
ముంబై: ఎన్‌సీపీ చీప్ శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరాఠీ నటి కేతకి చితాలే (Ketaki Chitale) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మిలింద్ జాదవ్ ఎదుట మంగళవారం ఆమె తరపు న్యాయవాది హరే కృష్ణ మిశ్రా పిటిషన్ దాఖలు చేస్తూ ముందస్తు విచారణకు విజ్ఞప్తి చేశారు. అయితే, నాసిక్‌కు చెందిన విద్యార్థి నిఖిల్ భామరే ఇలాంటి పిటిషన్‌నే విచారించాల్సి ఉందని, కాబట్టి ఈ నెల 10న విచారిస్తామని కోర్టు తెలిపింది.
శరద్ పవార్‌ను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో నటి కేతకిపై థానేలోని కాల్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో తనను అరెస్ట్ చేయడం, నిర్బంధించడం అక్రమమని, అది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని కేతకి ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేతకి ఆ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.
తనను అరెస్ట్ చేయడం, నిర్బంధించడం కారణంగా జరిగిన నష్టానికి, గాయాలకు తనకు పరిహారం కూడా ఇప్పించాలని కోర్టును కోరారు. అలాగే, ఈ కేసులో దర్యాప్తును నిలిపివేయాలని కూడా కోర్టును అభ్యర్థించారు. అలాగే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు అన్నింటినీ కాల్వా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని కూడా ఆమె కోరారు. కాగా, ఈ కేసులో మే 14న అరెస్ట్ అయిన కేతకి ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మేజిస్ట్రేట్ కోర్టులో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ గతంలో తిరస్కరణకు గురైంది.
ఇవి కూడా చదవండి