విలువలు కలిగిన సంపాదకుడు

ABN , First Publish Date - 2021-01-23T06:29:47+05:30 IST

రాజాజీ, ప్రకాశం, రాంనాథ్ గోయెంకా లాంటి ప్రముఖులతో కలసి పనిచేసిన కలం యోధుడు ఖాసా సుబ్బారావు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, అనేక సాంఘిక ఉద్యమ రూపకర్త కూడ. ఆయనకు ఎవరితోనైనా...

విలువలు కలిగిన సంపాదకుడు

రాజాజీ, ప్రకాశం, రాంనాథ్ గోయెంకా లాంటి ప్రముఖులతో కలసి పనిచేసిన కలం యోధుడు ఖాసా సుబ్బారావు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, అనేక సాంఘిక ఉద్యమ రూపకర్త కూడ. ఆయనకు ఎవరితోనైనా రాగద్వేషాలతో కూడిన స్నేహం ఉండేది. 1945, 46లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకుడిగా పని చేసినా, జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని రోజూ కార్యాలయానికి వెళ్లేవారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. దాదాపు ౧500 రూపాయల జీతం ఇవ్వటానికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యజమాని రాంనాథ్ గోయెంక ఇష్టపడినా, అప్పట్లో అది చాలా ఎక్కువ. సహజంగా సంపాదకులకు ఉండే రూ.350 మాత్రమే జీతం తీసుకొన్న వాస్తవవాది ఖాసా. నెల్లూరు పట్టణంలో 1896 జనవరి 29న జన్మించిన ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యులు.


నెల్లూరులో ప్రాథమిక విద్య తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి తత్వశాస్త్ర ఆచార్యులుగా పని చేయటంతో ఆయన శిష్యులుగా నిలిచారు. ఆ తర్వాత అమావన్ రాజ సంస్థానం కార్యదర్శిగా, రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో ఎల్‌టి డిగ్రీ పొంది నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీచరుగా, హెడ్‌మాస్టర్‌గా పనిచేశారు. 1921లో ఉద్యోగానికి రాజీనామా చేసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. పల్లెపాడు గాంధీ ఆశ్రమంలో కొంతకాలం శిక్షణ పొందారు. 1924లో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించిన స్వరాజ్య పత్రికలో 12 సంవత్సరాలు అంటే పత్రిక మూతపడేవరకు సంపాదకుడిగా పనిచేశారు. గాంధీ పిలుపు విని స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని గ్రామాలను చుట్టేస్తూ, ప్రజలను చైతన్యపరిచారు. సుబ్బారావు ఆరోగ్యం దృష్ట్యా ఆయన తల్లి కూడా ఆయన వెంట పల్లెలలో ప్రయాణిస్తూ ఆహార, వసతులు దగ్గరుండి చూసుకునేవారు. 1931లో తుమ్మలపెంట ఉప్పుసత్యాగ్రహంలో పోలీసులు సూదులతో, గోళ్లతో పొడుస్తుంటే, పిడికిలి పట్టు విడవకుండా ఉప్పును చేతపట్టుకొచ్చిన యోధుడు ఖాసా. 1932లో మద్రాసు ప్లవర్ మార్కెట్ పోలీసుస్టేషన్ వద్ద ఉన్న విదేశీ బట్టల దుకాణం ఎదుట పికెటింగ్ చేస్తూ పోలీసుల లాఠీ దెబ్బలకు రక్త గాయాలతో స్పృహ తప్పారు. ఖాసాపై దాడి విషయంపై బ్రిటిషు పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. దాని పర్యవసానంగా లోథియన్ కమిషన్ ఇనుప పొన్ను తొడిగిన లాఠీల ప్రయోగాన్ని నిషేధించింది. బొంబాయిలో సదానంద్ సంపాదకత్వంలో వెలువడుతున్న ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’ లో పాత్రికేయ విధులు నిర్వహించి, తర్వాత మద్రాసులో ఆ పత్రికకు సంపాదకత్వం వహించారు. 


ఖాసా నూటికి నూరుపాళ్లు ఆదర్శవాది. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవారు. 1948 ఫిబ్రవరి 18న ఆయన ‘స్వతంత్ర’ వారపత్రికను ప్రారంభించారు. ఆ రోజుల్లో స్వతంత్ర కార్యాలయం రాజకీయ నాయకులకు, సాహితీవేత్తలకు, మేధావులకు వేదికలా నిలిచింది. ఆయన సంపాదకీయాలు స్వాతంత్ర్య నాయకులనే గాక, మహాత్మాగాంధీని సైతం ఆకర్షించేవి. ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్న రోజుల్లో ప్రకాశానికి అండగా నిలిచారు. ఖాసా నిరాడంబరుడు. పత్రికను వ్యాపార పత్రికలా నడపటానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. అందుకే ఆయన ఆర్థికంగా కూడా ఎదగలేదు. అప్పట్లో అందరితో మంచి స్నేహం, సన్నిహిత సంబంధాలున్నా, ఆ స్నేహం రాగద్వేషాలకు అతీతమైనదేమీ కాదు. అవసరం వస్తే నిర్భయంగా విమర్శించడానికి ఎన్నడూ వెనుకాడలేదు. చివరిశ్వాస వరకు పాత్రికేయుడిగా కొనసాగిన ఆయన రాసిన ఆఖరి సైడ్‌లైట్స్ 1961 జూన్ 17వ ‘స్వరాజ్య’ సంచికలో ప్రచురితమయ్యాయి. 1961 జూన్ 16నే ఆయన మరణించారు. సమకాలీన భారతీయ పత్రికా సంపాదకులలో ఆయనతో సమానులైన వారు, మించినవారు కూడా లేరని అప్పటి పత్రికా రచయితలందరూ అంగీకరించారు.



-ఈతకోట సుబ్బారావు

(నేడు ఖాసా సుబ్బారావు జయంతి)

Updated Date - 2021-01-23T06:29:47+05:30 IST