Rahul Counter Pm: దేశం కోసం ఖాదీ, త్రివర్ణ పతాకం కోసం చైనా పాలిస్టర్

ABN , First Publish Date - 2022-08-28T22:03:44+05:30 IST

ఖాదీ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారంటూ విపక్ష పార్టీల నేతలు..

Rahul Counter Pm: దేశం కోసం ఖాదీ, త్రివర్ణ పతాకం కోసం చైనా పాలిస్టర్

న్యూఢిల్లీ: ఖాదీ (Khadi) విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని (Double speak) విపక్ష పార్టీల నేతలు  (opposition leaders) ఆదివారంనాడు విమర్శలు గుప్పించారు. ఆయన మాటలకు, చేతలకు ఎప్పుడూ పొంతన ఉండవని ఆక్షేపించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే చేనేత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దిగజారిందని, నాసిరకం ఉత్పత్తిగా పరిగణిస్తున్నారని, చేనేతతో అనుబంధం ఏర్పరచుకున్న గ్రామీణ పరిశ్రమ నాశనం కావడమే దానికి కారణమని అమ్మదాబాద్‌లో జరిగిన 'ఖాదీ ఉత్సవ్'లో మోదీ వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్ భారత్ కల సాకారానికి ఖాదీ ఒక స్ఫూర్తి అని, ఎనిమిదేళ్ల తమ హయాంలో ఖాదీని ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నామని చెప్పారు.


మోదీ వ్యాఖ్యాలను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహల్ గాంధీ ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో తిప్పికొట్టారు. ''దేశం కోసం ఖాదీ, జాతీయ పతాకం కోసం మాత్రం చైనా పోలిస్టర్. ఎప్పటిలాగానే ప్రధాని మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదు'' అని రాహుల్ ఆ ట్వీట్‌లో ఆక్షేపణ తెలిపారు.


మీరు కాదా దెబ్బతీసింది?

కాగా, ఫ్లాగ్ కోడ్‌ను సవరించడం ద్వారా చేనేతరంగంలోని చిన్న ఉత్పత్తిదారులను దెబ్బతీసిన వారు ఇప్పుడు ఖాదీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని, హిందుత్వ సిద్ధాంతవాదులుగా చెప్పుకునే వారి రెండు నాల్కల మాటలకు అద్దం పడతాయని  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. పాలిస్టర్ జెండాలను అనుమతిస్తూ ఫ్లాగ్ కోడ్‌లో మార్పు చేయడాన్ని గతంలోనూ విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఈ చర్య చైనా వ్యాపారానికి తోడ్పాటు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశాయి.


చైనా పాలిస్టర్‌ను ఇంటింటికి తెచ్చారు..

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ సైతం ఇంతకుముందు ఓ ట్వీట్‌లో ఘాటు విమర్శలు చేశారు. ''స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నడూ పాల్గోనివారు, నాగపూర్‌లో 52 ఏళ్లుగా త్రివర్ణ పతాకం ఎగురవేయని వారు, తివర్ణ పతాకం, ఖాదీతో దేశ అనుబంధాన్ని ఎలా అర్ధం చేసుకోగలరు?'' అని ఆయన ప్రశ్నించారు. మన భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనాకు ఉపకరించేలా ఈ చర్య ఉందని, పాలిస్టర్ ట్రైకలర్‌ను దిగుమతి చేసుకోవడం అంటే చైనా పాలిస్టర్‌ త్రివర్ణ పతాకాన్ని ఇంటింటికి చేర్చడమేనని అన్నారు.

Updated Date - 2022-08-28T22:03:44+05:30 IST