NRIల వివరాలతో డాటా బ్యాంకు ఏర్పాటు చేస్తున్న కేరళ!

ABN , First Publish Date - 2022-03-22T02:54:21+05:30 IST

విదేశాల్లో ఉంటున్న కేరళీయులకు మేలు చేకూర్చేలా కేరళ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైల వివరాలతో కూడిన ఓ సమగ్ర డాటా బేస్ ఏర్పాటు చేస్తోంది.

NRIల వివరాలతో డాటా బ్యాంకు ఏర్పాటు చేస్తున్న కేరళ!

కొచ్చి: విదేశాల్లో ఉంటున్న కేరళీయులకు మేలు చేకూర్చేలా కేరళ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైల వివరాలతో కూడిన ఓ సమగ్ర డాటా బేస్ ఏర్పాటు చేస్తోంది. అమెరికా, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్‌లలో ఉంటున్న కేరళ ఎన్నారైల పూర్తి వివరాలు ఈ డాటా బేస్‌లో చేర్చనున్నారు. కాగా.. కేరళ బడ్జెట్‌లోనూ ప్రభుత్వం డాటా బేస్ ప్రస్తావన తెచ్చింది. ఇక.. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(పీఓఐ), ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన కేరళ సంతతికి చెందిన వారికి మాత్రం ఈ డాటా బేస్‌లో చోటు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  సెంటర్ ఫర్ డెవలప్‌మెంటల్ స్టడీస్ 2018లో జరిపిన అధ్యయనం ప్రకారం.. విదేశాల్లో ఉంటున్న మలయాళీల్లో 90 శాతం మంది పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్నారు. అయితే.. కేరళ ఎన్నారైల్లో కనీసం 20 శాతం మంది అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఉన్నారని ఇంటర్నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డవలప్‌మెంట్ స్టడీస్ సంస్థ డైరెక్టర్ కేవీ జోసెఫ్ పేర్కొన్నారు. 


ఆర్బీఐ లెక్కల ప్రకారం.. 2021లో విదేశాల్లోని ఎన్నారైల నుంచి 87 బిలియన్ డాలర్ల నిధులు(రెమిటెన్స్) భారత్‌కు వచ్చాయి. ఇందులో కేరళ వాటా అత్యధికంగా 19 శాతం కాగా.. పంజాబ్ వాటా అత్యల్పంగా 1.7 శాతంగా ఉన్నట్టు తేలింది. మొత్తం రెమిటెన్స్‌లలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వాటా 58.7 శాతం. కేరళకు విదేశాల నుంచి అందే నిధుల్లో దాదాపు 22 శాతం అమెరికా, న్యూజీల్యాండ్, బ్రిటన్, నుంచి వచ్చినట్టు తేలింది. ‘‘పశ్చిమా దేశాల నుంచి అందే నిధులు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉండగా.. అమెరికా వంటి దేశాల నుంచి నిధుల రాకడ పెరిగే అవకాశం ఉంది. అందుకే కేరళ ఏన్నారైల డాటాబేస్ ఏర్పాటు చేయడం అవసరం. దీని వల్ల ప్రభుత్వం భవిష్యత్తులో కేరళీయుల ప్రయోజనాల కోసం మరింత మెరగైన విధానాలను రూపొందించగలుగుతుంది.’’ అని జోసెఫ్ అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-03-22T02:54:21+05:30 IST