పాలకపక్ష బంటులై చెలరేగుతున్న ఖాకీలు !

ABN , First Publish Date - 2022-10-05T06:36:29+05:30 IST

రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ ప్రజాస్వామ్యానికి భిన్నంగా నడుస్తున్నాయి. చివరికి పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యాన్ని హననం చేసి, తానే రాజు తానే మంత్రి అనే విధంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి...

పాలకపక్ష బంటులై చెలరేగుతున్న ఖాకీలు !

రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ ప్రజాస్వామ్యానికి భిన్నంగా నడుస్తున్నాయి. చివరికి పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యాన్ని హననం చేసి, తానే రాజు తానే మంత్రి అనే విధంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి. ఆయనకు ఉన్న పేర్లు, రంగుల పిచ్చి ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. ఏది కనిపిస్తే దానికి పార్టీ రంగులు పూయడమో, లేదా తన పేరో తన తండ్రి పేరో పెట్టడమో చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం ఒక చారిత్రక తప్పిదం. వైద్య విద్యకు ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలని, వైద్య విద్య ప్రమాణాలు పెంచాలని ఉన్నతమైన ఆశయంతో 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించారు. కానీ ఎన్టీఆర్ తన పేరు పెట్టుకోలేదు. ఆయన మరణానంతరం ఆ పేరు పెట్టారు. 


ఇప్పటికే జగన్ రెడ్డి అనేక ప్రభుత్వ పథకాలకు తన సొంత పేర్లు పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 90 పథకాలకు పేర్లు మార్చి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకొని జబ్బలు చరుచుకుంటున్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించో, లేదా ఇంకా గొప్ప పథకాలు రూపొందించో తన తండ్రి పేరు గానీ, తన పేరు గానీ పెట్టుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఉన్న పేర్లను తొలగించి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టడం సమంజసం కాదు. ఇది వైఎస్సార్‌కి కూడా గౌరవం తెచ్చిపెట్టే అంశం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇలానే అలోచించి ఉంటే వైఎస్సార్ జ్ఞాపకాలు ఏవీ మిగిలేవి కావు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ తెలుగువారందరినీ అవమానపరిచే విధంగా ఉంది ఈ నిర్ణయం. జగన్ రెడ్డి దీనిని ఉపసంహరించుకోకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురి అవుతారు. న్యాయస్థానంలో మరోసారి చీవాట్లు తినక తప్పదు. 


ప్రజలను ఏకం చేసి పాలించటం పోయి, వారిని రెచ్చగొట్టి విడదీసే హేయమైన వ్యవహార శైలిని ప్రదర్శిస్తున్నారు జగన్. ‘అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటారా?’ అని సాక్షాత్తు ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఆ ప్రాంత ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాష్ట్రం తగలబడుతుంటే చలికాచుకుంటూ పైశాచిక ఆనందం పొందాలనుకోవటం ఎలాంటి రాజకీయం? ఈ వ్యాఖ్యల్ని చేయకముందే ముఖ్యమంత్రి ప్రజల్ని రెచ్చగొట్టే బాధ్యతను తన సహచర మంత్రులకు అప్పగించారు. వారం రోజులుగా మంత్రులు చేస్తున్న ప్రకటనలపై ఉత్తరాంధ్ర ప్రజలు ఏమాత్రం స్పందించకపోవడంతో ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగారు. రాజద్రోహం కేసులు పెట్టవలసింది అమాయకులపై కాదు, ఇలా సమాజ విచ్ఛిన్నానికి పాల్పడుతూ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగించే ఇలాంటి వేర్పాటువాద శక్తులపైన.


రాష్ట్రంలో నేరం, రాజకీయం సహజీవనం చేస్తున్నాయి. నేరాన్ని నివారించాల్సిన ఖాకీ నేరపూరితమైన రాజకీయాలకు ఊడిగం చేస్తున్నది. ఖాకీ, ఖద్దరూ రెండూ కలిసి రాజకీయ, సామాజిక విలువలను సమాధి చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి తన సొంత నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. సొంత పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ వరకు పోలీసులు వ్యవహరించిన తీరు పోలీసు వ్యవస్థకు మాయనిమచ్చగా మిగిలిపోతుంది. 


రఘురామ కృష్ణంరాజుపై జరిగిన దౌర్జన్యం ఒక ఎత్తయితే పార్లమెంటు సభ్యునిగా ఆయనకు తన సొంత నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ, రక్షణ కూడా కరువయ్యాయి. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? నెల్లూరు కోర్టులో ఫైల్స్ మాయమైన సంఘటన మొదలు బూతు వీడియోల ఘటన వరకూ పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన వివరణలు ఆ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నాయి. అధికారపక్షంలో ఉన్న వాళ్ళు కళ్ళు పీకి కుళ్ళ బొడిచినా, కాళ్ళు విరిచి కత్తులతో పొడిచినా అతిస్వల్ప కేసులే. అధికార పార్టీ నేతల ఒత్తిడి పెరిగితే నిందితులను బాధితులుగా, బాధితులను నిందితులుగా మారుస్తున్నారు. సొంత బాబాయి హత్యకేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్‌సింగ్ పైనా పోలీసులు కేసు పెట్టడం కొసమెరుపు. ఎస్సీలపై సైతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. 


నిన్నటివరకు డీజీపీగా శక్తి వంచన లేకుండా ప్రభుభక్తిని చాటుకుంటూ అధికార పక్షానికి ఊడిగం చేసినా ముఖ్యమంత్రి సంతృప్తి చెందినట్లు లేదు. పలు సందర్భాల్లో న్యాయస్థానం ముందు దోషిగా నిలబడి సదరు డీజీపీ తన పరువు పోగొట్టుకున్నారు. అయినా ముఖ్యమంత్రి అర్ధాంతరంగా ఆయన్ని బదిలీచేసి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అర్హత లేకపోయినా డీజీపీగా నియమించుకున్నారు. అర్హత ఉన్న సీనియర్ అధికారులు భయంతో, భక్తితో నోరు మెదపలేదు. 


జీతం తీసుకొనేది ప్రజలను రక్షించడానికే అయినా కొంతమంది పోలీసులు నిస్సిగ్గుగా వైసీపీ నాయకుల సేవలో తరిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో కానీ తరువాత ఎమర్జెన్సీలో కానీ ఇలాంటి నిర్బంధాలను చూడలేదు. సీఎం గతంలో ప్రతిపక్షనేతగా ‘ఏపీ పోలీసులపై తనకు ఏమాత్రం విశ్వాసంలేద’ని చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకున్నారేమో.. పోలీసులు ఆయన పట్ల అతివిధేయతను నిరూపించుకుంటున్నారు. ఎంతగా అంటే, ఈమధ్య వైసీపీ నాయకులు పోలీసులను తన్నినా నోరు తెరవని పరిస్థితి. అదే ప్రతిపక్ష నాయకులు పోలీసులను ఏ మాత్రం విమర్శించినా పోలీసు అధికారుల సంఘాలు ఖండిస్తున్నాయి. పోలీసులు ఈ అధికార పక్షపాత ధోరణిని ఎన్.సి.ఆర్.బి–2021 నివేదిక తూర్పార పట్టింది.


ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రతిపక్షాలు ప్రశ్నించడం, విమర్శించడం సహజం. సోషల్ మీడియా పోస్టింగులపై వైసీపీ నాయకులు ఫిర్యాదు చెయ్యడం ఆలస్యం పోలీసులు కూడా మెరుపు వేగంతో స్పందిస్తూ ఐపీసీలోని 500సెక్షన్లలో ఏదో ఒకదాన్ని చేత పట్టుకొని పరుగెత్తుకొచ్చి అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల కేసుల విషయంలో చట్టం అధికారంలో ఉన్నవారి వైపే పని చేస్తుంది. అధికార పార్టీ ఫిర్యాదులపైనే పోలీసులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షంపై పెట్టే పోస్టింగులపై ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రాజద్రోహం కేసులు పెరిగాయి. జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దేశద్రోహం కేసు పెట్టడం పోలీసులకు ఆనవాయితీగా మారింది. సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిన సెక్షన్ 124 కేసులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది ఇటువంటి కేసులు 76 నమోదైతే, అందులో ఒక్క ఏపీలోనే 30 నమోదు కావడం గమనార్హం. 


పోలీసులు, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సహజమే. కానీ ఎన్నడూ లేని విధంగా కొందరు ఐపీఎస్‌లు నేడు జగన్ ప్రభుత్వానికి వీరవిధేయత చూపించి వీరగంధాలు పూస్తున్నారు. గతంలో పోలీసు వ్యవస్థను ఏ ప్రభుత్వం ఇంత నీచంగా వాడుకున్న పరిస్థితి లేదు. హక్కులు కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలపై విచక్షణారహితంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టే శాంతియుత నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా, వాటిలో పాల్గొనకుండా నోటీసులు ఇస్తూ, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల పైకి అడుగు ముందుకు వేస్తే కాల్చి పారేస్తామని, మీసాలు దువ్వుతూ, తొడలు కొడుతూ పోలీసులు సవాళ్లు రువ్వుతున్నారు! గతంలో ఎన్నడన్నా పోలీసులు ఈ విధంగా వ్యవహరించారా?

మన్నవ సుబ్బారావు

మిర్చియార్డు మాజీ చైర్మన్

Updated Date - 2022-10-05T06:36:29+05:30 IST