శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ కలిసి పని చేస్తాం: బోండ ఉమ

ABN , First Publish Date - 2021-03-06T23:45:01+05:30 IST

బెజవాడ టీడీపీ నేతల మధ్య విభేదాలు పరిష్కారమయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు తలో దారిలో ఉన్న నేతలు ఇప్పుడు

శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ కలిసి పని చేస్తాం: బోండ ఉమ

విజయవాడ: బెజవాడ టీడీపీ నేతల మధ్య విభేదాలు పరిష్కారమయినట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు తలో దారిలో ఉన్న నేతలు ఇప్పుడు సమైక్య రాగం ఆలపిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నారు. కేశినేని శ్వేత విజయానికి కృషి చేస్తామని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాయబారంతో బెజవాడలో టీడీపీ నేతల మధ్య విభేదాలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి బోండ ఉమ మీడియాతో మాట్లాడుతూ ఇకపై లోపాలకు తావులేకుండా చూసుకుంటామని తెలిపారు. అధిష్టానం ప్రకటించిన మేయర్ అభ్యర్థి శ్వేత విజయాన్నికాంక్షిస్తూ కలిసి పని చేస్తామని బోండ ఉమ ప్రకటించారు. 


శ్వేత అభ్యర్థిత్వాన్ని మేం ఎక్కడా వ్యతిరేకించలేదు: బుద్దా

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి తమ అభిప్రాయాలు చెప్పామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. శ్వేత అభ్యర్థిత్వాన్ని తాము ఎక్కడా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటే మనుషులం కాదని, విజయవాడ టీడీపీ అభ్యర్థి శ్వేత మాత్రమేనని బుద్దా వెంకన్న ప్రకటించారు. 


విజయవాడ నగర పార్టీలో సమన్వయ లోపం వాస్తవమేనని, ఆ సమన్వయలోపమే అసంతృప్తికి దారితీసిందని టీడీపీ నేత నెట్టం రఘురాం తెలిపారు. కుటుంబంలోని విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. లోపాలు పరిష్కరించుకుని ఒకే జట్టుగా ముందుకు సాగుతామని రఘురాం స్పష్టం చేశారు. వైసీపీలో అంతర్గత విభేదాలు అందరికీ తెలుసని, శ్వేతని మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు.. అహర్నిశలు కృషి చేస్తామని టీడీపీ నేత నాగుల్‌ మీరా ప్రకటించారు. 


అంతకుముందు  కేశినేని శ్వేత నేరుగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లారు. బొండ ఉమ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. శ్వేతతో పాటు టీడీపీ నేత రఘురాం కూడా ఉమ ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో సహకరించాలని ఆమె కోరారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల మద్దతును శ్వేత కోరారు. 

Updated Date - 2021-03-06T23:45:01+05:30 IST