వంట నూనె ‘చిక్కింది’

ABN , First Publish Date - 2022-08-10T06:41:14+05:30 IST

వంటనూనెల ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం నూనెలపై సుంకం తగ్గించినా ఆ స్థాయిలో తగ్గింపు ఉండడం లేదు. ఫలితంగా ప్రజలకు స్వల్పఊరట మాత్రమే లభిస్తోంది.

వంట నూనె ‘చిక్కింది’

 తగ్గుముఖం పడుతున్న ధరలు జూ ప్రజలకు స్వల్ప ఊరట

 నూనెలపై కేంద్రం సుంకం తగ్గించిన ప్రభావం

(పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌)

వంటనూనెల ధరలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం నూనెలపై సుంకం తగ్గించినా ఆ స్థాయిలో తగ్గింపు ఉండడం లేదు. ఫలితంగా ప్రజలకు స్వల్పఊరట మాత్రమే లభిస్తోంది. అన్ని రకాల వంటల్లో వినియోగించే నూనెల ధరలు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా గణనీయంగా పెరిగాయి. ఇదే సాకుగా చూపుతూ పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, వేరుశెనగ నూనెల ధరలను వ్యాపారులు పెంచేశారు. ఎక్కడిక్కడ సరుకుల నిల్వలు భారీగానే ఉన్నా కృత్తిమ కొరత కారణంగా కొన్ని రకాల నూనెల దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం సమయానికి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర ఒక లీటరు ప్యాకెట్‌ రూ.105 ఉండేది. ఇది ఒక్కసారిగా రూ.170 అక్కడ నుంచి రూ.240 వరకూ చేరింది. ఒక దశలో సన్‌ఫ్లవర్‌ (రిఫండ్‌) ఆయిల్‌ భవిష్యత్తులో దొరకడం కష్టమేనం టూ ప్రచారం సాగింది. తదనంతరం దిగుమతులు యఽథావిధిగా రావడం, కేంద్రం నూనెలపై కొన్ని రకాల సుంకాలను తగ్గించడంతో ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పలు బ్రాండ్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర రిటైల్‌లో రూ.175-180 మధ్య లభిస్తోంది. కొన్ని బ్రాండ్లు మాత్రం రూ.200కు విక్రయిస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన రాయితీలను పరిగణలోకి తీసుకుంటే ధర రూ.150 వరకూ దిగిరావచ్చని చెబుతున్నారు. కానీ పలు కంపెనీలు ఇంకా ధరలను తగ్గించడం లేదని, కొన్ని తగ్గించినా వ్యాపారులు మాత్రం పాత ధరలకే విక్రయిస్తున్నారని సమాచారం. యుద్ధం సమయంలో ఎమ్మార్పీ ధరలు గణనీయంగా పెంచడంతో అదే అదనుగా డిమాండ్‌ ఉన్న బ్రాండ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పామాయిల్‌ లీటరు ధర యుద్ధానికి ముందు వరకూ రూ.80 ఉండగా, తర్వాత రూ.175కు పెరిగింది. సుంకాల తగ్గింపు, యుద్ధ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ధర ప్రస్తు తం రూ.125-130గా ఉంది. ఇంతకంటే ధర తగ్గే అవకా శం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, పామాయిల్‌ను ప్రజలు అధికంగా వినియోగి స్తారు. ఈ రెండింటి ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నా పూ ర్వస్థాయికి రాకపోవడంతో ప్రజలకు అంతంత మాత్రంగానే ఊరట లభిస్తోంది. దేశీయంగానే ఉత్పత్తి అయ్యే వేరుశెనగ ధర రూ.200 దాటినా ప్రస్తుతం రూ.175 వద్ద స్థిరపడింది. నువ్వులనూనెల ధర కిలో రూ.290- 310 మధ్యే కొనసాగుతోంది. దీంట్లో పెద్దగా వ్యత్యాసం లేదు. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ లీటరు ధర గతంలో రూ.155- 160 ఉండగా యుద్ధ సమయంలో రూ.225 వరకూ చేరింది. ప్రస్తుతం దీని ధర రూ.185-190 మధ్య ఉంది. 

నియంత్రణ కరవు

వంటనూనెల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. విపత్కర పరిస్థితులు ఏర్పడిన సమయాల్లో నిల్వలను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాత స్టాకు ఉన్నప్పటికి యుద్ధ సమయంలో కొందరు వ్యాపారులు ఎమ్మార్పీ  ధరల కంటే అధికంగా విక్రయించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్రం సుంకం తగ్గించే సమయానికే నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయని, సదరు రాయితీల ఫలితం మాత్రం ప్రజలకు  చేరలేదని వారంటున్నారు. 




Updated Date - 2022-08-10T06:41:14+05:30 IST