తొలి మహిళా మేయర్‌ ఎవరు?

ABN , First Publish Date - 2021-05-07T05:21:39+05:30 IST

ఖమ్మం కార్పొ రేషన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రంగం సిద్ధ మైంది.కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. తొలి మహిళా మేయర్‌ ఎవరన్నది సీల్డ్‌కవర్‌లో పంపనున్నారు.

తొలి మహిళా మేయర్‌ ఎవరు?

 టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి సీల్డ్‌కవర్లలో పేర్లు

 నేడు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక 

ఖమ్మం, మే 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం కార్పొ రేషన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రంగం సిద్ధ మైంది.కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. తొలి మహిళా మేయర్‌ ఎవరన్నది సీల్డ్‌కవర్‌లో పంపనున్నారు. సీఎం కేసీఆర్‌ సూచించిన అభ్యర్థుల జాబితాతో ఉన్న సీల్డ్‌కవర్‌తో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి గురువారం సాయంత్రం ఖమ్మానికి చేరుకున్నారు. శుక్రవారం జరిగే ఎన్నికపై నగర టీఆర్‌ఎస్‌ నాయకులతో ఫోన్‌లో చర్చించారు. జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయిన ఖమ్మం మేయర్‌ పీఠానికి అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు వారి విద్యార్హతలు, రాజకీయ అను భవం తదితర వివరాలు సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే అంద జేశారు. తరువాత మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. శుక్ర వారం ఉదయం గెలుపొందిన కార్పొరేటర్లతో మంత్రి ప్రశాంతరెడి సమా వేశమవుతారు. భోజనం అనంతరం కార్పొరేటర్లు ప్రత్యేక వాహనంలో కార్నొరేషన్‌ కార్యాలయానికి వెళ్లి ఎన్నిక ప్రక్రి యలో పాల్గొంటారు. ఎన్నికకు ముం దు సీల్డ్‌కవర్‌లో వచ్చిన జాబితాను కార్పొరేటర్లకు వివరిం చిన అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. మేయర్‌ అభ్యర్థిగా పునుకుళ్ల నీరజతోపాటు మరికొందరు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ మేయర్‌గా, బీసీలకు కేటాయిస్తే టీఆర్‌ ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, మైనారిటీలకు కేటాయిస్తే మక్బుల్‌కు అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

మధ్యాహ్నం 3గంటలకు ఎన్నిక

 ఖమ్మం నగరపాలక సంస్థ తొలిమేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు నగరపాలక సంస్థ సమావేశ మం దిరంలో నిర్వహిస్తారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధు సూద న్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. కాగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. అయితే ఎ న్నికైన కార్పొరేటర్లలో పలువురు కరోనా బారిన పడటం, వారి కుటుంబసభ్యులకు కరోనా సోకటంతో ఎంత మంది ప్రత్యక్షంగా హాజరవుతారో ఆసక్తిగా మారింది.  ఎన్నికైన కార్పొరేటర్లను బస్సులో కార్పొరేషన్‌ కార్యాలయా నికి తీసు కొస్తారని సమాచారం. చేతులు ఎత్తే విధానం ద్వారా, లేదా చప్పట్లు చరిచి మేయర్‌, డిప్యూటీలను ఎన్నుకుంటారు.

సోషల్‌మీడియా ప్రచారాలను నమ్మొద్దు : మంత్రి

సీఎం కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎవరిని నియమిస్తే వారికి మద్దతు ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను కోరారు.మేయర్‌ ఎన్నికపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాలను, వార్తలను నమ్మొద్దని సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎంపిక పూర్తిగా ముఖ్యమంత్రి,  మంత్రి కేటీఆర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఎన్నికల అధికారిగా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌

 ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేషన్‌ సభ్యుల ప్రత్యేక సమావేశంతో పాటు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం మునిసిపాలిటీ చట్టం-2019 ప్రకారం అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ను నియమించినట్టు కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించనున్న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా కొవిడ్‌-19 నిబం ధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. కార్పొరేషన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Updated Date - 2021-05-07T05:21:39+05:30 IST