కిక్కెక్కిస్తున్న.. సరిహద్దు

ABN , First Publish Date - 2021-10-04T04:36:07+05:30 IST

తెలుగు రాష్ట్రాల సరిహద్దు కిక్కెక్కిస్తోంది. ఈ సరిహద్దు ప్రాంతాలు ఏపీలోని మద్యం ప్రియులకు నిలయాలుగా మారాయి.

కిక్కెక్కిస్తున్న.. సరిహద్దు
అలంపూర్‌ చౌరస్తాలోని బహిరంగ ప్రదేశంలో గుంపులుగా కూర్చొని మద్యం తాగుతున్న మందుబాబులు

మద్యం ప్రియులకు అడ్డాగా అయిజ, అలంపూర్‌ మండలాలు

నిర్మానుష్య ప్రదేశాలు, పంట పొలాల్లో సిట్టింగ్‌లు

మద్యం తాగాక సీసాలు పగులగొడుతున్న వైనం

అవి గుచ్చుకుని గాయాలవుతున్నాయంటున్న రైతులు, కూలీలు

పంటలను సైతం నాశనం చేస్తున్నారని ఆవేదన


అయిజ, అక్టోబరు 3: తెలుగు రాష్ట్రాల సరిహద్దు కిక్కెక్కిస్తోంది. ఈ సరిహద్దు ప్రాంతాలు ఏపీలోని మద్యం ప్రియులకు నిలయాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడ కావలసిన బ్రాండ్ల మద్యం దొరుకుతోంది. దాంతో రాయలసీమ సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణ రాష్ట్రంలోని అయిజ మండలం పులికల్‌, రాజాపూర్‌, కేశవరం, చిన్నతాండ్రపాడు, వేణిసోంపూర్‌, రాజోలి, ఉండవల్లి, అలంపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో, అలంపూర్‌ చౌరస్తాలో మద్యం ప్రియులు మద్యం తాగుతున్నారు. అనుమతి ఉన్న ప్రాంతాలతో పాటు అనుమతి లేని ప్రాంతాల్లోనూ మద్యం తాగుతున్నారు. అనుమతి లేని ప్రాంతాలలో సైతం కావలసిన మద్యం దొరుకుతోంది. నిర్మానుష్య ప్రదేశాలు, పంట పొలాలు, చెట్ల కింద మందు తాగుతున్నారు. ఈ క్రమంలో పంట పొలాల్లో మల, మూత్ర విసర్జన చేయటంతో పాటు ఖాళీ సీసాలను పగులగొడుతున్నారు. పంటను సైతం నాశనం చేస్తున్నారని రైతులు అంటున్నారు. సీసాలు పగులగొట్టడం వల్ల పెచ్చులు గుచ్చుకుని గాయాలవుతున్నాయని రైతులు, కూలీలు వాపోతున్నారు. 


అలంపూర్‌ చౌరస్తాలో బహిరంగంగా..

అలంపూర్‌ చౌరస్తా ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. అభ్యంతరం చెప్పిన వారిపై దాడికి దిగుతున్నారు. మహిళల తో అసభ్యంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరోరకంగా వేధిస్తున్నారని అంటున్నారు. ఇటీవల రాజోలి ప్రాంతంలో విచారణకు వచ్చిన పోలీసు అధికారులకు చుక్కెదురయ్యింది. పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మద్యం ప్రియుల ఆట కట్టించాలని పలువురు కోరుతున్నారు.


మద్యం మత్తులో మైనర్లు

మైనర్లు సైతం మద్యం సేవిస్తున్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసలు కావటంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదన్న నిబంధన అమలవడం లేదు.


కట్టడి చర్యలు చేపట్టాం

సరిహద్దు ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తుల ఆగడాలకు కళ్లెం వేస్తున్నాం. అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. వారు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నాం. మద్యం సేవించిన వారు ఇబ్బందులు కలిగిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి.

- రంగస్వామి, డీఎస్పీ 





Updated Date - 2021-10-04T04:36:07+05:30 IST