‘గుట్కా’సురులు!

ABN , First Publish Date - 2021-06-23T05:26:50+05:30 IST

జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున ఖైనీ, గుట్కాలతో పాటు గంజాయి, మద్యం పోలీసులకు పట్టుబడుతోంది. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు మండలాలకు పెద్ద ఎత్తున నిల్వలు చేరుతున్నాయి.

‘గుట్కా’సురులు!
ఇచ్ఛాపురంలో పోలీసులకు పట్టుబడిన గుట్కా, ఖైనీ, గంజాయి


జిల్లాలో జోరుగా ఖైనీ, గుట్కా , గంజాయి విక్రయాలు

ఒడిశా నుంచి యథేచ్ఛగా రవాణా

కానరాని నిషేధాజ్ఞలు

రెచ్చిపోతున్న అక్రమార్కులు

సరిహద్దు ప్రాంతాల్లో స్థావరాలు

మాఫియాగా ఏర్పడి దందా

తూతూమంత్రపు తనిఖీలతో మమ

నిద్దరోతున్న ఎస్‌ఈబీ

ప్రజారోగ్యానికి భంగం


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున ఖైనీ, గుట్కాలతో పాటు గంజాయి, మద్యం పోలీసులకు పట్టుబడుతోంది. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు మండలాలకు పెద్ద ఎత్తున నిల్వలు చేరుతున్నాయి. అక్కడి నుంచి జిల్లా మొత్తం సరఫరా అవుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు మండలాల్లోని గ్రామీణ రహదారుల గుండా వీటిని జిల్లాకు చేర్చుతున్నారు. ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకొని రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నియంత్రించాల్సిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో నిద్దరోతోంది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఖైనీ, గుట్కా నిషేధం అమల్లో ఉంది. 2013 ఉమ్మడి రాష్ట్రంలోనే నిషేధాజ్ఞాలు జారీ అయ్యాయి. కానీ పేరుకే నిషేధం...అన్నిచోట్లా వీటి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా సమాచారం అందిస్తే, పోలీసులు దాడి చేసి.. కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. చిరు వ్యాపారుల అరెస్ట్‌లతో సరిపెడుతున్నారు. దీని వెనుక మూలాలు, మాఫియా గుట్టును మాత్రం వెలికి తీయలేకపోతున్నారు. గుట్కా వ్యాపారుల ఆగడాలకు విసుగు చెంది ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు శూన్యం. వీటి రవాణాను పూర్తిస్థాయిలో నిలువరించి మూలాలు కనుగొనే ప్రయత్నాలు చేయడం లేదు. సమాచారం వచ్చిన వెంటనే దాడులు జరిపి కొందరిపై కేసులు పట్టి మీడియాకు సమాచారం ఇవ్వడంతో తమ పనైపోయిందన్నట్ల వ్యవహరిస్తున్నారు. 


 సరిహద్దు మండలాల మీదుగా...

జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, భామిని ఒడిశా సరిహద్దు మండలాలు. ఒడిశా నుంచి మన జిల్లాకు అంతర్‌ రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులు ఉన్నాయి. వీటి గుండానే గుట్కా, ఖైనీ, మద్యం, గంజాయి వంటివి రవాణా చేస్తున్నారు. మద్యం నియంత్రణకు పోలీస్‌ శాఖ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా... ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. అక్రమార్కులు గ్రామీణ రహదారుల గుండా జిల్లాకు వాటిని చేర్చుతున్నారు. వీటి నియంత్రణ కోసం ప్రత్యేకంగా నియమించిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా వాటిని రవాణా చేస్తున్నారు. ఇందుకుగాను ఒక మాఫియాగా మారి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస-కాశీబుగ్గ, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, పాలకొండ, వీరఘట్టం, రాజాం తదితర పట్టణాల్లో గోదాముల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రధాన పట్టణాల్లో ఇటీవల వీటి నిల్వలు పట్టుబడడడం ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.  


 ఉమ్మడి దాడులేవీ?

వాస్తవానికి నిషేధిత గుట్కా నిల్వలు అమ్మకుండా రెవెన్యూ, పొలీసు, ఆహార తనిఖీ శాఖ అధికారులు చూడాల్సి ఉంది. స్థానిక పరిస్థితులను బట్టి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల సమన్వయంతో ఉమ్మడిగా దాడులు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఆవిధంగా జరగడం లేదు. ఫిర్యాదులు అందగానే పోలీసులు వ్యాపారుల వద్దకు వాలిపోయి మొక్కుబడిగా కొన్ని కేసులు నమోదు చేయడానికి అలవాటు పడ్డారు. ఇక రెవెన్యూ, ఆహార తనిఖీ శాఖ అధికారులు గుట్కా అమ్మకాల నియంత్రణ ఊసెత్తిన సందర్భం లేదనే చెప్పాలి. 2005 ఆహార భద్రత చట్టం ప్రకారం గుట్కా తయారు చేసినా... విక్రయించినా, రవాణా చేసినా చట్టరీత్యా నేరం. వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, రవాణా, కార్మిక, పురపాలక, పంచాయతీరాజ్‌, నిఘా, వాణిజ్య పన్నుల శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా గుట్కా అమ్మకాలపై తనిఖీలు చేయాలి. కానీ ఏ సందర్భంలోనూ అన్ని శాఖలు కలిసి గుట్కాపై నిల్వలపై దాడులు చేసిన సందర్భాలు లేవు.




Updated Date - 2021-06-23T05:26:50+05:30 IST