్తుతం మలప్పురం, కోజికోడ్‌లోని వివిధ ఆస్పత్రుల్లో 149 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకు ముందే మరో 23 మంది ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు...’’ అని ముఖ్యమంత్రి వివరించారు. నిన్న సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్‌ విమానాశ్రయం వద్ద రన్‌వేపై దిగుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-08-08T21:01:17+05:30 IST