8 ఏళ్ల బాలికకు రూ.1.5 లక్షల పరిహారం.. హైకోర్టు ఆదేశాలు.. నడిరోడ్డుపై పోలీసులు చేసిన అవమానంతో..

ABN , First Publish Date - 2021-12-23T21:57:06+05:30 IST

ఓ మహిళా పోలీస్ అధికారి క్రౌర్యంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

8 ఏళ్ల బాలికకు రూ.1.5 లక్షల పరిహారం.. హైకోర్టు ఆదేశాలు.. నడిరోడ్డుపై పోలీసులు చేసిన అవమానంతో..

ఓ మహిళా పోలీస్ అధికారి క్రౌర్యంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె విధుల్లో ఉండేందుకు అనర్హురాలని, ఆమె ఓ బాలికతో అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించిందని మండిపడింది. ఆ మహిళా పోలీస్ చేతిలో అవమానానికి గురైన బాలికకు కేరళ ప్రభుత్వం వెంటనే రూ.1.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్ దేవన్ రామచంద్రన్ బుధవారం ఈ తీర్పు వెలువరించారు. 


కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్‌‌ను చూసేందుకు అత్తింగల్‌కు చెందిన జయచంద్రన్ అనే వ్యక్తి తన 8 ఏళ్ల కూతురిని తీసుకుని ఆగస్ట్ 27న వెళ్లాడు. అక్కడ ఆ సమయంలో రజిత అనే మహిళా పోలీస్ అధికారి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విధుల్లో ఉన్నారు. వాహనంలో ఉన్న ఆమె మొబైల్ ఆ సమయంలో కనిపించకుండా పోయింది. దీంతో రజిత తన వాహానానికి పక్కనే ఉన్న జయచంద్రన్, ఆయన ఎనిమిదేళ్ల కూతురిపై మొబైల్ చోరీ ఆరోపణలు చేసింది. చోరీ చేసిన మొబైల్ ఇవ్వాలంటూ రజిత, ఇతర పోలీసులు పబ్లిక్‌లో రాజేంద్రన్‌ను, ఎనిమిదేళ్ల పాపను వేధించారు. వారిద్దరినీ తనిఖీ చేశారు. దీంతో భయపడిన ఆ పాప ఏడవడం ప్రారంభించింది. 


కొద్ది సేపటికి రజిత మొబైల్ నెంబర్‌కు కాల్ చేయగా అది వాహనంలోనే ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు వీరిద్దరికీ క్షమాపణ కూడా చెప్పకుండా అక్కణ్నుంచి వెళ్లిపోయారు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో రజితను పోలీసు శాఖ బదిలీ చేసింది. బిహేవియరల్ ట్రైనింగ్‌కు కూడా పంపింది. తమతో దురుసుగా ప్రవర్తించిన రజిత నష్ట పరిహారం చెల్లించాలంటూ రాజేంద్రన్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి రూ.1.5 లక్షల నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించాలని ఆదేశించారు. 

Updated Date - 2021-12-23T21:57:06+05:30 IST