కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-10-08T20:03:54+05:30 IST

సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

కొచ్చి : సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్‌ను సుదీర్ఘకాలం నిరోధక నిర్బంధంలో కొనసాగించడాన్ని కేరళ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలిచ్చింది. కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ (COFEPOSA) ప్రకారం ఆమెను నిరోధక నిర్బంధంలో ఉంచారు. COFEPOSA ప్రకారం స్వప్న సురేశ్‌ను నిర్బంధంలో ఉంచడాన్ని సమర్థించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని జస్టిస్ ఏకే జయశంకర్ నంబియార్, జస్టిస్ మహమ్మద్ నియాస్ సీపీ డివిజన్ బెంచ్ పేర్కొంది. 


తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఉద్దేశించిన డిప్లమేటిక్ కార్గోలో 30 కేజీల బంగారం రావడంతో, ఆ బంగారాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వప్న సురేశ్ ప్రధాన నిందితురాలు. ఆమెను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గత ఏడాది జూలైలో అరెస్టు చేసింది. 


ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో యూఏఈ ప్రభుత్వం రషీద్ ఖమిస్ అల్ షీమెయిలీని రీకాల్ చేసింది. రషీద్ తరపున స్వప్న సురేశ్ పని చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. రషీద్ గత ఏడాది జూలై 16న భారత దేశం నుంచి వెళ్ళిపోయారు. రషీద్ డిప్లమేటిక్ ఏజెంట్ కాబట్టి భారత దేశ క్రిమినల్ జ్యురిస్‌డిక్షన్ నుంచి మినహాయింపు ఉంది. 


Updated Date - 2021-10-08T20:03:54+05:30 IST