ఖాన్‌ లతీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నుమూత.. అమెరికాలో తుదిశ్వాస..

ABN , First Publish Date - 2020-08-08T14:07:24+05:30 IST

ప్రముఖ ఉర్దూ దినపత్రిక మున్సిఫ్‌ చీఫ్‌ ఎడిటర్‌ ఖాన్‌ లతీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌(80) అమెరికాలోని షికాగో నగరంలో శుక్రవారం కన్నుమూశారు. ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌గా అందరికీ సుపరిచితమైన ఆయన కొన్ని రోజులుగా నగరంలోనే ఉంటున్నప్పటికీ.... 15 రోజుల క్రితం షికాగో వెళ్లారు

ఖాన్‌ లతీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నుమూత.. అమెరికాలో తుదిశ్వాస..

అమెరికాలోని షికాగోలో శుక్రవారం తుదిశ్వాస

మున్సిఫ్‌ పత్రిక, టీవీ చానెళ్లకు చీఫ్‌ ఎడిటర్‌

కేఎల్‌కే బిల్డింగ్‌ నిర్మాతగా అందరికీ సుపరిచితం


హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌ (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఉర్దూ దినపత్రిక మున్సిఫ్‌ చీఫ్‌ ఎడిటర్‌ ఖాన్‌ లతీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌(80) అమెరికాలోని షికాగో నగరంలో శుక్రవారం కన్నుమూశారు. ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌గా అందరికీ సుపరిచితమైన ఆయన కొన్ని రోజులుగా నగరంలోనే ఉంటున్నప్పటికీ.... 15 రోజుల క్రితం షికాగో వెళ్లారు. గురువారం ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వసీం మహమ్మద్‌ ఖాన్‌, డాక్టర్‌ అస్లం మహమ్మద్‌ ఖాన్‌ ఉన్నారు. మృతదేహాన్ని షికాగోలోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌లో ఉంచారు. అక్కడే శుక్రవారం ప్రార్థనల అనంతరం నమాజే జనాజా (చివరి నమాజ్‌) నిర్వహించి షికాగో ముస్లిం ఖబరస్తాన్‌(ముస్లిం శ్మశానవాటిక)లో అంత్యక్రియలు నిర్వహించినట్లు సంబంధీకులు వివరించారు. 


నగరంతో పాటు షికాగోలోనూ విషాదఛాయలు

నగరంతోపాటు షికాగోతోనూ సత్సంబంధాలు కొనసాగించారు ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌. ఆయన పేరిట అక్కడ ఓ వీధి కూడా ఉందని స్థానికులు చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఆయన నిర్మించిన ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌ (ఎల్‌బీ స్టేడియం ఎదురుగా) గురించి తెలియని వారుండరు. కేఎల్‌కే రోడ్‌ అని కూడా వ్యవహరిస్తుంటారు. మున్సిఫ్‌ పత్రిక ప్రధాన కార్యాలయం కేఎల్‌కే బిల్డింగ్‌ పక్కనే ఉంది. ఆయన మరణవార్తతో షికాగోలోని ముస్లిం సమాజం, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మున్సిఫ్‌ దినపత్రికను ప్రస్తుతం ఆయన అల్లుడు నిర్వహిస్తున్నారు.


ఫలక్‌నుమాలో జననం

ఫలక్‌నుమా, జంగమ్మెట్‌లో జన్మించిన ఆయన ఎన్నో వ్యాపారాలు, విద్యాసంస్థల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. 33ఏళ్ల క్రితం మున్సిఫ్‌ దినపత్రికను కొనుగోలు చేశారు. అప్పటి వరకు ఉర్దూ పత్రికల్లో ఎడిటోరియల్‌ పేజీలు, కాలమ్స్‌ లేవు. వాటిని ఆయనే పరిచయం చేశారు. దశాబ్ధం క్రితం మున్సిఫ్‌ టీవీ చానెల్‌ను కూడా ప్రారంభించారు. షికాగోలో ఉంటున్నా పత్రిక, టీవీ చానెల్‌ పనితీరును ఆయన ఎప్పటికప్పుడు సమీక్షించే వారు. 


పేదలకు విద్య

సుల్తాన్‌ ఉల్‌ ఉలూం ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన కేజీ నుంచి పీజీ స్థాయి వరకు విద్యాసంస్థలను నెలకొల్పి పేదలకు ఉచిత విద్య అందించారు. పాతబస్తీలోని సుమారు 8 విద్యాసంస్థల్లో వేల సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందరూ ఖాన్‌ సాబ్‌ అని గౌరవంగా పిలిచేవారు. ఆయన మృతిపట్ల పలువురు జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


సీఎం సంతాపం

లతీఫ్‌ ఖాన్‌ మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఖాన్‌ మరణం ఉర్దూ జర్నలిజానికి తీరని లోటని అన్నారు. 

Updated Date - 2020-08-08T14:07:24+05:30 IST