Azad Kashmir: విమర్శలతో వెనక్కి తగ్గిన కేరళ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే.. ఆ వ్యాఖ్యలు వెనక్కి!

ABN , First Publish Date - 2022-08-14T01:34:59+05:30 IST

‘ఆజాద్ కశ్మీర్’(Azad Kashmir), ‘భారత్ ఆక్రమిత కశ్మీర్’( India-occupied Kashmir) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

Azad Kashmir: విమర్శలతో వెనక్కి తగ్గిన కేరళ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే.. ఆ వ్యాఖ్యలు వెనక్కి!

తిరువనంతపురం: ‘ఆజాద్ కశ్మీర్’(Azad Kashmir), ‘భారత్ ఆక్రమిత కశ్మీర్’( India-occupied Kashmir) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీ జలీల్ (K T Jaleel) తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన ఫేస్‌బుక్‌లో సవివరంగా ఓ పోస్టును షేర్ చేస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను ‘ఆజాద్ కశ్మీర్’ అని, జమ్మూ కశ్మీర్‌ను ‘భారత ఆక్రమిత జమ్మూకశ్మీర్’ అని అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను కేంద్రం తొలగించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. జలీల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. శనివారం ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. తాము మద్దతిస్తున్న జలీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయన్ తన వైఖరేంటో స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే, దీనిపై సీపీఎం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కశ్మీర్ విషయంలో సీపీఎంకు స్పష్టమైన వైఖరి ఉందని, జలీల్ వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సీపీఎం కమిటీ సభ్యుడు, మంత్రి ఎంవీ గోవిందన్ పేర్కొన్నారు. దేని ఆధారంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని, కాబట్టి ఆ వ్యాఖ్యలపై ఆయన మాత్రమే వివరణ ఇవ్వగలరని అన్నారు.


కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ.. జలీల్ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగించరని పేర్కొన్నారు. తనపై వెల్లువెత్తుతున్న నిరసన నేపథ్యంలో జలీల్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, కశ్మీర్ పర్యటనపై తన నోట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అందరికీ తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-14T01:34:59+05:30 IST