ఏమవుతుందో!?

ABN , First Publish Date - 2020-12-02T04:46:00+05:30 IST

ఆసియా ఖండంలోనే 11 కి.మీ పొడవైన మట్టికట్టతో నిర్మించిన కండలేరు డ్యాం ఇప్పుడు అందరిలోనూ వణుకు పుట్టిస్తోంది.

ఏమవుతుందో!?
కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి విడుదలవుతున్న నీరు

అందరిలో ‘కండలేరు’ కలవరం

అలలతో దెబ్బతింటున్న రివిట్‌మెంట్‌

భయపెడుతున్న వరుస తుఫాన్ల హెచ్చరికలు

ప్రస్తుతం 60 టీఎంసీల నిల్వ

మొదటిసారిగా సముద్రానికి నీరు విడుదల

డ్యాం పటిష్టతకు ఢోకాలేదు!

వరద నష్టం పనులకు కోటిన్నరతో అంచనాలు సిద్ధం

ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

జలాశయాన్ని పరిశీలించిన జేసీ


రాపూరు, డిసెంబరు 1 :  ఆసియా ఖండంలోనే 11 కి.మీ పొడవైన మట్టికట్టతో నిర్మించిన కండలేరు డ్యాం ఇప్పుడు అందరిలోనూ వణుకు పుట్టిస్తోంది. డ్యాం లోపలి వైపు రాళ్ల రివెట్‌మెంట్‌ జారి నీళ్లలోకి చేరుతున్నాయి. దీనికితోడు  వరుస తుఫాన్ల హెచ్చరిక నేపథ్యంలో ఉన్న డ్యాం నుంచి నీటిని సముద్రానికి వదిలేస్తున్నారు. ఈ ఏడాది అటు కృష్ణా, ఇటు పెన్నా నుంచి నీటిని తీసుకువచ్చి డ్యాంలో రికార్డుస్థాయిలో నిల్వ చేశారు. మంగళవారం 60.464 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇన్‌ఫ్లో  2134 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో 5627 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం నుంచి సత్యసాయి గంగ కాలువకు 3వేల క్యూసెక్కులు, పిన్నేరుకు 700, 1వ బ్రాంచి కాలువకు 50, లోలెవల్‌ ద్వారా 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సత్యసాయి గంగ కాలువలో నీరు చేతికి అందేలా ప్రవహిస్తోంది. 

మొట్టమొదటిసారిగా.. 

కండలేరు నుంచి తొలిసారిగా కృష్ణా జలాలను సముద్రానికి విడుదల చేస్తున్నారు. డ్యాం హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి పిక్‌పఏరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు, అక్కడ గేట్లు ఎత్తి పిన్నేరు ద్వారా 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు సైదాపురం మండలం కట్టుబడిపల్లి వద్ద కండ్లేరులో కలిసి, మనుబోలు మండలంలోని బంగాళాఖాతంలోకి చేరుతుంది. డ్యాంకు ఇన్‌ఫ్లో పెరిగితే అవుట్‌ఫ్లోను పెంచేందుకు ఇంజనీర్లు సిద్ధం అవుతున్నారు.

ఊడిపోతున్న రాళ్ల రివెట్‌మెంటు

ప్రస్తుతం వస్తున్న గాలులకు మీటరు ఎత్తు అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో డ్యాం లోపలి వైపు రాళ్ల రివెట్‌మెంటు అలల తాకిడికి జారిపోయి దెబ్బ తింటోంది. పలుచోట్ల  బండ రాళ్లు ఊడి నీళ్లలోకి జారుతున్నాయి.  ఆదివారం రాత్రి డ్యాం మట్టికట్ట తెగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగిన విషయం తెలిసిందే. పొదలకూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఊళ్లను ఖాళీ చేసి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు, ఇంజనీర్లు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇంజనీర్లపై విమర్శలు

2015లో కురిసిన భారీ వర్షాలకు డ్యాంకు ఒక్కరోజులోనే 10 టీఎంసీలు వచ్చిన విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తు చేస్తున్నారు. పైనుంచి నీళ్లు వస్తుండటంతో 60టీఎంసీల నీటిని డ్యాంలో ఎలా నిల్వ చేశారని ప్రశ్నిస్తున్నారు. నవంబరు, డిసెంబరు నెలలు తుఫాన్‌ సీజన్‌ అని తెలిసినా పట్టించుకోక పోవడంతో ఎంతో విలువైన జలాలను దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి కడలికి చేర్చుతున్నారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, కండలేరు డ్యాంను మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. డ్యాం అవుట్‌ ఫ్లో, ఇన్‌ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. 


ముందుజాగ్రత్తతోనే..

ముందు జాగ్రత్తతోనే కండలేరు డ్యాం నుంచి పిన్నేరు ద్వారా సముద్రానికి నీటిని విడుదల చేస్తున్నాం. తుఫాన్‌ గాలులతోనే డ్యాం లోపలివైపు మట్టికట్ట రివెట్‌మెంట్‌ జారిపోతోంది. అయితే మట్టికట్టకు ఎలాంటి ప్రమాదం లేదు.  68 టీఎంసీలు నిల్వ చేసినా బ్యాక్‌ వాటర్‌ సమస్య తప్ప మట్టికట్టకు ఎలాంటి ఢోకా ఉండదు. దెబ్బతింటున్న నిర్మాణాలకు కోటిన్నర అవసరమని గుర్తించాం. నిధులు విడుదలైతే ఆ పనులు చేపడతాం రేయింబవళ్లు ఇంజనీర్లు  డ్యాంను పర్యవేక్షిస్తున్నారు. 

- విజయ్‌కుమార్‌రెడ్డి ఈఈ







Updated Date - 2020-12-02T04:46:00+05:30 IST