కరోనా సంక్షోభంలోనూ తగ్గని ఎన్నారైల జోరు.. ప్రభుత్వ భయాలకు భిన్నంగా..

ABN , First Publish Date - 2021-11-21T03:59:31+05:30 IST

కేరళకు వచ్చే ఎన్నారై నిధుల్లో కోత పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందింది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

కరోనా సంక్షోభంలోనూ తగ్గని ఎన్నారైల జోరు.. ప్రభుత్వ భయాలకు భిన్నంగా..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేరళ వాసులు అనేక మంది భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చే ఎన్నారై నిధుల్లో కోత పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందింది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.


రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన వివరాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో ఎన్నారై డిపాజిట్ల మొత్తం విలువ రూ. 2,29,639 కోట్లు. అంతేకాకుండా.. ఎన్నారైలు భారత్‌లోని తమ బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిన నిధుల విలువ రూ. 3,76,278 కోట్లు. మునుపటితో పోలిస్తే ఎన్నారై నిధుల రాకడలో సగటున పది శాతం వృద్ధి చోటుచేసుకుందని బ్యాంకర్లు తెలిపారు. 


కేరళ ఆర్థిక వ్యవస్థకు ఎన్నారైల నిధులు కీలకం అన్న విషయం తెలిసిందే. అయితే.. కరోనా సంక్షోభం కారణంగా దాదాపు 10 లక్షల మంది కేరళవాసులు విదేశాల నుంచి తిరిగొచ్చేశారు. విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాలు కోల్పోవడంతో వారు సొంత రాష్ట్రానికి తిరిగిరాక తప్పలేదు. దీంతో.. ఎన్నారైల నిధులు రాక తగ్గి ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఎన్నారై నిధుల రాకడలో వృద్ధి నమోదైంది.  

Updated Date - 2021-11-21T03:59:31+05:30 IST