Kerala : పీఎఫ్ఐ నేత యాహ్యా తంగల్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-29T22:06:13+05:30 IST

రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసులో

Kerala : పీఎఫ్ఐ నేత యాహ్యా తంగల్ అరెస్ట్

అలపుజ : రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) రాష్ట్ర కమిటీ సభ్యుడు యాహ్యా తంగల్‌ను కేరళ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. త్రిసూర్‌లోని పెరుంపిలవులో ఉన్న ఆయన ఇంటి వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని, అలపుజకు తీసుకెళ్ళారు. 


యాహ్యాతోపాటు మరికొందరి నేతృత్వంలో మే 21న అలపుజలో జరిగిన జన మహా సమ్మేళనంలో ఓ పదేళ్ళ బాలుడు రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.  పీఎఫ్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తంగల్ ఇంటికి పోలీసులు చేరుకునేసరికి స్థానికులు, పీఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి, పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం మీద ఇప్పటి వరకు సుమారు 20 మందిని అరెస్టు చేశారు. రెచ్చగొట్టే నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కూడా అరెస్టు చేశారు. ఈ బాలుడిని ప్రభుత్వ సంస్కరణ కేంద్రానికి పంపించి, కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 


హైకోర్టు జడ్జీలపై కూడా యాహ్యా శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జడ్జీల ఇన్నర్‌వేర్ కాషాయ రంగులో ఉన్నాయన్నారు. 


Updated Date - 2022-05-29T22:06:13+05:30 IST