PK సర్వేలో వెనుకబడ్డ మహిళా ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల్లో TRS నుంచి టికెట్ కష్టమే.. ఇంకెన్ని మలుపులో..!

ABN , First Publish Date - 2022-05-06T17:50:00+05:30 IST

నిర్మల్‌ జిల్లా నియోజకవర్గం. టీఆర్‌ఎస్‌ నుంచి రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమెకు సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి ఎదురవుతోంది. అనేకమంది నాయకులు

PK సర్వేలో వెనుకబడ్డ మహిళా ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల్లో TRS నుంచి టికెట్ కష్టమే.. ఇంకెన్ని మలుపులో..!

టీఆర్‌ఎస్‌లో ఖానాపూర్‌ కథ రసవత్తరంగా సాగుతోంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ డౌటేననే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రేఖానాయక్‌పై ఆపార్టీ నేతలకు గొంతువరకు కోపం ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. దీనికితోడు ఈ స్థానంపై ఎంతోమంది నేతలు ఇప్పటినుంచే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్‌ బాస్ కంట్లో పడటానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీరందరి ఎత్తుడలను రేఖానాయక్‌ ఎదుర్కోగలరా? అసలు ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది...? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్ సైడర్‌లో తెలుసుకుందాం..


సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి 

ఖానాపూర్‌. నిర్మల్‌ జిల్లా నియోజకవర్గం. టీఆర్‌ఎస్‌ నుంచి రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ  ఆమెకు సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి ఎదురవుతోంది. అనేకమంది నాయకులు ఆమెపై గుస్సాగా ఉన్నారు. మరికొంతమంది రిజైన్‌ చేసి టీఆర్‌ఎస్‌ను వీడారు. ఈ పరిణామాలన్నీ టీఆర్‌ఎస్‌ అథిష్టానానికి తలనెప్పిగా మారాయి. దీంతో రేఖానాయక్‌ భవితవ్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్ రాదని చెప్పేవారి సంఖ్య పెరిగింది. ఫలితంగా ఈ నియోజకవర్గంపై చాలామంది టీఆర్‌ఎస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఖానాపూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ సరికొత్త అభ్యర్థిని రంగంలోకి దింపనుందనే టాక్‌ గట్టిగా నడుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న శర్మణ్‌కు గులాబీబాస్‌ టిక్కెట్‌ ఇవ్వనున్నారనే ప్రచారం నియోజకవర్గంలో హోరెత్తుతుతోంది.


త్వరలో రిటైర్‌ కానున్న శర్మణ్‌ టీఆర్‌ఎస్‌లో చేరతారని చెపుతున్నారు. ఖానాపూర్‌ టిక్కెట్‌ హామీతోనే ఆయన కారు ఎక్కనున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి శర్మణ్ స్వస్థలం మంచిర్యాల జిల్లా జన్నారం కాగా... ఇది ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ పరిధిలో ఉంది.  లంబాడా తెగకు చెందిన శర్మణ్ గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివిధ హోదాల్లో  పనిచేసి.. ఐఏఎస్‌గా కన్ఫర్డ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. జూన్ లో పదవీ విరమణ చేయనున్నారు. ఖానాపూర్‌లో ఈయనకు ఉన్న మంచి పేరు టీఆర్‌ఎస్‌కు కలిసివస్తుందని చెపుతున్నారు.


రేసులో ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్

మరో వైపు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కూడా  రేసులో ఉన్నారు.  ఈయన కూడా ఖానాపూర్ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.  ఉట్నూర్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు.  నిత్యం పర్యటనలతో  ప్రజల్లోకి వెళుతున్నారు. మరోపక్క  రాజ్య సభ్యుడు సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పూర్ణ చందర్ నాయక్ అనే యువ నాయకుడు కూడా ఖానాపూర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను ఎమ్మెల్యే రేఖా నాయక్ జీర్ణించుకోలేక పోతున్నారట. 


రేఖానాయక్‌ తీరుపై నాయకుల ఆగ్రహం

నిజానికి  తొలినుంచి ఎమ్మెల్యే  రేఖా నాయక్ తీరుపై  చాలామంది  నాయకులు  ఆగ్రహంతో ఉన్నారు.అయితే పార్టీ అధికారంలో ఉండటంతో  గత్యంతరం లేక  కొనసాగుతున్నారన్న  చర్చ సాగుతోంది. ఈ క్రమంలో గతేడాది మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ నర్సయ్య పార్టీకి,పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే తనను ఆర్థికంగా, మానసికంగా దెబ్బ తీశారని, అవమానాలకు గురి చేశారని, ఈ నియోజకవర్గంతో సంబంధం లేని ఆమెను రెండు సార్లు గెలిపించి తప్పు చేశామని అప్పట్లో ఆయన ఆరోపించారు. ఇదే నియోజకవర్గంలోని  పెంబి జడ్పీటీసీ భుక్య జానకీ బాయి అంతకు ముందే  పార్టీని వీడారు.   ఆమెతో పాటు మరికొంతమంది సీనియర్‌ కార్యకర్తలు  టీఆర్‌ఎస్‌ ను వీడి బీజేపీ లో చేరిపోయారు. గత ఎన్నికల్లోనే  రేఖా నాయక్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమెకు  టికెట్ డౌటేనన్న ప్రచారం సాగింది. అయినా తనదైన లాబీయింగ్ తో ఆమె టిక్కెట్‌ దక్కించుకున్నారు.


టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. దీంతో రేఖా నాయక్ ఓటమి గ్యారెంటీ అనుకున్నారు. అయితే పార్టీని వీడే ముందు తమ కుటుంబంపై రమేష్ రాథోడ్ చేసిన వ్యక్తిగత విమర్శలను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. రాథోడ్ ను ఎలాగైనా ఓడించాలన్న కసితో వ్యూహన్ని అమలు చేశారు. స్వయంగా  కేటీఆర్ కూడా  ఉట్నూర్ సభలో పాల్గొన్నారు.గ్రూపులను ఏకతాటిపైకి తేవడంతో పాటు పోల్ మేనేజ్మెంట్తో రేఖ గెలిచారు.  అప్పుడు కేటీఆర్ గనుక పట్టించుకోకుంటే రేఖా నాయక్ ఘోరంగా ఓడిపోయేవారనే చర్చ ఇప్పటికీ సాగుతోంది.  అయినా ఆమె తీరు మారకపోవడంతో అధిష్టానం ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం.


పీకే సర్వేలోనూ వెనుకబడిన రేఖానాయక్‌

ఇక పీకే సర్వేలోనూ రేఖా నాయక్ చాలా వెనుకడి పోయారట. ఈ క్రమంలో తనకు ప్రత్యామ్నాయంగా అనేక మంది పేర్లు వినపడుతుండటంపై ఆమె టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వలేని పక్షంలో...తన భర్తకు ఆసిఫాబాద్ టికెట్ ఇవ్వాలని ఆమెకోరతారని చెపుతున్నారు. మరి రాబోయే రోజులలో ఖానాపూర్‌ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

Read more