సినిమా రివ్యూ : ‘ఖిలాడి’

Published: Fri, 11 Feb 2022 15:03:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : ఖిలాడి

చిత్రం : ఖిలాడి 

విడుదల తేదీ : 11-02-2022

నటీనటులు : రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, అర్జు్న్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ, నికితిన్ ధీర్, ఠాకూర్ అనూప్ సింగ్, ముఖేష్ రుషి, ఉన్ని ముకుందన్ తదితరులు.

సంగీతం : దేవీశ్రీప్రసాద్

పాటలు : శ్రీమణి

సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్, జికే విష్ణు

నిర్మాత : సత్యనారాయణ కోనేరు

కథ : శ్రీకాంత్ విస్స

దర్శకత్వం : రమేశ్ వర్మ

గతేడాది ‘క్రాక్’ సినిమాతో పోలీస్ ఆఫీసర్‌గా సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది.. పక్కా క్రిమినల్ గా రెండు షేడ్స్ కలిగిన పాత్రలో ‘ఖిలాడీ’ గా నేడే (శుక్రవారం)  థియేటర్స్ లోకి వచ్చాడు.  టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో విడుదలకు ముందే భారీ అంచనాల్ని నెలకొల్పిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పించింది? రవితేజ ‘ఖిలాడి’ గా ఏ మేరకు మెప్పించాడు అన్న విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ

సైకాలజీ స్టూడెంట్ పూజ (మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ ఐజీ (సచిన్ కేడ్కర్) కూతురు. ఓ థీసెస్ కోసం సెంట్రల్ జైల్‌లో ఖైదీ మోహన్ గాంధి (రవితేజ) ని కలుస్తుంది. చేయని నేరానికి తనకు ఎందుకు శిక్ష పడిందో వివరిస్తాడు. దాంతో కరిగిపోయిన ఆమె.. తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ అతడికి బైల్ వచ్చేలా చేస్తుంది. జైల్ నుంచి మోహన్ గాంధీ బైటికి వచ్చాకా.. అతడో పెద్ద క్రిమినల్ అన్న సంగతి అర్ధమవుతుంది. హోమ్ మినిస్టర్ కు ఇటలీ నుంచి వచ్చిన పదివేల కోట్ల రూపాయల్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగానే అతడు జైల్లోకి వచ్చాడని.. ఆ తర్వాత బైటికి రావడానికి తనను వాడుకున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ పదివేల కోట్లు ఎవరివి? ఎక్కడనుంచి వచ్చాయి? ఆ డబ్బు కోసం గాంధీ ఏం చేశాడు? అతడి లక్ష్యం ఏంటి అన్నది మిగతా కథ.

విశ్లేషణ

క్రిమినల్ వెర్సస్ పోలీస్ కథలతో గతంలో చాలా సినిమాలొచ్చాయి. రవితేజ ‘కిక్’ అలాంటి సినిమానే. బాలీవుడ్ ‘ధూమ్’ సిరీస్ కూడా ఈ కోవలోనివే. ఈ సినిమాలు సూపర్ హిట్ అవడానికి ప్రధాన కారణాలు గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే, ఆసక్తికరమైన సన్నివేశాలు. హీరోల పెర్ఫార్మెన్స్. ‘ఖిలాడి’ కూడా ఈ తరహా చిత్రమే. కాకపోతే ఇందులో కథకథనాల కన్నా ట్విస్టుల మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేశాడు దర్శకుడు రమేశ్ వర్మ. అసలు కథలోకి రావడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. రవితేజ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ బోరింగ్ గా అనిపిస్తాయి. సినిమా ఎటు వెళుతోందో కూడా తెలియదు. అయితే ఆ బోరింగ్ సీక్వెన్స్ ను కూడా ట్విస్ట్ లో ఒక భాగమని రివీల్ చేయడం బాగుంది. ఇక ఇంటెర్వెల్ బ్యాంగ్ లో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రేక్షకులు అసలు ఊహించనిది. సెకండాఫ్ ప్రారంభం నుంచి రవితేజ అసలు కేరక్టర్ ఎంటర్ అయ్యాకా వచ్చే సన్నివేశాలు ఆసక్తిగా కూర్చోబెడతాయి. అక్కడి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడతాయి. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు కూడా మెప్పిస్తాయి.


మోహన్ గాంధీగా రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రల్లో రవితేజ అదరగొట్టాడు. వయసు మీద పడుతున్నా కూడా తనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అయితే ఆయన ఫేస్ లో గ్లో పోయింది. డ్యాన్స్, ఫైట్స్ లో మంచి వేగం చూపించాడు. కథానాయిక డింపుల్ హయతి స్ర్కీన్ ప్రెజెన్స్ అంతగా మెప్పించదు. కానీ గ్లామర్ ను మాత్రం బాగానే ఒలికించింది. మరో కథానాయిక మీనాక్షి చౌదరి నటన, గ్లామర్ పరంగా పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన పాత్రలు  మురళీ శర్మ, అనసూయ, వెన్నెల కిశోర్. ముఖ్యంగా అనసూయ నుంచి ఆ తరహా ట్విస్ట్ ను ఇంతకు ముందెన్నడూ చూసెరుగరు ప్రేక్షకులు.  యాక్షన్ కింగ్ అర్జున్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మెప్పించారు. పెర్ఫార్మెన్స్ లోనూ, యాక్షన్ లోనూ తన మార్కుచూపించారు. ఇక హోమ్ మినిస్టర్ గా ముఖేష్ రుషి పర్వాలేదనిపిస్తాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. రెండు పాటలు బాగున్నాయి. అలాగే కెమేరా పనితనం, నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఖిలాడి’ చిత్రం బెటర్ ఆప్షన్. 

ట్యాగ్ లైన్ : ట్విస్టుల ‘ఖిలాడి’ 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International