ఎమ్మెల్యే సీటుకు అఖిలేష్ రాజీనామా..?

ABN , First Publish Date - 2022-03-12T20:04:25+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే...

ఎమ్మెల్యే సీటుకు అఖిలేష్ రాజీనామా..?

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ఎస్.పి.సింగ్ బఘెల్‌పై 67,504 ఓట్ల ఆధిక్యం సాధించారు. అఖిలేష్‌కు 1,48,196 ఓట్లు రాగా, బాఘెల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. ఎస్‌పీకి కంచుకోటగా చెప్పుకునే కర్హాల్‌లో అఖిలేష్‌కు 60.12 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీకి అఖిలేష్ పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగానే ఉన్నారు.


కాగా, ప్రస్తుతం మెయిన్‌పురి జిల్లా అజాంగఢ్ లోక్‌సభ ఎంపీగా అఖిలేష్ ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడంతో రెండిటిలో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఎంపీ సీటును ఉంచుకుని, ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాలని అఖిలేష్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే సీటుకు ఆయన రాజీనామా చేస్తే అక్కడ ఉపఎన్నిక అనివార్యమమవుతుంది.


అఖిలేష్ బాటలోనే అజాంఖాన్..

కాగా, జైలులో ఉంటూనే 2022 యూపీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్‌పీ అభ్యర్థి అజాంఖాన్ సైతం అఖిలేష్ బాటలోనే నడిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాంపూర్ అసెంబ్లీ నుంచి ఈ ఎన్నికల్లో అజాంఖాన్ పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అకాష్ సక్సేనా (హనీ)పై 55,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో అజాంఖాన్ గెలిచారు. దీంతో ఆయన కూడా ఎమ్మెల్యే సీటును వదులుకుని ఎంపీగా ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. రాంపూర్ నుంచి లోక్‌సభకు అజాంఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చోరీ, క్రిమినల్ ఇంటిమిడేషన్, భూ ఆక్రమణలు వంటి పలు ఆరోపణలపై ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైలులో ఉన్నారు.


కాగా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈనెల 21న లక్నోలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 255 సీట్లు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - 2022-03-12T20:04:25+05:30 IST