పోతే పోనివ్వండి.. మాకేం నష్టం లేదు: బీజేపీ సీనియర్ నేత

ABN , First Publish Date - 2022-01-24T00:26:01+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీ ఓటు బ్యాంక్ పెద్దది. రాష్ట్రంలోని జనాభాలో ఓబీసీ జనాభా 44 శాతం. ఆ తర్వాతి స్థానంలో 20.8 శాతం దళితులు ఉంటారు. ముస్లిలు 20 శాతం కాగా ఇతరులు 15 శాతం ఉంటారు. అయితే బీజేపీలోని ఓబీసీ నేతలు కొద్ది రోజులుగా..

పోతే పోనివ్వండి.. మాకేం నష్టం లేదు: బీజేపీ సీనియర్ నేత

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి కొద్ది రోజులుగా ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. అయితే దీనివల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఓబీసీ ప్రజలు తమతోనే ఉన్నారని, వారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల విశ్వాసంతో ఉన్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే పార్టీని వీడుతున్న నేతలు ఏదో భావజాలంతో కాకుండా కేవలం సొంత ప్రయోజనాల కోసమేనని కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు.


ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీ ఓటు బ్యాంక్ పెద్దది. రాష్ట్రంలోని జనాభాలో ఓబీసీ జనాభా 44 శాతం. ఆ తర్వాతి స్థానంలో 20.8 శాతం దళితులు ఉంటారు. ముస్లిలు 20 శాతం కాగా ఇతరులు 15 శాతం ఉంటారు. అయితే బీజేపీలోని ఓబీసీ నేతలు కొద్ది రోజులుగా వరుస పెట్టి పార్టీ ఫిరాయిస్తున్నారు. దీంతో బీజేపీకి ఓబీసీ ప్రజల ఆదరణ తగ్గుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే నేతలు తమ పార్టీ నుంచి వెళ్లినప్పటికీ ఆ వర్గం ప్రజలు తమతోనే ఉన్నారని కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పడం విశేషం.


‘‘రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసింది. ప్రజలకు ఇది గుర్తుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని వర్గాలను ఏకం చేస్తారు. రాష్ట్రంలోని ఓసీలు, ఓబీసీలు, దళితుల మధ్య ఆయన ఐక్యత తీసుకువస్తారు. అయినా మేం 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 స్థానాల్లో 73 స్థానాలు గెలుచుకున్నాం. కొంత మంది ఓబీసీ నేతలు పోయినంత మాత్రాన బీజేపీ వెనుకబడిపోతుందని అనుకోవద్దు. ఓబీసీ నేతలు పార్టీ వీడినా, ఆ వర్గం ప్రజలు బీజేపీతోనే ఉంటారు’’ అని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు.

Updated Date - 2022-01-24T00:26:01+05:30 IST