కంటైనర్‌లో ఖైనీ ప్యాకెట్లు

ABN , First Publish Date - 2021-02-27T05:22:39+05:30 IST

ఖైనీ, గుట్కాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించినా.. అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. రాష్ట్రంలో నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో అక్రమార్కులు ఒడిశా రాష్ట్రం నుంచి వీటిని అడ్డదారిలో దిగుమతి చేస్తున్నారు. దొరికితే దొంగలు.. లేదంటే దొరలు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శుక్రవారం కాకినాడకు చెందిన ఇద్దరు .. కంటైనర్‌ లారీలో ఖైనీ ప్యాకెట్ల బస్తాలు, సిగరెట్‌ పెట్టెలు ఒడిశా నుంచి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేయగా.. రూ24.75 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్ల బస్తాలు, సిగరెట్‌ పెట్టెలు లభ్యమయ్యాయి.

కంటైనర్‌లో ఖైనీ ప్యాకెట్లు
పోలీసులకు పట్టుబడిన ఖైనీ, సిగరెట్‌ పెట్టెల నిల్వలు

ఒడిశా నుంచి అక్రమ రవాణా

పురషోత్తపురం చెక్‌పోస్టు వద్ద గుట్టురట్టు 

కాకినాడకు చెందిన ఇద్దరు డ్రైవర్లు అరెస్టు

రూ.24.75 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 26 : ఖైనీ, గుట్కాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించినా.. అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. రాష్ట్రంలో నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో అక్రమార్కులు ఒడిశా రాష్ట్రం నుంచి వీటిని అడ్డదారిలో దిగుమతి చేస్తున్నారు. దొరికితే దొంగలు.. లేదంటే దొరలు అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శుక్రవారం కాకినాడకు చెందిన ఇద్దరు .. కంటైనర్‌ లారీలో ఖైనీ ప్యాకెట్ల బస్తాలు, సిగరెట్‌ పెట్టెలు ఒడిశా నుంచి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేయగా.. రూ24.75 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్ల బస్తాలు, సిగరెట్‌ పెట్టెలు లభ్యమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ‘శుక్రవారం వేకువజామున పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేశాం. ఈ క్రమంలో ఓ కంటైనర్‌ లారీని కూడా తనిఖీ చేయగా రూ.9.75 లక్షల విలువైన 65 ఖైనీ ప్యాకెట్ల బస్తాలు,  రూ.15 లక్షల విలువైన 20 సిగరెట్‌ బాక్సులు పట్టుబడ్డాయి. ఈ కంటైనర్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి చేపల లోడ్‌తో కలకత్తా వెళ్లింది. ఈ క్రమంలో కాకినాడకు చెందిన వ్యాపారి పచ్చిగోళ్ల అప్పారావు ఖైనీ, సిగరెట్‌ బాక్సులు ఒడిశా నుంచి తీసుకురావాలని కంటైనర్‌ డ్రైవర్లకు సూచించారు. ఇందుకోసం రూ.10వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో కలకత్తా నుంచి తిరిగివచ్చే సమయంలో ఒడిశా రాష్ట్రం సుర్లా నుంచి ఖైనీ, సిగరెట్‌ బాక్సులను కంటైనర్‌లో డ్రైవర్లు లోడ్‌ చేశారు. గుట్టుగా వీటిని రవాణా చేయాలని భావించారు. కానీ, తనిఖీల్లో భాగంగా ఇద్దరు డ్రైవర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు’ అని సీఐ వినోద్‌బాబు తెలిపారు. వీటికి సంబందించి డీసీటీఓకు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించామన్నారు. ఈ మేరకు కాకినాడకు చెందిన కంటైనర్‌ డ్రైవర్లు దుర్గాప్రసాద్‌, అనంతలక్ష్మీ నారాయణపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఖైనీ ప్యాకెట్లు, సిగరెట్‌ బాక్సుల నిల్వలను సీజ్‌ చేశామన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:22:39+05:30 IST