Kuwait: మహిళ కన్నీటి కథ ఇది.. ఏజెంట్ మాటలు నమ్మి ఎడారి దేశానికి వెళ్తే.. అక్కడ..

ABN , First Publish Date - 2022-08-01T18:28:12+05:30 IST

కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఊపిరితిత్తుల వ్యాధితో మంచాన పడ్డాడు. దీనికి తోడు వయసైపోయిన తన తల్లి బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది. కొడుకు ఉన్నా.. అతడిది పని చేసే వయసు కాదు. ఈ క్రమంలో ఆ మహిళ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికంగా దొరికే పనితో తనను నమ్ముకుని ఉన్న వారి..

Kuwait: మహిళ కన్నీటి కథ ఇది.. ఏజెంట్ మాటలు నమ్మి ఎడారి దేశానికి వెళ్తే.. అక్కడ..

ఎన్నారై డెస్క్: కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఊపిరితిత్తుల వ్యాధితో మంచాన పడ్డాడు. దీనికి తోడు వయసైపోయిన తన తల్లి బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది. కొడుకు ఉన్నా.. అతడిది పని చేసే వయసు కాదు. ఈ క్రమంలో ఆ మహిళ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికంగా దొరికే పనితో తనను నమ్ముకుని ఉన్న వారి కడుపు నింపలేనని భావించింది. భర్త చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి ఉండటంతో ఏజెంట్ మాటలు నమ్మి కువైత్‌కు (Kuwait) బయల్దేరింది. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి విస్తుపోయింది. అనంతరం అదృష్టవశాత్తు ఆ నరక కూపం నుంచి బయటపడి.. అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. 


కేరళలో(Kerala)లోని కరువన్నూరు ప్రాంతానికి చెందిన వినీత‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వినీత దంపతులు ఓ బాబుకు జన్మనిచ్చారు. ఉన్నట్టుండి ఆమె భర్త(Husband) జబ్బుపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే.. అతడు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో కుటుంబ భారం వినీతపై పడింది. వినీతకు తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న కొడుకును పనికి పంపలేక.. ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. కువైత్‌(Kuwait)లో చిన్నపిల్లలను చూసుకునే పని ఉందంటూ ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి.. అప్పు చేసి మరీ ఫిబ్రవరి 21న ఎడారి దేశానికి బయల్దేరింది. అనంతరం అక్కడ విధుల్లో చేరిపోయింది. ఆ తర్వాత ఆమెకు విషయం అర్థమైంది. పిల్లలను చూసుకోవడంతోపాటు.. భర్తను వదిలేసిన తన యజమానురాలికి సపర్యలు చేయాలని.. వీటితోపాటు ఇంటి పనులన్నీ తానే చూసుకోవాలనే విషయాన్ని గ్రహించింది. అన్ని పనులు చేయడం కష్టమైనప్పటికీ.. ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అక్కడే పని చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే యజమానురాలి వేధింపులు మొదలయ్యాయి. వాటిని తట్టుకోలేక సాయం కోసం తనను పనిలో పెట్టిన ఏజెంట్‌ను సంప్రదించింది. అయితే ఆమెకు నిరాశే ఎదురైంది. 



అక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో ఆమె తన ఇబ్బందులు వివరిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. దాన్ని సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది. అదికాస్తా వినీత యజమానురాలి దృష్టికి వచ్చింది. దీంతో సదరు యజమానురాలు మరింత రెచ్చిపోయింది. ఇనుప రాడుతో ఇష్టమొచ్చినట్టు దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, ముక్కుకు బలమైన గాయమైన గాయాలయ్యాయి. ఈ సందర్భంగానే యజమానురాలు సంచలన విషయాన్ని బయటపెట్టింది. ‘ఏజెంట్ దగ్గర నిన్ను ఓ బానిసలా కొనుక్కున్నాను’ అని యజమానురాలు చెప్పడంతో వినీత ఒక్కసారిగా షాకైంది. ఈ క్రమంలోనే తన బాధలు వివరిస్తూ కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ(Indian embassy)ని సంప్రదించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. వినీతను ఆ నరక కూపం నుంచి తప్పించారు. సుమారు మూడు రోజులపాటు ఇండియన్ ఎంబసీలోనే ఆశ్రయం పొందిన ఆమె.. జూలై 31న తన స్వస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కువైత్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు వివరించింది. అంతేకాకుండా కువైత్‌లో తనలా ఇంకా చాలా మంది భారతీయ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. 


Updated Date - 2022-08-01T18:28:12+05:30 IST