కేజీ రోడ్డు గుంతలమయం

ABN , First Publish Date - 2021-07-25T06:24:52+05:30 IST

కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి అంటేనే ప్రయాణికులకు దడ. నల్లమలలో ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపో యే పరిస్థితి. కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారికి ఎన్‌హెచ్‌-340సీ పేరు తో జాతీయ రహదారి హోదా కల్పించారు.

కేజీ రోడ్డు గుంతలమయం
సిద్దాపురం చెరువు కట్ట వద్ద దెబ్బతిన్న కేజీ రోడ్డు

  1. పనులకు అనుమతివ్వని అటవీశాఖ 
  2. నరకప్రాయంగా ప్రయాణం


ఆత్మకూరు, జూలై 24: కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి అంటేనే ప్రయాణికులకు దడ. నల్లమలలో ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపో యే పరిస్థితి. కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారికి ఎన్‌హెచ్‌-340సీ పేరు తో జాతీయ రహదారి హోదా కల్పించారు. కానీ అందుకు తగ్గట్లుగా ఆధునికీకరించలేదు. ఇందుకు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కర్నూలు నుంచి గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, చీరాల, ఒంగోలు, మార్కాపురం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ఈ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ రహదారి నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో రహదారి విస్తరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 


వర్షపు నీరు నిలిచి..


అటవీ ప్రాంతంలో చాలా వరకు సింగిల్‌లైన్‌ రహదారి మాత్రమే ఉంది. ఘాట్‌రోడ్డులో కేజీ రోడ్డు బాగానే ఉన్నా, మైదాన ప్రాంతాల్లో అనేక చోట్ల పూర్తిగా దెబ్బతింది. రోడ్డుకు ఇరువైపులా గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డును మెరుగుపరిస్తేనే సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. 


నిధులు మంజూరైనా..


కర్నూలు నుంచి దోర్నాల వరకు కేజీ రోడ్డు మరమ్మతులకు రూ.20 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో అక్కడక్కడా దెబ్బతిన్న కేజీ రోడ్డుకు మరమ్మతు చేయాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల పనులు జరిగినా, టెండరు ప్రక్రియలో జాప్యం కారణంగా చాలా చోట్ల ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించి కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిని బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2021-07-25T06:24:52+05:30 IST