దాదాగిరి..!

ABN , First Publish Date - 2022-05-16T06:46:13+05:30 IST

పట్టణాల నడిబొడ్డున ఉన్న నివాస స్థలాలు, శివారు ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అధికారం మాటున సామాన్యుడి భూములు లాక్కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలంలో ఓ

దాదాగిరి..!
ముద్దనూరులోని వివాదాస్పదమైన భూమి

అధికారం మాటున చెలరేగుతున్న ఖద్దర్‌ చొక్కాలు

ప్రైవేటు ఆస్తులపై కన్ను 

విలువైన స్థలాలు..భూములు లాక్కునే యత్నం

కడప, ప్రొద్దుటూరు, ముద్దనూరులో నయా కల్చర్‌


భూములు, స్థలాలను ఆక్రమించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇపుడు నయా కల్చర్‌ మొదలైంది. అధికారం మాటున కొందరు నాయకులు సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. దాదాగిరి చేస్తూ కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అతి తక్కువ ధరకే లాగేసుకుంటున్నారు. రౌడీలు, గూండాలు, ఇతర వారి నుంచి అన్యాయం జరిగితే సామాన్యుడు వెంటనే న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళతాడు. అయితే అధికారం మాటున కొందరు ఖద్దరు నేతలే భూములు లాగేసుకుంటుండడంతో స్టేషన్‌ మెట్లు ఎక్కినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ న్యాయం వన్‌సైడ్‌ అన్న భావనతో కొందరు ఆ ప్రయత్నం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


(కడప - ఆంధ్రజ్యోతి): పట్టణాల నడిబొడ్డున ఉన్న నివాస స్థలాలు, శివారు ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అధికారం మాటున సామాన్యుడి భూములు లాక్కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలంలో ఓ వ్యక్తి కడపలో క్లీనిక్‌ నడుపుతున్నారు. ఆయన ఓ పార్టీకి సానుభూతిపరుడు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నపుడే ఓ సంస్థకు చెందిన భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో ఒకాయన ఆ భూముల గురించి నానాయాగీ చేశారు. అయితే 2014 ఎన్నికల్లో అధికారం ఆ నేతకు దక్కడంతో ఆ వైద్యుడి నుంచి సుమారు 20 ఎకరాలు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఇప్పుడక్కడ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ వేసి ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. అప్పట్లో టీడీపీ హయాంలో ఆక్రమమైన భూములు వైసీపీ హయాంలో ఆ భూములు ఎలా కొనుగోలు చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ వైద్యుడిని బెదిరించి తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

- రిమ్స్‌ రింగు రోడ్డులో వైసీపీకి చెందిన కార్యకర్తకు చెందిన భూమి మూడు ఎకరాలు ఉంది. సుమారు రూ.10 కోట్ల ధర పలుకుతుంది. అయితే ఆ నాయకుడు తొలుత ఆ భూమిని తనకు అమ్మాలని ఓ మధ్యవర్తి ద్వారా ప్రతిపాదనలు చేశారు. అది కూడా అతి తక్కువ ధరకే అడిగినట్లు తెలిసింది. అయితే అతను ఇంత విలువైన భూమిని నేను వదులుకోనంటూ మొండికేశారు. అంతే వారం తర్వాత ఈ భూమి మాదంటూ కొత్తవారిని రెఫర్‌ చేసి వివాదానికి తెరలేపారు. వెరసి ఈ పంచాయితీ న్యాయస్థానంలో ఉంది. 

- జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని ఇటీవలే ప్రకాశ్‌నగర్‌లోకి మార్చారు. అక్కడ విలువైన ఎకరా భూమిని కాజేసేందుకు తొలుత తక్కువ ధరకు కొనాలని చూశారు. సుమారు రూ.5 కోట్ల భూమిని తక్కువ ధరకు అడగడంతో అతను ఒప్పుకోలేదని చెబుతారు. ఇది మాదంటూ అక్కడ ఆక్రమించే ప్రయత్నం మొదలుపెట్టారు. 

- కడప నగరంలోని వై-జంక్షన్‌లో సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 0.60 సెంట్ల భూమి వివాదాస్పదంలో ఉంది. దీంతో ఒకాయన రంగంలోకి దిగారు. ఇది నాదంటూ ఫెన్సింగ్‌ వేసినట్లు చెబుతారు. ఆయన ప్రముఖ వ్యక్తి కావడంతో మిగతా వారు నోరెత్తని పరిస్థితి నెలకొంది. 

- రాజంపేట బైపా్‌సలో ఓ షోరూం పక్కన సుమారు రూ.15 కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని అమ్మాలని చిన్నచౌక్‌ను శాసించే వ్యక్తులు చూస్తున్నట్లు చెబుతారు. అయితే వారు ససేమిరా అనడంతో ఓ ఫేక్‌ డాక్యుమెంట్‌ సృష్టించి దానిని కాజేసేందుకు యత్నం చేస్తున్నారు. 

- కడప నుంచి రిమ్స్‌కు వెళ్లే రహదారిలో 0.92 సెంట్ల స్థలం వివాదంలో ఉంది. దానిని కూడా కొందరు ఆక్రమణ చేసినట్లు చెబుతారు. 

- ప్రొద్దుటూరు పట్టణంలో వెనుకబడిన ప్రాంతానికి చెందిన ఓ మాజీ వస్త్ర వ్యాపారికి దొరసానిపల్లెలోని రామాపురంలో సుమారు 30 ఎకరాలు ఉందని చెబుతారు. అక్కడ ఎకరా రూ.70 లక్షల నుంచి కోటి రూపాయలు పలుకుతోంది. అయితే అక్కడ ప్రొద్దుటూరును శాసిస్తున్న కొందరు ఆ భూమిని తక్కువ ధరకే కొనేసినట్లు తెలుస్తోంది. సుమారు 10 ఎకరాలు భూమిని లాగేసుకున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు విలువైన భూములను గుర్తిస్తారు. తొలుత ఆ భూములను మాకే అమ్మాల్సిందిగా అడుగుతారు. అక్కడున్న ధర ప్రకారం భూములు అడిగితే పొరపాటే. అక్కడ రేటు సుమారు కోటి రూపాయలు ఉంటే రూ.25 లక్షలు అని చెబుతారు. ఇవ్వకపోతే ఆ భూమిపై లిటిగేషన్‌ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారని అంటుంటారు. 

- ప్రొద్దుటూరులోని కొత్తపేటలో మూడు ఎకరాల భూమి ఓ వ్యక్తికి ఉంది. అక్కడ ఎకరం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లకు జరుగుతోంది. అయితే తొలుత ఆ భూమిని కావాలని కన్నేసిన కొందరు తొలుత రాయబారం పంపారు. అంత విలువైన భూమిని వదిలేసేందుకు సిద్ధపడలేదు. అంతే ఓ బ్యాచ్‌ను పంపి ఈ భూమి మాదంటూ హడావిడి చేశారు. చివరకు ఆ వ్యక్తి చెప్పిన ధరకే అమ్ముకున్నట్లు చెబుతారు. 

- జమ్మలమడుగుకు వెళ్లే దారిలో చౌటపల్లెలో ఓ ఉద్యోగికి మరొక వ్యక్తి సంబంధించి సుమారు 3 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఎకరా దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంది. బెదిరించేసి తక్కువ ధరకు ఆక్రమించినట్లు సమాచారం. భూమిని కూడా లాగేసుకుందుకు ప్రయత్నించడంతో అది వివాదాస్పదం కావడంతో ఆగిపోయింది. 

- దొరసానిపల్లె రోడ్డులోని ఓ స్కూల్‌ వద్ద స్థలాన్ని ఆక్రమించినట్లు చెబుతారు. ఆ స్థలం యజమాని అమెరికాలో ఉన్నారంట. అక్కడ సెంటు రూ.20 లక్షలకు పైగా ఉన్నట్లు చెబుతారు. అయితే ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు ఆ ఎన్నారై సుమారు రూ.70 లక్షల వరకు వారికి కప్పం కట్టినట్లు ప్రచారం ఉంది. 

- ముద్దనూరులో భూకబ్జాదారులకు అడ్డే లేకుండా పోతున్నట్లు చెబుతారు. ఓ నేత బంధువు విలువైన భూమి ఉంటే చాలు వాటిని కాజేస్తారని అంటుంటారు. ఆ భూముల కోసం నేరుగా రాకుండా ఇన్‌డైరెక్ట్‌గా కాజేస్తారని ప్రచారం ఉంది. తొలుత ఆ భూముల కోసం మధ్యవర్తిని పంపి అక్కడ భూమిని అమ్మండి, ఫలానా భూమి అమ్ముతారా ఫలానా రేటు ఇస్తామంటూ ప్రపోజల్‌ పెడతారంట. వినకుంటే ఆయనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూములకు లిటిగేషన్‌ పెడతారని చెబుతారు. ముద్దనూరు-ఎర్రగుంట్ల రోడ్డులో ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన 9 మందికి సుమారు 6 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఎకరా రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉంది. ఆ భూమిపై కన్నేసిన స్థానిక నేత ఎకరా రూ.20 లక్షలకు అమ్మాలని వేరే వ్యక్తి ద్వారా రాయబారం నడిపించారు. భూమి యజమానులు అందుకు ఒప్పుకోకపోవడంతో కొద్దిరోజుల తర్వాత ఈ భూమి తనదంటూ ప్రొద్దుటూరుకు చెందిన  ఓ మహిళను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ భూమి మాదేనని న్యాయం చేయండంటూ బాధితులు రెవెన్యూ అధికారులు, స్పందనలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు. అలాగే ముద్దనూరు-పులివెందుల రోడ్డులో ఎకరా కోటి రూపాయల వరకు పలుకుతోంది. ఇక్కడ కూడా భూములను ఆక్రమించినట్లు చెబుతారు. ఇలా ముద్దనూరులోనే సుమారు 200 ఎకరాల భూములను తక్కువ ధరకే లాగేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ట్రెండు మైదుకూరు, పోరుమామిళ్లతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-05-16T06:46:13+05:30 IST