దుబ్బాకలో కాంగ్రెస్‌దే విజయం

ABN , First Publish Date - 2020-10-30T11:52:05+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయం తఽథ్యమని, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ..

దుబ్బాకలో కాంగ్రెస్‌దే విజయం

 టీఆర్‌ఎ్‌సకు మూడో స్థానమే 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు మాదే

ముత్యంరెడ్డి అభివృద్ధి ప్రతి ఇల్లూ, గల్లీ చెబుతోంది

చెరుకు శ్రీనివా్‌సరెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు

మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 29 : దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయం తఽథ్యమని, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్‌, హరీశ్‌రావులను ప్రజలు విశ్వసించడంలేదని, ఈ ఎన్నికలో వారికి కర్రు కాల్చి సురుకు పెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుక, నిలదీసి, తిరగబడి ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి మాత్రమేనని అన్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధిని నియోజకవర్గంలోని ప్రతీ పల్లె చెబుతోందని.. ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు అదే ప్రధాన అస్త్రం కాబోతోందన్నారు.ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తరపున చేగుంట మండలంలో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో  ముచ్చటించారు. 


ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం ఖాయమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం ప్రారంభించాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా  మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివా్‌సరెడ్డిని ప్రకటించిన క్షణం నుంచి రాజకీయ సమీకరణాల్లో మార్పులు మొదలయ్యాయి. ఆయన రాకతో త్రిముఖ పోటీగా మారింది. ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పెరుగుతూ వస్తోంది. టీఆర్‌ఎస్‌ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కచ్చితంగా ఈ ఉప ఎన్నికలో విజయం మాదే అందులో ఎటువంటి సందేహం లేదు. 


గెలుపునకు దోహదం చేసే అంశాలేమిటి?

నియోజకవర్గంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. టీఆర్‌ఎస్‌, బీజేపీ చేసిందేమీ లేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ ముత్యంరెడ్డిని మోసం చేసింది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రచారం సందర్భంగా మేం ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నిరంతరం పేదల కోసం పని చేసిన వ్యక్తి తను, ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివా్‌సరెడ్డిని ప్రజలు ఆదరిస్తున్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంపు వంటి హామీలను కేసీఆర్‌ తుంగలో తొక్కిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ పార్టీలు ఒకటేనన్న విషయం మైనార్టీలు అర్థం చేసుకుని ఈసారి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేదు.


ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?

చేగుంట మండలంలో కొన్ని రోజులుగా ప్రచార బాధ్యతలు నిర్వరిస్తున్నా.. వెళ్లిన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరఽథం పడుతున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటా తెలియజెప్పాం. ప్రతి గ్రామంలో ముఖ్య నేతలను ఇన్‌చార్జిలుగా నియమించి విజయమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వచ్చిన వాళ్లందరినీ కారులో ఎక్కించుకోవడంతో ఆ పార్టీ ఓవర్‌లోడ్‌ అయింది. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. 


ఎన్నికలో కాంగ్రె్‌సకు ప్రధాన అభ్యర్థిగా  ఎవరని భావిస్తున్నారు ?

మాకు బీజేపీతోనే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ప్రచారంలోనే ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇక నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడుతారని  ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్‌ దొర.. ఫాంహౌస్‌ దాటడు.. బీజేపీ అభ్యర్థి కూడా దొరనే.. అతను గెలిచినా అదే పరిస్థితి. కాబట్టి ప్రజల గుండెల్లో ఉన్న ముత్యంరెడ్డి తనయుడిని గెలిపిస్తే తమ ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపిస్తాడని నియోజకవర్గ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. 

Updated Date - 2020-10-30T11:52:05+05:30 IST