Kerala : సీఎంను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు... ఎమ్మెల్యే రీమాకు బెదిరింపు లేఖ...

ABN , First Publish Date - 2022-07-22T22:51:54+05:30 IST

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)పై విమర్శలు కొనసాగిస్తే

Kerala : సీఎంను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు... ఎమ్మెల్యే రీమాకు బెదిరింపు లేఖ...

తిరువనంతపురం : ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)పై విమర్శలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కేకే రీమ (KK Rema)కు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆమె కేరళ డీజీపీ అనిల్ కాంత్‌కు ఫిర్యాదు చేసి, ఆ లేఖను అప్పగించారు. తిరువనంతపురంలోని ఎమ్మెల్యే హాస్టల్‌కు ఈ లేఖ వచ్చినట్లు ఆమె తెలిపారు. పయ్యనూర్ కామ్రేడ్స్ పేరుతో సంతకం ఉన్నట్లు చెప్పారు. 


కన్నూర్ నుంచి ఈ లేఖ ఎమ్మెల్యే హాస్టల్‌కు జూలై 15న వచ్చినట్లు తెలుస్తోందన్నారు. అయితే శుక్రవారం దీనిని గమనించినట్లు చెప్పారు. ఈ లేఖను డీజీపీకి అప్పగించి, ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కొజిక్కోడ్ వెళ్లేందుకు బయల్దేరారు. కేరళ శాసన సభ సమావేశాలు జూలై 21న ముగిశాయి. 


ఈ లేఖలో రీమాకు అనేక ప్రశ్నలు సంధించారు. ‘‘సీపీఎం ఎమ్మెల్యే ఎంఎం మణి నీకు క్షమాపణ చెప్పాలా? ఇలాంటి డిమాండ్ చేయడానికి నీకు సిగ్గు లేదా? సీపీఎం అనే గొప్ప వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా నీకు? ఓంచియామ్ విప్లవకారుల గురించి నీకు తెలుసా? వెళ్లి నీ తండ్రిని అడుగు, ఆయనకు తెలిసి ఉంటుంది. ఓంచియామ్ అమరుల గురించి కాసేపు ఆలోచించి ఉంటే, సిగ్గులేకుండా కాంగ్రెస్ ఓట్లు పొంది, ఎమ్మెల్యే అయ్యేదానివా? నిన్ను ద్రోహి అనకుండా ఇంకేం అనాలి?’’ అని ఈ లేఖలో ఉందని రీమా చెప్పారు. 


‘‘టీపీ చంద్రశేఖరన్ హత్యలో సీపీఎం పాత్ర లేదని ఎంఎం మణి మాదిరిగానే పయ్యనూర్ కామ్రేడ్స్ కూడా చెప్తున్నాం. ఎవరో అంతబట్టని శక్తులు ఆ హత్య చేశారు. చంద్రశేఖరన్ హత్యతో సీపీఎంకు సంబంధం లేదని మణి శాసన సభలో చెప్పారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర సీనియర్ సీపీఎం నేతలను విమర్శించాలనుకుంటే జాగ్రత్తగా ఉండు. ముఖ్యమంత్రి ‘‘మా ముద్దుబిడ్డ’’. అధికారాన్ని కోల్పోయినా, మేం ఏదో ఒకటి చేయక తప్పనిసరి పరిస్థితి వస్తుంది’’  అని ఉన్నట్లు తెలిపారు.


కాంగ్రెస్ నేతలు వీడీ సతీశన్, కే మురళీధరన్, కేసీ వేణుగోపాల్ జాగ్రత్తగా ఉండాలి. మీ కోసం మా దగ్గర ఒకటి ఉంది’’ అని ఈ లేఖలో హెచ్చరించారని చెప్పారు.  తనకు గతంలో కూడా చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. ప్రతిసారీ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కనీసం దర్యాప్తు జరగలేదన్నారు. ఈసారి తాను డీజీపీని కలిసి, ఫిర్యాదు చేశానన్నారు. అయినప్పటికీ దర్యాప్తు జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. 


Updated Date - 2022-07-22T22:51:54+05:30 IST