సకల జనులను దంచు!

ABN , First Publish Date - 2022-07-06T07:44:21+05:30 IST

సకల జనులను దంచు!

సకల జనులను దంచు!

రూ.5 వేల కోట్ల పిండుడే టార్గెట్‌ 

వృత్తిపన్ను పేరుతో ఏటా పిండేద్దాం

నొప్పి తెలియకుండా బాదేద్దాం

ప్రైవేటు రంగంపై జగన్‌ సర్కారు కన్ను

లాయర్లు ఫీజులు తీసుకునే కోర్టుల్లో కేసులు వాదిస్తున్నారు

డాక్టర్లు లక్షలు సంపాదిస్తున్నారు

వారిపై వృత్తి పన్ను వేయాల్సిందే

నర్సులు, పారామెడికల్‌, డ్రైవర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్ల నుంచీ వసూలు

వడ్రంగి, క్షౌరశాలలనూ వదలొద్దు

జోరుగా సాగుతున్న లాండ్రీల వ్యాపారాన్నీ టాక్స్‌ పరిధిలోకి తెద్దాం

కారు, బైక్‌ మెకానిక్‌లను కూడా..

రిజిస్ట్రేషన్‌ లేని సర్వీసు సెంటర్ల నుంచీ..

ఆదాయార్జన శాఖలకు ‘పెద్దల’ టార్గెట్‌

వడ్రంగి నుంచి క్షురకుల దాకా ఎవర్నీ వదలొద్దు


సీఎం జగన్‌ ఏలుబడిలో కాదెవరూ బాదుడుకు అనర్హం. న్యాయవాదులు, వైద్యులతోపాటు కారు, బైకు మెకానిక్‌లు, చిన్నాచితక వడ్రంగుల వరకు ఎవరైనా వృత్తి పన్ను చెల్లించాల్సిందే. మాకు డబ్బు కావాలంతే..! ఎవరి నుంచి ఎంత గుంజాలి.. ఏ వృత్తిలో ఉన్నవారిని ఎలా పీల్చి పిప్పిచేయాలి.. ఏవేవి తెగనమ్మాలి.. మీరు ఏమైనా చేయండి. జనం నుంచి మాత్రం డబ్బు రాబట్టాలి. ఏడాదికి కనీసం ఐదు వేల కోట్లకు తగ్గకుండా పిండేయాలి. గాటు కనబడకూడదు. నొప్పి తెలియకూడదు.. అంతా సైలెంట్‌గా జరిగిపోవాలి.. లక్ష్యాలను చేరాల్సిన బాధ్యత కార్యదర్శులదే. ఇదీ.. జగన్‌ ప్రభుత్వం వివిధ శాఖలకు ఇచ్చిన హుకుం. పన్నుల ప్రతిపాదనలను ఆయా శాఖలు తయారుచేసి పంపితే.. సీఎంను ఒప్పించి అమలు చేద్దామని చెప్పడం విశేషం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వేల కోట్ల ఆదాయం వస్తున్నా.. లక్షల కోట్ల అప్పులు దూసితెస్తున్నా.. జగన్‌ సర్కారుకు ధనదాహం తీరడం లేదు. ప్రజలకు నొప్పి కలగకుండా వారినెలా బాదాలో కొందరు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తీవ్ర కసరత్తు చేస్తూ.. తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేస్తున్నారు. ప్రైవేటు రంగంలో ఏయే వృత్తులవారిని పన్నుల పరిధిలోకి తేవాలి.. వారి ఆదాయంపై వాణిజ్య పన్ను ఎలా వసూలు చేయాలో అధికారులకు ఆదేశాలిస్తున్నారు. లాయర్లు, జర్నలిస్టులు, కన్సల్టెంట్లు, వ్యాపారులు, వైద్యులతో పాటు ఆస్పత్రుల్లో నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది. క్షౌరశాలలు, వడ్రంగి వర్క్‌షాఫులు, ప్రైవేటు లాండ్రీ సర్వీసులు, చెప్పులు, తోలు ఉత్పత్తుల తయారీ, విక్రయాలు.. ఇలా ఏయే వృత్తిదారుల నుంచి ఎంత మేరకు వృత్తి పన్ను రాబట్టాలో లెక్కలు వేసి.. ఆ మేరకు వడ్డించి నడ్డివిరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల కిందట రెవెన్యూ ఆర్జించే శాఖల విభాగాధిపతులతో ఓ కీలక సమావేశం జరిగింది. లోగడ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలకు కోతపెట్టే ప్రతిపాదనలిచ్చి హడావుడి చేసిన కీలక అధికారి కూడా ఇందులో పాల్గొన్నారు. వృత్తి పన్ను వసూళ్లతోపాటు, ఆదాయం తెచ్చుకునే మార్గాలపై చర్చ జరిగింది. సదరు అధికారి ఆ సందర్భంగా ఇచ్చిన టార్గెట్‌ చూసి విభాగాధిపతులకు మతిపోయినంత పనైంది. ఆయన ప్రజంటేషన్‌ చూసి అధికారులు విస్తుపోయారు. మీరే ప్రతిపాదనలు పంపండి.. ముఖ్యమంత్రిని ఒప్పించి అమలు చేద్దామని ఆ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. ఆదాయం మాత్రం రావలసిందేనని కీలక పెద్దలు తేల్చిచెప్పడంతో.. ఎవరి నుంచి ఎంత.. ఎలా పిండాలన్న లెక్కలు వేయడంలో అధికారులు బిజీ అయ్యారు. సదరు భేటీకి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఒక చిన్న పొరపాటు వల్ల ఏటా వెయ్యి కోట్ల ఆదాయం తగ్గిపోయింది.. ఇప్పుడు ఈ ఆదాయాన్ని తిరిగి నిలబెట్టుకోవడంతోపాటు కొత్తగా వృత్తి పన్నుల వసూళ్లపై దృష్టిపెట్టాలని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. కొత్తగా, అదనంగా రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేలా ఆ ప్రజంటేషన్‌ ఉంది. రిజిస్ట్రేషన్‌, వాణిజ్య పన్నుల రూపంలో కొత్తగా 3 వేల కోట్ల అదనపు ఆదాయం టార్గెట్‌గా పెట్టినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్‌ శాఖలో నిబంధనలను సవరించి కొత్తగా రూ.800 కోట్ల ఆదాయం ఆర్జించాలని.. మిగిలిన మొత్తాన్ని వృత్తిపన్నులు, భూముల క్రమబద్ధీకరణ రూపంలో తీసుకురావాలని ప్రతిపాదించినట్లు సమాచారం.


క్రమబద్ధీకరణ చెల్లింపులేవీ..?

ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చినా  రెవెన్యూ శాఖ సరిగ్గా అమలు చేయడం లేదన్న అసంతృప్తి సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రజలు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదని రెవెన్యూ అధికారులు బదులిచ్చినట్లు తెలిసింది. ‘గతంలో వంద గజాలు ఉచితంగా క్రమబద్ధీకరణ అని నిబంధన ఉంది. 100 గజాలపైన ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈసారి 75 గజాలకే ఉచితమన్నారు. అందులోనూ అనేక ఆంక్షలు ఉన్నాయి. 76 నుంచి 150 గజాల వరకు 75 శాతం విలువ, 150 నుంచి 300 గజాల వరకు 100 శాతం బేసిక్‌ విలువను ఖరారు చేశాం. ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం లేదు. దీంతో ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. అయినా ప్రయత్నం చేస్తున్నాం’ అని వారు పేర్కొన్నట్లు సమాచారం. ‘1954 నుంచి ఇప్పటి వరకు వివిఽధ వర్గాల పేదలకిచ్చిన సాగు భూములకు పూర్తి హక్కులు కల్పించి వాటిని వారి పేరిటే రిజిస్ట్రేషన్‌ చేస్తే ఆదాయం వస్తుంది కదా! దీనివల్ల ఇటు ప్రభుత్వానికీ మంచి పేరు, ఆదాయం వస్తాయి కదా! ఇనాం భూములను కూడా రెగ్యులరైజ్‌ చేస్తే ఆదాయం వస్తుంది. ఇప్పటికే అనేక రెవెన్యూ కోర్టుల్లో ఇనాం, ఎస్టేట్‌ భూములున్నాయి. వాటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటే పరిశీలించండి’ అని సూచించినట్లు తెలిసింది. అయితే భూముల విషయంలో ఈ ప్రతిపాదనలు వర్కవుట్‌ కావని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ‘పేదలకు ఇచ్చిన భూముల విలువ రూ.వేలు-లక్షల కోట్లలో ఉంటుంది. కానీ ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిగ్గా 1,000 కోట్లు కూడా ఉండకపోవచ్చు. ఇనాం భూముల విషయంలో అనేక చట్టపరమైన వివాదాలున్నాయి. వాటిని ప్రైవేటు పార్టీలకు అనుకూలంగా సెటిల్‌ చేయడం కుదరదు’ అని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయినా సరే.. ముందు తమకు ప్రతిపాదనలు పంపించాలని కీలక అధికారి సూచించినట్లు తెలిసింది. వాటిని ముఖ్యమంత్రి పరిశీలనకు తీసుకెళ్తామని, అక్కడ సాధ్యాసాధ్యాలపై చర్చిద్దామని చెప్పినట్లు సమాచారం. త్వరలో మళ్లీ సమావేశమై.. పన్నులు వసూలు చేసే అంశాలు.. ఎంత మేరకు టార్గెట్‌ ఉంటే బాగుంటుందో స్పష్టమైన నివేదికలతో చర్చిద్దామని నిర్ణయించినట్లు సమాచారం. ఇలాంటి చిన్న చిన్న వృత్తిదారుల నుంచి పన్నులు వసూలు చేస్తే.. ప్రజలకు ఏ సర్వీసైనా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందా.. వారు జనాన్ని పిండేయరా.. అంతిమంగా భారం పడేది ప్రజలపైనేనని  ఆయా శాఖల అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.


 వీరందరినీ బాదాల్సిందే..!

వృత్తి పన్నులకు సంబంధించిన టార్గెట్లను పై భేటీలో వివరించారు. ‘న్యాయవాదులు వృత్తి పన్నుల పరిధిలోకే వస్తారు. వారు ఫీజులు తీసుకునే కోర్టుల్లో కేసులు వాదిస్తున్నారు. కాబట్టి వారు కూడా వృత్తి పన్ను చెల్లించాల్సిందే. వైద్యులు, అందులో ఉప కేటగిరీల పరిధిలోకి వచ్చే నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, చివరకు డ్రైవర్లు సైతం వృత్తిపన్నుల పరిధిలోకి వచ్చేవారే. ప్రైవేటు రంగంలో ఆయా కేటగిరీల్లో ఉన్నవారు వృత్తి పన్ను చెల్లించడం లేదు. వైద్యుల వేతనాలు భారీగా లక్షల్లో ఉంటాయి. కొందరైతే అఖిల భారత సర్వీసు అధికారులకంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. కానీ వారు వృత్తి పన్ను చెల్లించడం లేదు. నర్సింగ్‌, పారామెడికల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు,  ఇతర విభాగాల సిబ్బంది నుంచీ వృత్తిపన్ను వసూలు చేయాల్సిందే’ అని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. చేతివృత్తులపై కూడా చర్చ జరిగింది. సెలూన్లు, క్షౌరశాలలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని.. ఏసీ సెలూన్లు కూడా అందుబాటులోకి వచ్చాయని.. వీరెవరి నుంచీ వృత్తి పన్నులు వసూలు చేయడం లేదని.. ఇలాగైతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఇకపై ఈ వృత్తి పన్ను వసూలు పెరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలదేనని తేల్చిచెప్పారు. ‘ఫర్నిచర్‌ తయారు చేస్తున్న వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండానే విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయంలో వాణిజ్య పన్నుల శాఖ సరైన దృష్టిపెట్టడం లేదు. భారీ షాపులు, షోరూమ్‌లపైనే పడిపోతున్నారు. కానీ పన్ను పరిధిలోకి వచ్చే చిరు, మధ్య తరహా వ్యాపారులు, వర్క్‌షాపులను వదిలేస్తున్నారు. ఇకపై వీరి నుంచీ పన్నులు వసూలు చేయాల్సిందే. ప్రైవేటు లాండ్రీ సర్వీసులు మున్సిపాలిటీలు, నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. అవి పన్నుల పరిధిలో ఉన్నట్లు కనిపించడం లేదు. వాటిని కూడా పన్నుల పరిధిలోకి తీసుకొచ్చి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసేలా ప్రతిపాదనలు తయారుచేయండి. తోలు ఉత్పత్తుల తయారీ, విక్రయం పేరిట అనేక చిన్న, మధ్యతరహా యూనిట్లు పనిచేస్తున్నాయి. అవి కూడా పన్నులు చెల్లించడం లేదు. బిల్లులు లేకుండానే వ్యాపారాలు చేస్తున్నాయి. వాటి నుంచీ పన్నులు రాబట్టాలి. ఏదైనా ఒక వస్తువును తయారుచేసి అమ్ముతున్నారంటే అందులో వ్యాపార ప్రయోజనం ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయ ప్రయోజనం గురించి మీరు కూడా దృష్టిపెట్టాలి. కారు, బైక్‌, ఇతర ఆటోమొబైల్‌ సర్వీసు కేంద్రాలు వేలల్లో పనిచేస్తున్నాయి. వాటిని పన్నుల పరిధిలోకి తీసుకురాలేదు. లిఖితపూర్వక బిల్లుల చెల్లింపుతో సంబంధం లేకుండానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా కేవలం నేమ్‌బోర్డులతో సర్వీసు సెంటర్లు నిర్వహిస్తున్న వారు అనేకం ఉన్నారు. వాటిల్లోనూ సేవల పేరిట కోట్లాది రూపాయల లావాదేవీలు నడుస్తున్నాయి. అలాంటి వాటి నుంచి వృత్తిపన్నుతోపాటు ఇతర పన్నులు కూడా వసూలు చేయాలి. అవి లిఖితపూర్వక బిల్లులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది’ అని అధికారులకు ప్రతిపాదించినట్లు తెలిసింది. అంటే  వృత్తి పన్నుతోపాటు వచ్చే ఆదాయం, లావాదేవీలపై వాణిజ్య పన్ను రూపంలో కూడా వసూలు చేయాలని నిర్దేశించారు.


లాయర్లు గుర్రు

తమ నుంచి వృత్తి పన్ను వసూలు చేయాలన్న ప్రతిపాదనలను లాయర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలువురు హైకోర్టు న్యాయవాదులు ఇటీవల అడ్వకే ట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ నుంచి వృత్తిపన్ను వసూలు చేయడం ఏమిటని అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జిల్లాల్లోనూ న్యాయవాద వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-07-06T07:44:21+05:30 IST