కేరళలో 3 bird flu కేసులు...కోళ్లు, బాతులను చంపుతున్న అధికారుల బృందాలు

ABN , First Publish Date - 2021-12-15T12:34:15+05:30 IST

కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు....

కేరళలో 3 bird flu కేసులు...కోళ్లు, బాతులను చంపుతున్న అధికారుల బృందాలు

కొట్టాయం : కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.అధికారులు బుధవారం నుంచి బాతులు, కోళ్లు, పక్షులను చంపడం ప్రారంభించారు. కొట్టాయం జిల్లాలోని వేచూర్, ఐమనం, కల్లార గ్రామాల నుంచి నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. దీంతో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను కొట్టి చంపి, వాటిని కాల్చవేస్తున్నారు. గత వారం పొరుగున ఉన్న అలప్పుజా జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో అలప్పుజాలో కూడా కోళ్లు, ఇతర పక్షులను చంపారు. కొట్టాయం జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ ప్రబలిందని భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)లో జరిపిన పరీక్షల్లో వెల్లడైంది. 


ఇప్పటికే అలప్పుజా జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లను చంపడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాతులు, కోళ్లు, ఇతర పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా 8వేల బాతులను చంపామని జిల్లా అధికారులు చెప్పారు. కొట్టాయంలోని వేచూర్, కట్టమడ, వలియపుతుక్కరి-పుల్లూజిచల్ ప్రాంతాలు, కల్లార పంచాయతీలోని వెంతకరి-కిజక్కెచిర ప్రాంతం,ఐమనంలోని కలుంగుతరా-ఐక్కరశాల ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. కోళ్లు, బాతులు, పక్షులను చంపడానికి వెటర్నరీ డాక్టర్, ఒక లైవ్‌స్టాక్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు సహాయకులతో బృందాలను ఏర్పాటు చేశారు.


 కాళ్లారలో రెండు బృందాలు, వేచూర్ లో 5, ఐమనంలో 3 బృందాలు పక్షులను చంపేందుకు నియమించారు.బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 28,500 నుంచి 35,000 పక్షులను చంపాల్సి ఉంటుంది.60 రోజుల కంటే తక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.100, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.200 పరిహారం అందజేస్తారు.


Updated Date - 2021-12-15T12:34:15+05:30 IST