కేజీబీవీలకు టీచర్ల కొరత

ABN , First Publish Date - 2022-06-29T06:18:51+05:30 IST

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో బోధనపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.

కేజీబీవీలకు టీచర్ల కొరత

ప్రిన్సిపాల్‌ పోస్టులు 15, కాంట్రాక్టు రెసిడెన్సియల్‌ టీచర్‌ (సీఆర్‌టీ) పోస్టులు 44, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు 112...ఖాళీ

బోధనపై తీవ్ర ప్రభావం

ఇబ్బందిపడుతున్న విద్యార్థినులు

భర్తీపై దృష్టిపెట్టని పాలకులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో బోధనపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేకుండానే గత విద్యా సంవత్సరాన్ని నడిపించేసింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గల 34 కేజీబీవీల్లో  ప్రస్తుతం 15 ప్రిన్సిపాల్‌ పోస్టులు, 44 కాంట్రాక్టు రెసిడెన్సియల్‌ టీచర్‌ (సీఆర్‌టీ) పోస్టులు, 112 పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులు...మొత్తం 171 ఖాళీలు ఉన్నాయి. దాదాపు సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే నెల ఐదో తేదీ నుంచి కేజీబీవీలు పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని 34 కేజీబీవీల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు పూర్తిచేశారు. ప్రతి కేజీబీవీలో 40 మంది చొప్పున 1,360 మందికి ప్రవేశాలు కల్పించారు. దీనికితోడు ఇంటర్‌ ప్రఽథమ సంవత్సరంలో ప్రవేశాలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇంటర్మీడియట్‌లో ప్రతి కేజీబీవీలో 40 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు. జిల్లాలో 14 కేజీబీవీల్లో బైపీసీ, 12చోట్ల ఎంపీసీ, ఆరుచోట్ల ఒకేషనల్‌, రెండుచోట్ల ఎంఈసీ కోర్సులు అందిస్తున్నారు. బహుశా వచ్చే నెల మూడో వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు. అయితే ఇంటర్‌  బోధనకు అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో ప్రస్తుతం 66 మంది పోస్టుగ్రాడ్యుయేషన్‌ టీచర్‌లు మాత్రమే ఉన్నారు. మరో 112 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత విద్యా సంవత్సరం చివరి (ఏప్రిల్‌, మే)లో అతిథి అధ్యాపకులను తీసుకుని బోధన సాగించినా...ఏడాది ప్రారంభం నుంచి సవ్యంగా జరగకపోవడంతో పాఠాలు అర్థం కాక బాలికలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరానికైనా టీచర్ల నియామకం చేపట్టాలి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. 


గత ఏడాది దరఖాస్తులు ఏమైనట్టు?

ప్రిన్పిపాల్‌, సీఆర్‌టీ, పీజీటీల నియామకానికి గత ఏడాది నవంబరులో ప్రకటన జారీచేస్తే మొత్తం 4,310 దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్రూటినీ చేసి మెరిట్‌ ప్రాతిపదికన జాబితా రూపొందించారు. ఈ ఏడాది జనవరిలో నియామకాలు చేపడతామని అధికారులు ప్రకటించారు. చివరకు ఏమైందోగానీ..జాబితాలు కట్టకట్టి పక్కనపెట్టారు. చివరకు విద్యా సంవత్సరం ముగిసిపోయింది. అయితే టీచర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నా...గత ఏడాది స్వీకరించిన దరఖాస్తులు ఏమి చేస్తారు? అనేది స్పష్టత ఇవ్వడం లేదు. త్వరలో నోటిఫికేషన్‌ జారీచేస్తే గత ఏడాది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు మరోసారి దరఖాస్తు చేయాలా?, అవసరం లేదా?...అనేదానిపై ఉన్నతాధికారులు ప్రకటన చేయాలి. 


జీతం తక్కువ, చాకిరీ ఎక్కువ

సీఆర్‌టీలకు నెలకు రూ.22 వేలు, పీజీటీలకు రూ.12 వేలు చెల్లిస్తున్నారు. ఆయా సిబ్బంది రోజుకు రెండు పీరియడ్లు మాత్రమే బోధించాల్సి వున్నప్పటికీ సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటున్నారు. రాత్రి విధులను కూడా అప్పగిస్తున్నారు. విచిత్రమేమిటంటే కేజీబీల్లో పనిచేస్తున్న ఆయాలకు రూ.14 వేలు జీతం ఇస్తుండగా, పీజీటీలకు రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తుండడం గమనార్హం. వీరి వేతనాలను పెంచాలని ఏళ్ల తరబడి డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 


త్వరలో నియామకాలు 

బి.శ్రీనివాసరావు అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటరు, సమగ్రశిక్షా అభియాన్‌

ఉమ్మడి జిల్లాలోని 34 కేజీబీవీల్లో ఇంటర్‌ ప్రథమ ఏడాదిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశాం. బాలికలు వచ్చే నెల 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ఇంటర్‌ బోధనకు టీచర్ల నియామకాలకు కూడా త్వరలో నోటిఫికేషన్‌ జారీచేస్తాం. ప్రిన్సిపాళ్లు, సీఆర్‌టీ, పీజీటీ నియామకాలు పూర్తిచేసి, వచ్చే ఏడాది బోధనకు ఇబ్బందులు తొలగిస్తాం. 

Updated Date - 2022-06-29T06:18:51+05:30 IST