Kerala High Court : ఏ మతానికీ చెందనివారికి ప్రభుత్వ లబ్ధిపై హైకోర్టు వివరణ

ABN , First Publish Date - 2022-08-13T21:10:41+05:30 IST

ఆర్థికంగా వెనుకబడినవారు ఏదైనా మతానికి చెందినవారు కాకపోయినప్పటికీ

Kerala High Court : ఏ మతానికీ చెందనివారికి ప్రభుత్వ లబ్ధిపై హైకోర్టు వివరణ

కొచ్చి : ఆర్థికంగా వెనుకబడినవారు ఏదైనా మతానికి చెందినవారు కాకపోయినప్పటికీ, వారికి అర్హతగల ప్రభుత్వ పథకాలను నిరాకరించరాదని కేరళ హైకోర్టు (Kerala High Court) స్పష్టం చేసింది. తమకు మతం లేదని (non-religious)  ప్రకటించినవారికి కమ్యూనిటీ సర్టిఫికేట్లను జారీ చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరు నాన్ రెలిజియస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. 


తాము ఏ మతానికీ చెందనివారమని ప్రకటించిన 12 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్థిక బలహీన వర్గాలు (EWS)కు చెందినవారికి ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాల లబ్ధిని తాము పొందేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్లు కోరారు. దీనికోసం తమకు ధ్రువపత్రాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఫార్వర్డ్ కమ్యూనిటీ కమిషన్ సిఫారసుల ప్రాతిపదికపై రాష్ట్ర ప్రభుత్వం ఓ జాబితాను తయారు చేసిందని తెలిపారు. తాము ఫలానా కులానికి, ఫలానా మతానికి చెందినవారమని ప్రకటించినవారికి మాత్రమే ఈ జాబితాలో చోటు కల్పించారని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఈడబ్ల్యూఎస్ కోటా క్రింద నాన్ రెలిజియస్ స్టూడెంట్స్‌కు అవకాశం కల్పించలేదని తెలిపారు. 


దీనిపై హైకోర్టు తీర్పు చెప్తూ, తనది అభ్యుదయవాదమని చెప్పుకునే ప్రభుత్వం ఫలానావారు ఏదైనా వర్గానికి, మతానికి చెందినవారు కాదంటూ వారికి ప్రయోజనాలను నిరాకరించరాదని చెప్పింది. తాము నాన్ రెలిజియస్ అని ప్రకటించుకున్న వ్యక్తులకు కమ్యూనిటీ సర్టిఫికేట్లను జారీ చేయడానికి ఓ విధానాన్ని, మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందని, ఇతర వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్‌ లబ్ధిని పొందేందుకు అవకాశం కల్పించాలని తెలిపింది. 


భారత రాజ్యాంగంలోని అధికరణ 15(6) ప్రకారం తమకు హామీగా లభించిన ప్రయోజనాలను పొందేందుకు ధ్రువపత్రాలను పొందే అర్హత ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన విద్యార్థులకు ఉందని హైకోర్టు చెప్పింది. ఆదాయంలో అసమానతలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలిపింది. హోదాలో అసమానతలను, అవకాశాల్లో అసమానతలను నిర్మూలించడం కోసం కృషి చేయాలని పేర్కొంది. ఈ ప్రయత్నాలు కమ్యూనిటీ, కులం, జాతి వంటివాటికి మాత్రమే పరిమితం కాకూడదని వివరించింది. 


Updated Date - 2022-08-13T21:10:41+05:30 IST